మా దయవల్లే ‘గుత్తా’ గెలుపు | chief minister is behaving like tuglak, says komatireddy venkat reddy | Sakshi
Sakshi News home page

మా దయవల్లే ‘గుత్తా’ గెలుపు

Oct 19 2016 3:00 AM | Updated on Aug 13 2018 3:55 PM

మా దయవల్లే ‘గుత్తా’ గెలుపు - Sakshi

మా దయవల్లే ‘గుత్తా’ గెలుపు

తమ అన్నదమ్ముల దయ వల్లనే నల్లగొండ ఎంపీగా గుత్తా సుఖేందర్ రెడ్డి గెలిచారని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

రైతుల కోసం 72 గంటల దీక్ష చేస్తా: కోమటిరెడ్డి

 సాక్షి, హైదరాబాద్: తమ అన్నదమ్ముల దయ వల్లనే నల్లగొండ ఎంపీగా గుత్తా సుఖేందర్ రెడ్డి గెలిచారని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. బతుకుదెరువు కోసం గుత్తా రాజకీయాలు చేస్తున్నారని, రోజుకోపార్టీ మారుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ టిక్కెట్‌పై గెలిచిన ఎంపీ పదవికి పుష్కరాల తర్వాత రాజీనామా చేస్తానని ప్రకటించిన ఆయన ఎందుకు మాట మారుస్తున్నాడని కోమటిరెడ్డి ప్రశ్నించారు. సచివాలయ నిర్మాణం కోసం 1,000 కోట్లు ఖర్చు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన నిర్ణయం పిచ్చితుగ్లక్ చర్యగా అభివర్ణించారు.

ఇటీవల నిర్మించిన డి-బ్లాక్‌ను కూలగొడతామనడం పిచ్చిపని అని, వాస్తు బాగుండకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి కేసీఆర్ తప్పుకోవాలని సూచించారు. పేదలు వైద్యం అందక, రుణమాఫీ లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు వేల కోట్లు పనులు ఇచ్చి, కమీషన్ల ద్వారా కేసీఆర్ వేల కోట్లు దోచుకుంటున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. రైతులకు రుణమాఫీ చేయడానికి, ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇవ్వడానికి, పేదలకు ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయడానికి, విద్యార్థులకు ఫీజును రీయింబర్స్‌మెంట్ చేయడానికి నిధుల్లేవంటున్న సీఎం.. విలాసాల కోసం దుబారా ఖర్చులు చేస్తూ రాష్ట్ర ప్రజలపై భారం మోపుతున్నాడని విమర్శించారు. రుణమాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీ కోసం నవంబరు మొదటి వారంలో 72 గంటల దీక్ష చేస్తానని, పార్టీ అధిష్టానం అనుమతి తీసుకుని ఇందిరాపార్కువద్ద పోరాటానికి దిగుతానని కోమటిరెడ్డి ప్రకటించారు. కేసీఆర్ చేస్తున్న పిచ్చి పనుల్లో వంద అస్త్రాలు ప్రతిపక్షాలకు ఉన్నాయని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement