360 డిగ్రీస్ ‘వ్యూ’

360 డిగ్రీస్ ‘వ్యూ’ - Sakshi


నేరగాళ్లు పేరు మార్చినా పట్టేసే పరిజ్ఞానం

సిద్ధం చేస్తున్న అధికారులు

నాలుగు నెలల్లో అందుబాటులోకి: నాగిరెడ్డి


 

సిటీబ్యూరో:  నేరగాళ్లను కట్టడి చేయడానికి వారి గత చరిత్రను ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో పాటు పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ పక్కాగా చేయడానికి నగర పోలీసు విభాగం సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తోంది. ఇందులో భాగంగానే నగర నిఘా విభాగమైన స్పెషల్  బ్రాంచ్ (ఎస్బీ) ‘360 డిగ్రీస్ వ్యూ’ పేరుతో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపకల్పనకు సన్నాహాలు చేస్తోంది.



ఐదు జోన్లు... వేల కేసులు

ఏటా 18 వేలకు పైగా కేసులు నమోదయ్యే సిటీ కమిషనరేట్‌లో... నిందితులందరినీ పోలీసు అధికారులు గుర్తుంచుకోవడం కష్టం. దీనికి తోడు నగరంలో ఉన్న ఐదు జోన్లలో ఓ జోన్ పరిధిలో అరెస్టయిన వ్యక్తి పూర్తి సమాచారం మరో జోన్ అధికారుల వద్ద అందుబాటులో ఉండదు. ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో ఇది కొంత వరకు అమలవుతున్నా... పాస్‌పోర్టుల వెరిఫికేషన్ లో పూర్తి స్థాయిలో ఫలితాలు ఉండడం లేదు. దీనికితోడు నేరగాళ్ల ఎత్తులు అధికారులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.



పేర్లు మారుస్తూ తప్పుదారి...

నగర పోలీసులు గడిచిన ఏడాది కాలంగా ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్‌ను విస్తృతంగా వినియోగిస్తున్నారు. పదేపదే నేరాలు చేసే వారిని గుర్తిస్తూ... ఏకకాలంలో మూడు కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై దీన్ని ప్రయోగిస్తున్నారు. ఈ భయానికి తోడు వరుసగా నేరాలు చేసే వారిలో కొందరు తమ చరిత్ర వెలుగులోకి రాకుండా ఉండేందుకు కొత్త ఎత్తులు ప్రారంభించారు. ఓసారి అరెస్టయినప్పుడు ఇంటి పేరు ముందు... అసలు పేరు వెనుక చెబుతూ... మరోసారి తన పేరు ముందు... ఇంటి పేరు వెనుక చెప్పడంతో పాటు పేర్లలో కొన్ని మార్పులు చేస్తున్నారు.

 

మార్పుచేర్పులు చేస్తూ...

ఇలాంటి ‘మార్పిడిగాళ్లు’ పూర్తిగా తమ పేర్లను మార్చరు. అరెస్టయిన ప్రతిసారీ బెయిల్ కోసం న్యాయస్థానంలో ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. తప్పుడు పేరు చెబితే అక్కడ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఎక్కువగా స్పెల్లింగ్ మార్చేస్తూ కథ నడుపుతున్నారు. ఉదాహరణకు చివరలో ‘అయ్య’ అని వచ్చే పేరునే తీసుకుంటే ఓసారి అరెస్టయినప్పుడు చివరి అక్షరాలు ‘డడ్చ’గా... మరోసారి చిక్కినప్పుడు దీన్ని ‘జ్చీజి’గా రాస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. ఇటీవల ఈ తరహా కేటుగాళ్ల సంఖ్య పెరిగినట్లు పోలీసు విభాగం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ‘360 డిగ్రీస్ వ్యూ’కు సన్నాహాలు చేస్తోంది.

 

ఏకతాటిపైకి పబ్లిక్ డేటాబేస్‌లు


ఈ సాఫ్ట్‌వేర్‌లో నగర పోలీసు కమిషనరేట్‌కు సంబంధించి అరె స్టయిన వ్యక్తుల వివరాలతో పాటు ఇతర విభాగాలకు చెందిన డేటాబేస్‌లైన డ్రైవింగ్ లెసైన్స్, రేషన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డుల పూర్తి వివరాలను సర్వర్‌కు అనుసంధానిస్తారు. తమ కు కావాల్సిన వ్యక్తి పేరుతో పాటు ఇతర వివరాలు ‘సెర్చ్’ చేయడానికి ఉపక్రమిస్తే... అందుబాటులో ఉన్న సమాచారం పొందుపరిస్తే సరిపోతుంది. ఈ సాఫ్ట్‌వేర్ వీటన్నింటినీ సెర్చ్ చేసి ఆ వ్యక్తి పేర్లు మార్చుకున్నా వివరాలన్నింటినీ అందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా  అన్ని జిల్లా లు, కమిషనరేట్ల నేరగాళ్ల వివరాలనూ ఈ డేటాబేస్‌లో పొందుపరచాలని అధికారులు నిర్ణయించారు.

 

 

‘వెరిఫై’కి భిన్నంగా ‘360’

నగర పోలీసు విభాగం ఇప్పటికే ‘వెరిఫై 24/7’ పేరుతో రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో దేశంలోని 19 వేల కోర్టుల్లో ఉన్న డేటాను అనుసంధానించింది. దీనిలో కేవలం కేసుల దర్యాప్తు పూర్త యి, చార్జ్‌షీట్లు దాఖలైన వారి వివరాలే ఉంటాయి. ‘360’లో ఎఫ్‌ఐఆర్ జారీ అయితే చాలు. వారం రోజుల్లో టెండర్లు పిలవాలని భావిస్తున్నాం. నాలుగు నెలల్లోగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. పోలీసు విభాగం కంప్యూటర్లతో పాటు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, సెల్‌ఫోన్ల నుంచీ ‘సెర్చ్’ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. పాస్‌పోర్టుల వెరిఫికేషన్‌కు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది.                                         - వై.నాగిరెడ్డి, అదనపు పోలీసు కమిషనర్, ఎస్బీ

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top