బాబోయ్ ‘గ్రేటర్’ బాధలు! | greater hyderabad people sufferings from high temparature | Sakshi
Sakshi News home page

బాబోయ్ ‘గ్రేటర్’ బాధలు!

May 23 2015 2:58 AM | Updated on Sep 3 2017 2:30 AM

రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ డిమాండు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. మండుతున్న ఎండలకు తోడు గృహ, వాణిజ్య విద్యుత్ వినియోగం ఒక్కసారిగా రెట్టింపు కావడంతో వారికి దిక్కుతోచడం లేదు.

- ఎండ తీవ్రత, ఒత్తిడితో కరిగిపోతున్న కేబుళ్లు  
- ఆయిల్ లీకేజీలతో పేలుతున్న ట్రాన్స్‌ఫార్మర్లు
- అనధికారిక కోతలపై గ్రేటర్ వాసుల ఆందోళన.. అధికారులకు ముచ్చెమటలు

 
హైదరాబాద్: రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ డిమాండు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. మండుతున్న ఎండలకు తోడు గృహ, వాణిజ్య విద్యుత్ వినియోగం ఒక్కసారిగా రెట్టింపు కావడంతో వారికి దిక్కుతోచడం లేదు. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ చరిత్రలోనే గురువారం హైదరాబాద్‌లో అత్యధికంగా 52.0 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది.

ఈ డిమాండ్‌కు పగటి ఉష్ణోగ్రతలు తోడవ్వడంతో ఒత్తిడిని తట్టుకోలేక డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కుప్పకూలుతోంది. గురువారం ఘన్‌పూర్‌లోని ట్రాన్స్‌కోకు చెందిన 400 కేవీ సబ్‌స్టేషన్‌లో ఓ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోవడానికి ఇదే కారణమని నిపుణులు అంటున్నారు. అక్కడి నుంచి బండ్లగూడ 220 కేవీ సబ్‌స్టేషన్‌కు సరఫరా నిలిచింది. కొత్తపేట, నాగోలు, హయత్‌నగర్, వనస్థలిపురంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

కేబుళ్లు కరిగి పోయి...
పగటి ఉష్ణోగ్రతల ధాటి, పెరిగిన విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోలేక మాదాపూర్, కళ్యాణ్‌నగర్, అయ్యప్పసొసైటీ, హైదర్‌గూడ, చంచల్‌గూడ, ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌లోని 11 కేవీ యూజీ కేబుళ్లు కరిగిపోయి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆయిల్ లీకేజీలను అరికట్టక పోవడంతో నాంపల్లి, జూబ్లీహిల్స్, పంజేషా, శ్రీరమణ కాలనీలోని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లలో కాయిల్స్ కాలి పోయాయి.

కొన్ని చోట్ల వెంటనే పునరుద్ధరించినప్పటికీ...అర్ధరాత్రి వరకు సరఫరా నిలిచింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని ఓ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌కు ఉన్న ఫ్యూజ్ వైరు ఎండతీవ్రతకు కరిగిపోయింది. సకాలంలో గుర్తించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించక పోవడంతో ఆ ప్రాంతంలోని వారంతా శుక్రవారం తెల్లవారుజాము 3 గంటల వరకు అంధకారంలో మగ్గారు. ఉక్కపోత ఆపై ఇంట్లో కరెంట్ కూడా లేక పోవడంతో సిటిజన్లు న రక యాతన అనుభవించారు.
 
ఈఎల్‌ఆర్ పేరుతో ఎడాపెడా ‘కోత’...
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో 52 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో ఒక్క గ్రేటర్‌లో 38 లక్షలు ఉన్నాయి . డిస్కం పరిధిలో ప్రస్తుతం 4వేల మెగావాట్లకు పైగా విద్యుత్ సరఫరా అవుతుండగా, దీనిలో 2,400 మెగావాట్లు గ్రేటర్ హైదరాబాద్‌కు సరఫరా అవుతోంది. డిమాండ్‌కు సరఫరాకు మధ్య భారీ వ్యత్యాసం నమోదు అవుతుండటంతో ఒత్తిడితో ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి.

పగటి ఉష్ణోగ్రతలకు డిస్ట్రిబ్యూషన్ లైన్లు దెబ్బతినే ప్రమాదం ఉండటంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యలో భాగంగా అత్యవసర లోడ్ రిలీఫ్ పేరుతో మధ్యాహ్నం, సాయంత్రం అనధికారిక కోతలు అమలు చేస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఇంట్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు పని చేయడం లేదు. పగలే కాకుండా అర్థరాత్రి కూడా ఈఎల్‌ఆర్‌లు అమలు చేస్తుండటంతో నగరవాసులు తట్టుకోలేకపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement