సామాన్యుడి హక్కులకు భరోసా ఇవ్వాలి | NHRC chairman kg balakrishnan comments on civil rights | Sakshi
Sakshi News home page

సామాన్యుడి హక్కులకు భరోసా ఇవ్వాలి

Apr 23 2015 1:40 AM | Updated on Sep 3 2017 12:41 AM

సమాజంలోని సామాన్యుల హక్కులకు ప్రభుత్వాలు భరోసా కల్పించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) చైర్మన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ సూచించారు.

సాక్షి, హైదరాబాద్: సమాజంలోని సామాన్యుల హక్కులకు ప్రభుత్వాలు భరోసా కల్పించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) చైర్మన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ సూచించారు. మెరుగైన మానవతా విలువలకు కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిధిలోని వివిధ కేసుల బహిరంగ విచారణ నిమిత్తం ఎన్‌హెచ్‌ఆర్సీ బుధవారం నుంచి మూడురోజుల పాటు హైదరాబాద్‌లో విడిది చేయనుంది. మొదటిరోజు విచారణ ప్రారంభం సందర్భంగా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.


 ఎస్సీ, ఎస్టీలపై వివక్షకు సంబంధించి తమకు లెక్కకు మించి ఫిర్యాదులు వస్తున్నాయని, దేశవ్యాప్తంగా 98 వేల పైచిలుకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఫిర్యాదుల విచారణలో సంబంధిత అధికారులకు, ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసే అధికారం తమకు లేదన్నారు. అయితే, మానవ హక్కుల ఉల్లంఘనలను ఎత్తిచూపడం ద్వారా అధికారులు, ప్రభుత్వాలు తగిన దృష్టి పెట్టేలా కమిషన్ కృషి చేస్తుందని జస్టిస్ బాలకృష్ణన్ పేర్కొన్నారు.
 
 అన్యాయాలను ఎదిరించేందుకు గొంతులేనివారికి గొంతుకగా తమ కమిషన్ పనిచేస్తుందని ఎన్‌హెచ్‌ఆర్సీ రిజిస్ట్రార్ (లా) ఏకే గార్గ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు జస్టిస్ సి.జోసెఫ్, జస్టిస్ మురుగేశన్, ఎస్.సి.సిన్హాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం తరపున ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ముఖ్య కార్యదర్శి లింగరాజ్ పాణిగ్రాహిలు పాల్గొన్నారు. తొలిరోజు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన 61 ఫిర్యాదులను కమిషన్ సభ్యులు విచారించారు.
 
 విచారణ కమిటీలే లేవా!
 పని ప్రదేశాల్లో మహిళలపై జరిగే వేధింపులను విచారించేందుకు కమిటీలు ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమలు కాకపోవడంపై జస్టిస్ మురుగేశన్ విస్మయం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి చేసిన ఫిర్యాదును జస్టిస్ మురుగేశన్ విచారించారు. ఈ సందర్భంగా ఏ జిల్లాలోనూ సదరు కమిటీలు లేవని తెలుసుకుని ఆయన ఆశ్చర్యపోయారు.
 
 ఇది సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘన కాదా? అని ప్రశ్నించారు. వెంటనే అన్ని జిల్లాల్లో విచారణ కమిటీలను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. మరో కేసు విచారణ సందర్భంగా దళితులపై దాడులు జరిగినప్పుడు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయడమే కాకుండా.. ఈ చట్టం కింద బాధితులకు పరిహారం అందేలా చూడాలని జస్టిస్ మురుగేశన్ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement