14 నుంచి తెలుగు వర్సిటీ ప్రవేశ పరీక్షలు

14 నుంచి తెలుగు వర్సిటీ ప్రవేశ పరీక్షలు


హైదరాబాద్: శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తెలంగాణ ప్రాంతానికి ప్రకటించిన వివిధ కోర్సులకు ఈ నెల 14 నుంచి 17 వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కె.తోమాసయ్య ఒక ప్రకటనలో తెలిపారు. 14న ఎం.ఎ. తెలుగు, పి.హెచ్.డి తెలుగు, ఎం.ఎ సంగీతం, పి.హెచ్.డి తులనాత్మక అధ్యయనం కోర్సులకు పరీక్షలు జరుగుతాయి. 15న ఎం.సి.జె, ఎం.పి.ఎ రంగస్థల కళలు, పి.హెచ్.డి నృత్యం, పి.హెచ్.డి రంగస్థల కళలు, పి.హెచ్.డి. భాషా శాస్త్రం కోర్సులకు పరీక్షలు ఉంటాయి.


16 న ఎం.పి.ఎ జానపద కళలు, ఎం.ఎ. భాషాశాస్త్రం, పి.హెచ్.డి జ్యోతిష్యం కోర్సులకు హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలోనూ, 17న పి.హెచ్.డి జానపద గిరిజన విజ్ఞానం కోర్సుకు వరంగల్ పీఠంలోనూ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఎం.ఎ సంగీతం, ఎం.పి.ఎ రంగస్థల కళలు, జానపద కళల కోర్సులకు మధ్యాహ్నం ప్రాయోగిక పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.

 

ఓపెన్ డిగ్రీ ప్రవేశాలకు చివరి గడువు 17

హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో మూడేళ్ల డిగ్రీ కోర్సు (బీఏ, బీకాం, బీఎస్సీ)లో చేరేందుకు ఈ నెల 17 ఆఖరు తేదీ అని హైదరాబాద్‌లోని విద్యానగర్ వర్సిటీ స్టడీసెంటర్ కో ఆర్డినేటర్ వి.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత సాధించి వారు, ఇంటర్మీడియెట్, ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసిన వారు ప్రవేశాలకు అర్హులని చెప్పారు. వివరాలకు విద్యానగర్‌లోని స్వామి వివేకానంద డిగ్రీ కళాశాలలోని అంబేడ్కర్ వర్సిటీ అధ్యయన కేంద్రంలోగాని, 040 2005 1557 నంబర్‌లో గాని సంప్రదించాలన్నారు.

 

18న ఓయూసెట్ ఎంఈడీ కౌన్సెలింగ్

హైదరాబాద్: ఓయూసెట్-2015లో భాగంగా ఎంఈడీ కోర్సులో ప్రవేశానికి తొలిసారిగా ఈ నెల 18న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పీజీ అడ్మిషన్స్ డెరైక్టర్ ప్రొ.గోపాల్‌రెడ్డి తెలిపారు. ఉస్మానియా, పాలమూరు వర్సిటీల్లోని 242 సీట్ల భర్తీకి ఓయూ క్యాంపస్‌లోని పీజీ అడ్మిషన్స్ కార్యాలయంలో ఈ నెల 18న కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్‌సైట్లో చూడవచ్చు.

 

‘దసరా’లో క్లాసులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు

సాక్షి, హైదరాబాద్: ఈనెల 10 నుంచి ప్రారంభం కానున్న దసరా సెలవుల్లో జూనియర్ కాలేజీలు తరగతులు నిర్వహించినా, విద్యా సంబంధ కార్యక్రమాలు జరిపినా కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 10 నుంచి 25 వరకు అన్ని కాలేజీలు సెలవులు ప్రకటించాలని స్పష్టం చేశారు.

 

మెదక్‌లో ఫారెస్ట్ కాలేజీకి రూ. 45.79 కోట్లు

సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా నర్సంపేటలోని ములుగు ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పరిసరాల్లో ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌సీఆర్‌ఐ) ఏర్పాటు ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుకు రూ.45.79 కోట్లు మంజూరు చేస్తూ పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. ఈ ఇన్‌స్టిట్యూట్‌లో బీఎస్సీ (ఫారెస్ట్రీ), ఎమ్మెస్సీ (ఫారెస్ట్రీ), పీహెచ్‌డీ (ఫారెస్ట్రీ) కోర్సులు ఆఫర్ చేస్తారు. కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, డెహ్రాడూన్ అనుబంధంగా ఈ ఇన్‌స్టిట్యూట్ పనిచేస్తుంది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top