పాస్‌పోర్ట్‌ తనిఖీ పేరుతో పోకిరీ పోలీస్‌..

Ghaziabad Woman Shares How Cop Asked For Hug During Passport Verification - Sakshi

సాక్షి, న్యూడిల్లీ : దేశంలో మహిళలకు ఇంట్లో సైతం భద్రత లేదనేందుకు మరో ఉదంతం చోటుచేసుకుంది. ఘజియాబాద్‌కు చెందిన మహిళా జర్నలిస్ట్‌ ఓ పోలీస్‌ అధికారి చేతిలో గురైన లైంగిక వేధింపులను ప్రస్తావించారు. తన పాస్‌పోర్ట్‌ను తనిఖీ చేసేందుకు తన ఇంటికి వచ్చిన దేవేంద్ర సింగ్‌ అనే పోలీస్‌ అధికారి ఆమెను వేధించాడు. ప్రముఖ పత్రికలో పనిచేసే శ్వేతా గోస్వామి తనకు ఎదురైన వేధింపులను ట్వీట్‌ చేస్తూ హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌, ఘజియాబాద్‌ పోలీసులకు ట్వీట్‌ చేశారు.

మహిళా దరఖాస్తుదారుల పాస్‌పోర్ట్‌లకు పోలీస్‌ వెరిఫికేషన్‌ ఎంత దారుణంగా ఉందో కొద్ది క్షణాల కిందట ఘజియాబాద్‌లో తనకు ఎదురైన అనుభవం వెల్లడిస్తోందని ఆమె పోస్ట్‌లో పేర్కొన్నారు. పోలీస్‌ అధికారి వెళ్లే వరకూ తనకు సాయంగా ఉండాలని తన హెల్పర్‌ను కోరాల్సివచ్చిందన్నారు.

పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌ కోసం వచ్చిన పోలీస్‌ అధికారి ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తూ అవకాశం కోసం చూశాడని చెప్పారు. ‘మీ వెరిఫికేషన్‌ను పూర్తిచేశాను.. మరి నాకేమి ఇస్తారంటూ’ తనను కౌగిలించుకోవాలని అడిగాడన్నారు. ఆ పోలీస్‌ అధికారి పేరు దేవేంద్ర సింగ్‌ అని ఆమె ట్వీట్‌ చేశారు. పోకిరీ పోలీస్‌పై ఉన్నత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top