బీసీ బడ్జెట్‌ రూ.7,500 కోట్లే!

BC Budget is only 7,500 crores - Sakshi

బడ్జెట్‌ రూపకల్పనలో బీసీ సంక్షేమశాఖ బిజీ 

సాక్షి, హైదరాబాద్‌: వెనుకబడిన తరగతుల బడ్జెట్‌ గతం కంటే పెరగనుంది. తాజాగా 2018–19 బడ్జెట్‌ అంచనాల రూపకల్పన ప్రక్రియ ప్రారంభమైంది. ఆర్థికశాఖ రెండ్రో జుల క్రితం బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించింది. గతేడాది బడ్జెట్‌ కంటే పెంచి అంచనాలు రూపొందించుకోవాలని సూచించింది. బీసీ సంక్షేమశాఖకు 2017–18లో రూ.5070.76 కోట్లు కేటాయించగా ఈసారి అదనంగా రూ.2,500 కోట్ల మేర పెంచే అవకాశముంది.

ఇందులో ప్రగతిపద్దు కింద రూ.4,764.60 కోట్లు, నిర్వ హణ పద్దు కింద రూ.305.76 కోట్లు కేటాయించింది. దీనిలోనే అత్యంత వెనుకబడిన కులాల(ఎంబీసీ) కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్లు కేటాయించింది. మిగతా మోత్తాన్ని కల్యాణలక్షి, ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్‌ ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, విదేశీ విద్యానిధి పథకాలకు కేటాయించింది. తాజాగా బీసీ బడ్జెట్‌ను రూ.7,500 కోట్ల మేర అంచనాలు రూపొందిస్తోంది. ఈసారి బీసీ కార్పొరేషన్‌కు సంతృప్తికర స్థాయిలో కేటాయింపులుండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కల్యాణలక్ష్మి, విదేశీ విద్యానిధి కింద వీలైనంత ఎక్కువమందికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. బడ్జెట్‌తో సంబంధం లేకుండా నిరుడు రజక, నాయిబ్రాహ్మణ ఫెడరేషన్లకు 500 కోట్లు కేటాయించింది. విశ్వబ్రాహ్మణ ఫెడ రేషన్‌కు రూ.200 కోట్లు కేటాయించే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది.
 
ప్రత్యేక అభివృద్ధినిధి మాటేంటి..? 
వెనుకబడిన కులాల సమగ్ర అభివృద్ధిలో భాగంగా కేబినెట్‌ సబ్‌ కమిటీ బీసీ నివేదిక రూపొందించింది. మంత్రి ఈటల రాజేందర్‌ అధ్యక్షతన ఏర్పాటైన బీసీ కమిటీ సుదీర్ఘ సమాలోచనలు చేసి నివేదికకు తుదిరూపు ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘బీసీల అభ్యున్నతికి ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తాం. ఏకాభిప్రాయంతో ప్రాధాన్యతాక్రమంలో నివేదిక ఇస్తే వెంటనే మంజూరు చేస్తా’ అని హామీ ఇచ్చారు. అయితే తాజా బడ్జెట్‌ రూపకల్పన ప్రక్రియ ప్రారంభమైనా బీసీ నివేదికపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ‘బీసీ నివేదికపై అసెంబ్లీలో చర్చించాలి. అందుకే నివేదికను సీఎంకు ఇవ్వలేదు. సీఎం ఆదేశం వచ్చిన వెంటనే నివేదిక సమర్పిస్తాం. అసెంబ్లీలో చర్చిస్తాం’ అని మంత్రి రామన్న ‘సాక్షి’తో అన్నారు.  

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top