
అన్ని రంగాల్లో మోదీ సర్కార్ విఫలం: డి. రాజా
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు డి.రాజా ధ్వజమెత్తారు.
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు డి.రాజా ధ్వజమెత్తారు. ఇప్పుడు నిరుద్యోగం పెద్ద సమస్యగా ముందుకు వచ్చిందన్నారు. గురువారం హైదరాబాద్ మఖ్దూంభవన్‌లో పార్టీనాయకులు డా.కె.నారాయణ, చాడ వెంకటరెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
వ్యవసాయరంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతన్న ఆత్మహత్యల పరంపరసాగుతోందని విచారం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక సంఘ్‌పరివార్, మతవాద, మితవాదశక్తుల ప్రమేయం పెరిగిపోయిందన్నారు. శుక్రవారం నుంచి మూడురోజుల పాటు గుంటూరులో జరగనున్న పార్టీ జాతీయ సమితి సమావేశాల్లో దేశ ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, ఈ ఏడాది జరగనున్న పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్లు రాజా తెలిపారు.