డంపింగ్ యార్డులో గుర్తు తెలియని యువకుడి మృతదేహం కాలిపోతూ కనిపించిన ఘటన మంగళవారం మైలార్‌దేవ్‌పల్లి
ఘటనపై పలు అనుమానాలు
కాటేదాన్: డంపింగ్ యార్డులో గుర్తు తెలియని యువకుడి మృతదేహం కాలిపోతూ కనిపించిన ఘటన మంగళవారం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. కాటేదాన్ పారిశ్రామిక వాడలోని పాయల్ ఫుడ్ పరిశ్రమ పక్కనే గల డంపింగ్ యార్డులో ఉదయం ఓ మృతదేహం కాలిపోతుండగా క్రికెట్ ఆడేందుకు అటుగా వచ్చిన యువకులు గమనించారు. వెంటనే వారు పాయల్ ఫుడ్ కంపెనీ జనరల్ మేనేజర్ సుబ్బారావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే మృతదేహం గుర్తు పట్టలేని విధంగా కాలిపోయింది. మృతుడి కుడి చేతికి ప్లాస్టిక్ బ్యాండ్ ఉంది. వయసు 30-35 ఏళ్ల మధ్య ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు ఎవరనేది తెలిస్తే కేసును ఛేదించేందుకు వీలవుతుందని ఇన్‌స్పెక్టర్ సెరైడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.
హత్య చేసి పడేశారా?
పాయల్ ఫుడ్ పరిశ్రమ నిర్వాహకుడు పరిశ్రమ ఏర్పాటు అయిననాటి నుంచి పరిశ్రమలోని వ్యర్థాలు, వేస్ట్‌పేపర్లు ఇందిరా గాంధీ సొసైటీలోని ఖాళీ ప్రదేశంలో పడేస్తున్నారు. వీటిని గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి సమయంలో తగులబెడుతుంటారు. ఇదిలా ఉండగా మృతుడు డంపింగ్ యార్డ్ మంటల్లో ఎలా కాలి బూడిదయ్యాడో ప్రశ్నార్థకంగా మారింది. ఎవరైనా హత్య చేసి మృతదేహాన్ని గుర్తు పట్టకుండా ఉండేందుకు డపింగ్ యార్డ్‌లో పడేసి తగులబెట్టారా? లేక సమీపంలోని పరిశ్రమలో కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోతే గుట్టుచప్పుడు కాకుండా మంటల్లో పడేసి చేతులు దులుపేసుకున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.