ఆ న్యాయమూర్తుల నుంచి స్ఫూర్తి పొందుదాం

Morally correct judges must for judiciary: ACJ of Hyderabad High Court - Sakshi

నైతికత అనే పునాదిపై న్యాయవ్యవస్థ నిర్మితమైంది

గణతంత్ర దిన వేడుకల్లో హైకోర్టు ఏసీజే జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌

సాక్షి, హైదరాబాద్‌: స్వీయ ప్రయోజనాలకు కాక వ్యవస్థ విలువలను కాపాడేందుకు ప్రాధాన్యతనిచ్చిన న్యాయమూర్తుల నుంచి న్యాయవ్యవస్థలో ఉన్నవారందరూ స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉందని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ అన్నారు. న్యాయమూర్తుల నైతికత అన్న పునాదిపైనే స్వతంత్ర న్యాయవ్యవస్థ నిర్మితమైందని తెలిపారు. ఈ వ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకు ప్రతీ న్యాయమూర్తి, న్యాయవాది శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

హైకోర్టు ప్రాంగణంలో శుక్రవారం 69వ గణతంత్ర దిన వేడుకలు జరిగాయి. జాతీయ జెండాను ఎగురవేసిన ఏసీజే ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నెహ్రూ కాలంలో జరిగిన ఓ ఉదంతాన్ని వివరించారు. ‘1954లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ పతంజలి శాస్త్రి పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆ పదవిని స్వీకరించాలని జస్టిస్‌ బిజోన్‌ కుమార్‌ ముఖర్జీని ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ కోరారు. ఈ వినతిని జస్టిస్‌ ముఖర్జీ సున్నితంగా తిరస్కరించారు. తనకన్నా సీనియర్‌ ఉండగా, తాను ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టలేనని తేల్చి చెప్పారు.

నెహ్రూ ఒత్తిడి చేయగా, న్యాయమూర్తి పదవికి రాజీనామా చేస్తానే తప్ప పదవిని చేపట్టబోమని అన్నారు. జస్టిస్‌ ఎం.సి.మహాజన్‌ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన తరువాతనే జస్టిస్‌ ముఖర్జీ ప్రధాన న్యాయమూర్తి పదవిని అధిష్టించారు. స్వీయ ప్రయోజనాల కన్నా వ్యవస్థ ప్రయోజనాలను ఉన్నత స్థితిలో నిలిపిన ఇటువంటి న్యాయమూర్తులను అనుసరించి, వారి నుంచి మనం అందరం స్ఫూర్తి పొందాలి’ అని ఆయన పేర్కొన్నారు. రాజ్యంగ రచన ఎలా జరిగింది.. అందుకు కారకులెవరు.. తరువాత పరిణామాలను ఆయన వివరించారు.  

తాత్కాలిక భవనంలో హైకోర్టు తగదు
తాత్కాలిక భవనంలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని  ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చల్లా ధనంజయ తప్పుపట్టారు. దీనిపై అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం న్యాయవాదుల సంఘానికి ఇవ్వాలని ఆయన ఏసీజేను కోరారు. కాగా గణతంత్ర వేడుకల్లో హైకోర్టు విభజన అంశాన్ని లేవనెత్తడంపై ఏసీజే ఒకింత అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఏపీ అడ్వొకేట్స్‌ జనరల్‌ దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి, దమ్మాలపాటి శ్రీనివాస్, తెలంగాణ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జల్లి కనకయ్య ప్రసంగించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top