రాష్ట్రంలోని మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలను ఆదర్శ ఆరోగ్య జిల్లాలుగా కేంద్రం ఎంపిక చేసింది.
ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలను ఆదర్శ ఆరోగ్య జిల్లాలుగా కేంద్రం ఎంపిక చేసింది. ఆ జిల్లాల్లోని ప్రాథమిక ఆస్పత్రుల నుంచి జిల్లా ఆస్పత్రుల వరకు అన్నింటినీ ఆదర్శంగా తీర్చిదిద్దాలనేది కేంద్రం ఉద్దేశం. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కింద వీటిని ఎంపిక చేశారు. వీటిని ఆదర్శంగా తీర్చిదిద్దడంలో కేంద్రం 60% నిధులిస్తుంది. మిగిలిన 40% నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఆయా జిల్లాల్లో ఇటీవల పర్యటించి ఆస్పత్రుల్లో పరిస్థితిని పరిశీలించారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా సర్కారు దవాఖానాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాలన్న వైఖరితో ఉన్నందున రెండు జిల్లాలు ఆదర్శ ఆరోగ్య జిల్లాలుగా ఎంపిక కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రెండేళ్లలో ఈ రెండు జిల్లాల ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు కేంద్రం రూ.5 కోట్ల చొప్పున విడుదల చేయనుంది. మెదక్ జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో లేబర్ రూం వసతులు, డెలివరీలు, మాతా శిశు సంరక్షణ తదితర అంశాలను గుర్తించి దాన్ని ఆదర్శ ఆరోగ్య జిల్లాగా ఎంపిక చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాను వైద్య పరంగా వెనుక బాటును లెక్కలోకి తీసుకుని ఆదర్శ ఆరోగ్య జిల్లాగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. కేంద్ర ప్రకటన నేపథ్యంలో ఆ రెండు జిల్లాల్లోని ఆసుపత్రుల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు.