
క్రూరుడైనా కుక్కలంటే ప్రేమ
క్రూరమైన చరిత్ర.. కరుడుగట్టిన నేరగాడు నయీమ్‌కు తన పెంపుడు కుక్కలంటే అమితమైన ప్రేమ.
* నయీమ్ పెంపుడు కుక్కల
* ఆహారానికి ప్రత్యేక మెనూ
సాక్షి, హైదరాబాద్: క్రూరమైన చరిత్ర.. కరుడుగట్టిన నేరగాడు నయీమ్‌కు తన పెంపుడు కుక్కలంటే అమితమైన ప్రేమ. అల్కాపురి టౌన్‌షిప్‌లో ఉన్న ఇంట్లో నయీమ్ రెండు శునకాలను పెంచాడు. సరిహద్దులో పహారా కోసం భద్రతా బలగాలు వినియోగించే డాల్మటైన్ జాతికి చెందిన ఈ శునకాలను నగరంలోని ఓ కెన్నల్ నుంచి భారీ మొత్తం వెచ్చించి ఖరీదు చేశాడు. వాసన, చిన్నపాటి కదలికలు గుర్తించడంలో దిట్టలైన ఈ శునకాలకు ప్రత్యేకంగా శిక్షణ సైతం ఇప్పించాడని తెలిసింది.
వీటికి శాండో, కోమి అని పేర్లు పెట్టుకున్నాడు. కుక్కల ఆరోగ్యాన్నిపర్యవేక్షించేందుకు నయీమ్ ప్రత్యేకంగా ఓ వెటర్నరీ డాక్టర్‌ను ఏర్పాటు చేశాడు. ఆ శునకాలకు ఆహార, ఆరోగ్య నియమాల్లో ఏమాత్రం తేడా రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. వైద్యుడి సూచనల మేరకు రోజువారీ ఆహారం, టానిక్స్ సంబంధించి ఓ పట్టిక తయారు చేశాడు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ప్రత్యేకంగా బోన్లు పెట్టి, ‘శాండో, కోమిల ఆహార, సమయ సూచిక’ పేరుతో ఓ బోర్డు ఏర్పాటు చేయించాడు.