
వైఎస్ హయాం ప్రాజెక్టులూ పూర్తి చేయాలి
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తెలంగాణలో పెద్దఎత్తున చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు చివరి దశలో
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తెలంగాణలో పెద్దఎత్తున చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు చివరి దశలో ఉన్నాయని, వాటిని సత్వరమే పూర్తి చేస్తే రైతులకు భారీ ప్రయోజనం కలుగుతుందని కాంగ్రెస్ సభ్యుడు జి.చిన్నారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. 2004–14 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణలో 40లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే ప్రయత్నాలు చేశాయన్నారు.
గతంలో ఆయకట్టు 80 లక్షల ఎకరాలు ఉండేదని, ఇప్పటి ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన 25 లక్షల ఎకరాల ఆయకట్టు కలిపితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటున్నట్లు కోటి ఎకరాల ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయవచ్చు నన్నారు. వ్యవసాయ పద్దులపై చర్చలో భాగంగా శనివారం శాసనసభలో చిన్నారెడ్డి మాట్లాడుతూ గత బడ్జెట్లో వ్యవసాయానికి రూ. 6,600 కోట్లు కేటాయించగా ఈ ఏడాది బడ్జెట్లో నిధులను రూ. 5,800 కోట్లకు తగ్గించారని తప్పుబట్టారు. తెలంగాణను విత్తన భాండాగారంగా మారుస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నా ఆచరణ మాత్రం కనిపించడం లేదన్నారు.