‘ఔటర్’పై చీకట్లు! | darkness over outer ring road work | Sakshi
Sakshi News home page

‘ఔటర్’పై చీకట్లు!

Aug 16 2015 5:08 AM | Updated on Sep 3 2017 7:30 AM

‘ఔటర్’పై చీకట్లు!

‘ఔటర్’పై చీకట్లు!

హైదరాబాద్‌లోని జవ హర్‌లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై ఎల్‌ఈడీ లైటింగ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు చీకట్లు ముసురుకొన్నాయి.

- ఎల్‌ఈడీ లైటింగ్ ఏర్పాటుకు గ్రహణం
- టెండ ర్ పిలిచినా... రూ.30 కోట్ల ప్రాజెక్టు మూలకు.. బిడ్స్ స్క్రూట్నీకి సిబ్బంది కరువు
- రోడ్డు ప్రమాదాలను పట్టించుకోని కమిషనర్
 
సాక్షి, హైదరాబాద్:
హైదరాబాద్‌లోని జవ హర్‌లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై ఎల్‌ఈడీ లైటింగ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు చీకట్లు ముసురుకొన్నాయి. ప్రాజెక్టుకు టెండర్లు పిలిచి ఆర్నెల్లు గడిచినా వాటిని స్క్రూట్నీ చేసే దిక్కులేక బిడ్స్‌ను పక్కకు పడేసినట్లు తెలుస్తోంది. ఓవైపు ఔటర్‌పై నిత్యం ప్రమాదాల పరంపర కొనసాగుతున్నా హెచ్‌ఎండీఏ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. టెండర్ ప్రక్రియ పూర్తయ్యే దశలో హెచ్‌ఎండీఏ కమిషనర్ తీసుకొన్న అనాలోచిత నిర్ణయం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని ఓఆర్‌ఆర్ సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు.

నగరం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు 22 కి.మీ. దూరం ఎల్‌ఈడీ లైటింగ్ ఏర్పాటు చేయాలని 2011లో హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. ఇందుకు అప్పటి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జీవో-174ను కూడా విడుదల చేసింది. ఇందుకోసం నిధులిచ్చేందుకు ‘జైకా’ కూడా ఆమోదం తెలపడంతో రూ.30 కోట్లతో విద్యుత్ లైటింగ్ ఏర్పాటుకు అంచనాలు రూపొందించారు.

8 లేన్ల మెయిన్ కారిడార్‌లో సెంట్రల్ మీడియన్‌లో ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటుకు అధికారులు నిర్ణయిం చారు. ఆ మేరకు గత ఫిబ్రవరిలో టెండర్లు ఆహ్వానించగా 4 సంస్థలు బిడ్స్ దాఖలు చేశాయి. అయితే... టెక్నికల్ స్క్రూట్నీ దశలో డిప్యుటేషన్ అధికారులను  తిప్పి పంపుతూ హెచ్‌ఎండీఏ కమిషనర్ శాలిని మిశ్రా తీసుకొన్న నిర్ణయం ఆ ప్రాజెక్టుకు బ్రేక్ వేసింది. ఆర్‌అండ్‌బి నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) మాతృ సంస్థకు వెళ్లిపోవడంతో ఆ బిడ్స్‌ను స్క్రూట్నీ చేసే నాథుడే లేకుండా పోయాడు. ఫలితంగా గత 7 నెలలుగా ఆ బిడ్స్ టెండర్ బాక్స్‌కే పరిమితమయ్యాయి.
 
విరమించుకొన్నట్లేనా..?
ఔటర్‌పై లైటింగ్ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలా? లేక ముందుకెళ్లాలా? అన్న విషయమై ఓ నిర్ణయం తీసుకొనేందుకు, ఈ అంశాన్ని హెచ్‌ఎండీఏ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఓఆర్‌ఆర్ అధికారులు సాహసించట్లేదు. ఓఆర్‌ఆర్ రెగ్యులర్ పీడీ కూడా దీర్ఘకాలిక సెలవులో ఉండటంతో ఈ ప్రాజెక్టు ఫైల్‌కు బూజుపట్టింది. ఈ మార్గంలో ఔటర్‌పై వాహనాల రాకపోకలు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో లైటింగ్ ఏర్పాటును విరమించుకుంటే హెచ్‌ఎండీఏ తీవ్ర విమర్శలకు గురయ్యే అవకాశం ఉంది.  

గచ్చిబౌలి- శంషాబాద్ మార్గంలో లైటింగ్ ఏర్పాటు ప్రతిపాదన కొత్తది కాదు. 2011లోనే నిర్ణయం జరిగిపోయింది. ఔటర్‌పై ప్రమాదం జరిగిన ప్రతిసారీ రహదారి భద్రతపై హెచ్‌ఎండీఏ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ అన్ని ప్రభుత్వ శాఖలు ఇటువైపే వేలెత్తి చూపుతున్నా మహానగరాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారుల్లో చలనం లేకపోవడం వారి చిత్తశుద్ధికి అద్దం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement