
అన్ని స్థానాల్లోనూ పోటీ: భట్టి
శాసనమండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌తో ఎలాంటి అవగాహన ఉండబోదని, తమ పార్టీ అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తుందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌తో ఎలాంటి అవగాహన ఉండబోదని, తమ పార్టీ అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తుందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆదివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధికారం, పదవుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని, వలసలను ప్రోత్సహిస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని దుయ్యబట్టారు.
స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రలోభాలకు పాల్పడుతోందని, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులను బెదిరింపులకు గురి చేస్తూ వారివైపు తిప్పుకుంటోందని ఆరోపించారు. మాజీమంత్రి దానం నాగేందర్ పార్టీని వీడుతున్నారంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ ‘దానం పార్టీని వీడుతారని అనుకోవడం లేదు.. ఆయనకు పార్టీ అనేక అవకాశాలు ఇచ్చిందని వ్యాఖ్యానించారు.
గాంధీభవన్‌లో అంబేడ్కర్ వర్ధంతి
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 60వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం గాంధీభవన్‌లో నిర్వహించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్య నిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కార్యక్రమంలో పాల్గొన్నారు.