డామిట్ కథ అడ్డం తిరిగింది! | Damit story came to the barricade! | Sakshi
Sakshi News home page

డామిట్ కథ అడ్డం తిరిగింది!

Dec 26 2015 9:40 AM | Updated on Jul 23 2018 9:13 PM

డామిట్ కథ అడ్డం తిరిగింది! - Sakshi

డామిట్ కథ అడ్డం తిరిగింది!

పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడికి కఠిన శిక్ష పడాలనే ఉద్దేశంతో ఓ యువతి తన స్నేహితులతో కలిసి పథకం

ప్రియుడిని కేసులో ఇరికిద్దామనుకొని బుక్కైపోయిన యువతి
ఆమెకు సహకరించిన ముగ్గురు స్నేహితుల అరెస్టు

 
పంజగుట్ట: పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడికి కఠిన శిక్ష పడాలనే ఉద్దేశంతో ఓ యువతి తన స్నేహితులతో కలిసి పథకం పన్ని పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. శుక్రవారం పంజగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు, ఎస్సార్ నగర్ ఇన్‌స్పెక్టర్ సతీష్‌తో కలిసి తెలి పిన వివరాల ప్రకారం...  వైఎస్‌ఆర్ కడప జిల్లా పులివెందులకు చెందిన యువతి (21) నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తూ అమీర్‌పేటలోని లేడీస్ హాస్టల్‌లో ఉంటోంది.

నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న ప్రకాశం జిల్లా వాసి వై. సాయి అవినాష్... ఆ యువతి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే, అవినాష్ పెళ్లికి నిరాకరించడంతో నెల క్రితం అతనిపై ఆమె ఎస్సార్‌నగర్ ఠాణా లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని రిమాండ్‌కు తరలించారు. 20 రోజులు జైలు శిక్ష అనుభవించిన అవినాష్ బెయిల్‌పై విడుదలయ్యాడు.

అతను బయటకు రావడం ఇష్టంలేని ఆమె  కేవలం చీటింగ్ కేసు పెట్టారని, పెళ్లి పేరుతో మోసం చేసిన అతడిపై లైంగికదాడి కేసు నమోదు చేయాలని తిరిగి ఎస్సార్‌నగర్ పోలీసులను  ఆశ్రయించింది. దీంతో పోలీసులు లైంగికదాడి కేసు నమోదు చేసి ఆమెను మెడికల్ పరీక్షలకు పంపేందుకు సిద్ధమయ్యారు. 

ఇంతలో సదరు యువతి అవినాష్‌పై మరింత బలంగా కేసు బనాయించాలని భావించి నెల్లూరు జిల్లా కావలికి చెందిన తన స్నేహితులు ఎం.చైతన్య, విక్కీ శర్మలను సంప్రదించింది. ముగ్గురూ కలిసి ఓ పథకం పన్నారు. అందులో భాగంగానే విక్కీ శర్మ కావలికి చెందిన తన స్నే హితుడు అశోక్‌రెడ్డితో ఈనెల 7న పబ్లిక్ ఫోన్ నుంచి సదరు యువతికి కాల్ చేయించి అవి నాష్ అన్నను మాట్లాడుతున్నానని చెప్పించాడు.

అశోక్‌రెడ్డి ఆమెను దుర్భాలాడుతూ అవినాష్‌పై పెట్టిన కేసు విత్‌డ్రా చేసుకోకుంటే చంపేస్తానని బెదిరించారు. ముందే వేసుకున్న పథకం ప్రకారం సదరు యువతి ఆ ఫోన్ కాల్‌ను రికార్డు చేసి ఎస్సార్‌నగర్ ఠాణాలో అవినాష్‌పై మరో కేసు పెట్టింది. అవినాష్‌ను విచారించిన పోలీసులు ఆ ఫోన్ అతడి అన్న చేయలేదని నిర్ధారించారు. ఫోన్‌కాల్ డేటా ప్రకారం విచారణ జరిపి ఆ ఫోన్ చేసింది ఆ మహిళ స్నేహితులు చైతన్య, విక్కీశర్మ, అశోక్‌రెడ్డి అని తేల్చారు. కావలికి వెళ్లి నిందితులు ముగ్గురినీ అరెస్టు చేశారు. తమను తప్పుదోవ పట్టించిన యువతిని త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement