తెలంగాణలో ప్లాంట్‌ పెట్టండి | Minister Ktr talks with Suzuki company chairman | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ప్లాంట్‌ పెట్టండి

Jan 19 2018 2:06 AM | Updated on Jan 19 2018 2:06 AM

Minister Ktr talks with Suzuki company chairman - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఆటోమొబైల్‌ రంగాన్ని అత్యంత ప్రాధాన్యతా విషయంగా పరిగణిస్తున్నదని, ఈ రంగంలో పెట్టుబడులకు రాష్ట్రంలో అపార అవకాశాలున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. జపాన్‌ పర్యటనలో భాగంగా రెండోరోజు మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలోని రాష్ట్ర బృందం గురువారం అక్కడి షిజువుక రాష్ట్రంలో సుజుకీ  మోటార్స్‌ చైర్మన్‌ ఒసాము సుజుకీతో సమావేశమైంది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, టీఎస్‌ ఐపాస్‌ పనితీరు, సింగిల్‌ విండో విధానంలో అనుమతుల తీరును మంత్రి సుజుకీ  చైర్మన్‌కు వివరించారు.

రాష్ట్రంలో సుజుకీ ప్లాంట్‌ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ప్రభుత్వ విధానాల పట్ల ఆకర్షితులైన సుజుకీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. అనంతరం కేటీఆర్‌ బృందం షిజువుక రాష్ట్ర గవర్నర్‌ కవాకాస్తు హైటాతో సమావేశమై తెలంగాణ, షిజువుక రాష్ట్రాల మధ్య వ్యాపార సంబంధాలపై చర్చించారు. రాష్ట్రంలో ఉన్న వ్యాపార అవకాశాలను పరిశీలించేందుకు రావాలని గవర్నర్‌ను ఆహ్వానించారు. అనంతరం షిజువుక బ్యాంకు ప్రతినిధులతో మంత్రి సమావేశమై రాష్ట్రంలోని బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ రంగాల్లో ఉన్న అవకాశాలను వారికి వివరించారు.

ఈ రంగంలో సేవలందించేందుకు అవసరమైన మానవ వనరులు స్థానికంగా అందుబాటులో ఉన్నాయన్నారు. కేటీఆర్‌ బృందం సకురాయి లిమిటెడ్, స్టాన్లీ ఎలక్ట్రిక్‌ కంపెనీ, ఏఎస్‌టీఐ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై చర్చలు జరిపారు. హైదరాబాద్‌లో ఆటో మొబైల్‌ రంగ విడిభాగాల ఉత్పత్తికి ముందుకు రావాలని ఏఎస్‌టీఐ కంపెనీని మంత్రి ఆహ్వానించారు.


మెట్రో స్టేషన్లలో ఎలక్ట్రిక్‌ వాహనాలు
మెట్రో స్టేషన్ల నుంచి ప్రయాణీకులను సమీప ప్రాంతాలకు చేరవేసేందుకు సుజుకి ఎలక్ట్రిక్‌ వాహనాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఆ సంస్థ తయారుచేస్తున్న గ్రాండ్‌ప్యాట్రియాక్‌ వాహనాలను నగరానికి సరఫరా చేయాలని మంత్రి కేటీఆర్‌ ఆ కంపెనీని కోరగా, వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. మెట్రో ప్రాజెక్టుకు సంబం ధించిన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ను సుజుకీ అధికారులు ఆసక్తిగా వీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement