చాక్లెట్ల రూపంలో గంజాయి విక్రయాలు 

In the form of chocolate Marijuana sales - Sakshi

చాక్లెట్‌ల రూపంలో గంజాయి విక్రయిస్తున్నఇద్దరి అరెస్ట్‌   

8.4 కిలోలల 1400 గంజాయి చాక్లెట్ల స్వాధీనం 

సాక్షి సిటీబ్యూరో/బాలానగర్‌ : గంజాయి స్మగ్లర్లు రూటు మార్చారు.నేరుగా సరఫరా చేస్తే దొరికిపోతామనే భయంతో కొత్త పుంతలు తొక్కి దందాను కొనసాగిస్తున్నారు. నగరంతో పాటు, శివార్లలోని యువత, ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా కొత్త పంథాలో సాగుతున్న గంజాయి దందాకు బాలానగర్‌ ఎక్సైజ్‌ అండ్‌ ప్రోహిబిషన్‌ అధికారులు చెక్‌ పెట్టారు. చాక్లెట్ల రూపంలో తయారుచేసి పాన్‌ షాపులలో అమ్ముతున్న వ్యక్తితో పాటు, అతడికి సరఫరా చేసిన వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాలానగర్‌ ఎక్సైజ్‌ ప్రోహిబిషన్‌ పొలీసులకు ఫతేనగర్‌లోని పైప్‌లైన్‌ రోడ్డులో ఉన్న పాన్‌షాపులో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారనే సమాచారంతో నిఘా ఏర్పాటు చేశారు.

శనివారం పాన్‌షాపుపై దాడి చేయడంతో 80 గంజాయి చాక్లెట్లు దొరికాయి. అమ్ముతున్న పాన్‌షాపు నిర్వాహకుడు మిహిర్‌ను పొలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అదే ప్రాంతంలో బాలాజీ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన అనిల్‌ అగర్వాల్‌ సరఫరా చేశాడని తెలిపాడు. అతడి దుకాణంపై దాడి చేయగా 35 ప్యాకెట్లలలో ప్యాక్‌ చేసి ఉన్న 1400 గంజాయి చాక్లెట్లు లభించాయి. 8 కేజీల 400 గ్రాముల గంజాయి చాక్లెట్లను సీఐ జీవన్‌కిరణ్, ఎస్‌ఐ మహేందర్‌ ఇతర సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. వీరికి మంగళ్‌హట్‌కు చెందిన ఒక వ్యక్తి సరఫరా చేశాడని ప్రాధమికంగా సమాచారం ఇవ్వడంతో సెల్‌ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా విచారణ చేపట్టారు.

పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకై..
స్మగ్లర్లు గంజాయి ఆకులను ముద్దలాగా చేసి చాక్లెట్లలా తయారుచేశారు. ఆకర్షణీయంగా ఉండే ప్యాకింగ్‌ కూడా వేయడంతో సాధారణంగా రవాణా చేసే సమయంలో పోలీసులు తనిఖీలు నిర్వహించినా పెద్దగా ప్రమాదం ఉండదు. దీంతో ఇదే సులువైన మార్గం అని ఎంచుకున్నారు. నడి రోడ్డుపైన ఉన్న పాన్‌ షాప్‌లో ఉంచి  యధేచ్చగా విక్రయిస్తున్నారు.
 
ఒరిస్సా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు సరఫరా చేశారా....         
హైదరాబాద్‌ నగరంతో పాటు శివార్లలో ఉండే యువత, ఐటీ ఉద్యోగులు, ఒరిస్సా, పశ్చిమబెంగాల్‌కు చెందిన వారిని టార్గెట్‌గా చేసుకుని ఇలా కొత్త పంథాలో గంజాయిని సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది.   ఇది పక్కాగా ఒరిస్సా, పశ్చిమబెంగాల్‌కు చెందిన వారి పని అని పోలీసులు  అనుమానిస్తున్నట్లుగా తెలుస్తోంది. బాలానగర్‌ ఎక్సైజ్, ప్రొహిబిషన్‌ పొలీసులకు 6 నెలల క్రితం కూడా సుమారు 300 గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి.  గతంలో రాజేంద్రనగర్‌ ఎక్సైజ్‌ పొలీసులకు కూడా గంజాయి చాక్లెట్లు సరఫరా చేసే ముఠా పట్టుబడింది.  

గంజాయి స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడ్డ విద్యార్థులు
కుత్బుల్లాపూర్‌: చెడు వ్యసనాలకు బానిసలైన ఇద్దరు విద్యార్థులు సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశతో గంజాయి స్మగ్లింగ్‌ చేస్తూ ఎక్సైజ్‌ పోలీసులకు పట్టుబడ్డారు. కుత్బుల్లాపూర్‌ ఎక్సైజ్‌ సీఐ సహదేవ్‌ తెలిపిన మేరకు.. కామారెడ్డిజిల్లా ఎల్లారెడ్డి ప్రాంతానికి చెందిన  ఇంజినీరింగ్‌ విద్యార్థి జి.మహేశ్‌కుమార్‌ (22),  రంగారెడ్డి జిల్లా మాడ్గుల్‌ మండలానికి చెందిన అన్వేష్‌రెడ్డి (22) స్నిహితులు. వీరిద్దరు సులువుగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తీసుకు వచ్చి విద్యార్థులకు విక్రయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందడంతో మేడ్చల్‌ జిల్లా ఎక్సైజ్‌ అధికారి గణేశ్‌ గౌడ్‌ ఆదేశాలతో శనివారం సూరారం చౌరస్తాలో మహేశ్‌కుమార్, సుచిత్రలోని లయోలా కళాశాల గేటు వద్ద అన్వేష్‌ రెడ్డి లను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు రెండు కిలోల గంజాయితో పాటు రెండు సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.  దాడుల్లో ఎక్సైజ్‌ సీఐ సహదేవ్, వెంకటేశ్వరరావు, సత్తార్, శ్రీనివాస్, సంజయ్, చెన్నయ్య, జ్యోతిలు ఉన్నారు.

 
గంజాయి విక్రయిస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్‌ పోలీసులు

  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top