Sakshi News home page

రోహిత్ ఘటనపై 20న చలో ఢిల్లీ

Published Thu, Feb 4 2016 4:40 AM

రోహిత్ ఘటనపై 20న చలో ఢిల్లీ

8 నుంచి తెలుగు రాష్ట్రాల్లో బస్సు యాత్ర
ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన జేఏసీ నాయకులు


 హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ వేముల మృతి ఘటనపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 20న చలో ఢిల్లీ కార్యక్రమానికి విద్యార్థి జేఏసీ పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. హెచ్‌సీయూలోని బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించిన జేఏసీ నాయకులు ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ వెంకటేష్ చౌహాన్ మాట్లాడుతూ రోహిత్ ఘటనకు కారుకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేస్తున్నా.. కేంద్రం స్పందించకపోవడం ఆవేదన కలిగించిందన్నారు. కేంద్రమంత్రులు దత్తాత్రేయ, స్మృతీఇరానీ, వీసీ అప్పారావులపై చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ చలో ఢిల్లీకి పూనుకున్నామన్నారు.
 
  ఢిల్లీలో అన్ని వర్సిటీల విద్యార్థులతో నాలుగు రోజులు ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ నెల 8 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వర్సిటీల్లో బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 5న ప్రత్యేక సమావేశం, 6న హెచ్‌సీయూలో రౌండ్ టేబుల్ సమావేశం, పబ్లిక్ మీటింగ్ ఉంటుందని చెప్పారు. ముఖ్య వక్తలుగా ఆలిండియా ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ సభ్యులు ప్రొఫెసర్ అనిల్ సద్గోపాల్, రమేష్ పట్నాయక్, తెలంగాణ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ ప్రతినిధులు ప్రొఫెసర్ జగేంద్రబాబు, చక్రధర్‌రావులతో పాటు పలువురు ప్రసంగిస్తారని చెప్పారు. రిలే నిరాహారదీక్షలు నిరంతరాయంగా కొనసాగుతాయని వెల్లడించారు.
 
 కొనసాగుతున్న రిలే దీక్షలు..
 రోహిత్ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హెచ్‌సీయూలో విద్యార్థుల రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. దీక్షల్లో విద్యార్థులు ప్రకాష్, సందీప్ కాంబ్లే, రాహుల్, తుషార్ గాడ్గే, యోగేష్ పాల్గొన్నారు. పరిపాలనకు, తరగతులకు అంతరాయం కలగకుండా సాయంత్రం వేళల్లో జేఏసీ ప్రతినిధులు సమావేశాలు నిర్వహిస్తున్నారు.
 

Advertisement
Advertisement