జెనెటిక్స్‌తో సరిపోలిన ఆయుర్వేదం | Ayurveda is matched with genetics | Sakshi
Sakshi News home page

జెనెటిక్స్‌తో సరిపోలిన ఆయుర్వేదం

Jan 31 2016 4:53 AM | Updated on Oct 1 2018 2:09 PM

జెనెటిక్స్‌తో సరిపోలిన ఆయుర్వేదం - Sakshi

జెనెటిక్స్‌తో సరిపోలిన ఆయుర్వేదం

భారత సంప్రదాయ వైద్యమైన ఆయుర్వేదం ప్రకారం వ్యాధులను వాత, పిత్త, కఫ ప్రకారం గుర్తిస్తారు. ఈ మూడింటి సమాహారమే ప్రాకృతి.

సాక్షి, హైదరాబాద్: భారత సంప్రదాయ వైద్యమైన ఆయుర్వేదం ప్రకారం వ్యాధులను వాత, పిత్త, కఫ ప్రకారం గుర్తిస్తారు. ఈ మూడింటి సమాహారమే ప్రాకృతి. ఈ మూడింటి విభజన జెనిటిక్స్‌తో సరిపోలినట్లు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ) సీనియర్ శాస్త్రవేత్త కె.తంగరాజ్ కనుగొన్నారు. ప్రాకృతి ప్రకారం ఆయన 3,416 మందిని స్క్రీనింగ్ చేసి 262 మందిని పరిశోధనకు తీసుకున్నారు. వారిని జినోమ్ వైడ్ సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్పిజం (ఎన్‌ఎన్‌పీ) ద్వారా విశ్లేషణ చేశారు. దీని ప్రకారం ఆయుర్వేదంలోని వాత, పిత్త, కఫాలు జన్యువుల ఆధారంగానే విభజన జరిగినట్లు నిర్ధారిం చారు.

వందల ఏళ్ల క్రితం జెనెటిక్ సైన్స్ లేకున్నా ఆయుర్వేదం ఆ ప్రకారమే ఉండటం భారతీయుల గొప్పతనమని తేలింది. ఉస్మానియా వర్సిటీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ హాస్పిటల్ ఫర్ జెనెటిక్ డిసీజెస్ ఆధ్వర్యంలో ‘న్యూ ఫ్రాంటియర్స్ ఇన్ డయాగ్నసిస్ అండ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ జెనెటిక్ డిసీజెస్’ అంశంపై జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ఈ సందర్భంగా తంగరాజ్ తన పరిశోధన వివరాలు వెల్లడించారు. ఆయుర్వేదానికి జెనిటిక్ ఆధారం ఉందా? లేదా? అన్న అంశంపై పరిశోధన చేశానన్నారు. తాను విశ్లేషణకు తీసుకున్నవారి డీఎన్‌ఏల ద్వారా ఈ విషయాన్ని కనుగొన్నట్లు వెల్లడించారు.

 ఎన్‌జీఎస్‌తో ముందే గుర్తించవచ్చు...
 నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్స్ (ఎన్‌జీఎస్) ద్వారా ముందే వ్యాధి నిర్థారణకు రావచ్చని జెనిటిక్ శాఖ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మాదిరెడ్డి సుజాత చెప్పారు. క్యాన్సర్, షుగర్, ఇతర వ్యాధులను ఎన్‌జీఎస్ ద్వారా రెండు మూడేళ్లు ముందే గుర్తించవచ్చన్నారు. కొందరికి అబార్షన్స్ అవుతుంటాయి. దానికి జన్యుపరమైన కారణాలేంటో ఈ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ప్రొఫెసర్లు ఎ.జ్యోతి, జి.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
 
 పసుపుతో విష పదార్థాలకు చెక్...
 బియ్యం, పప్పులు, నూనె గింజలు, కూరగాయలను నిల్వ చేస్తే వాటిపై ఏస్పర్‌జిల్లస్ అనే ఫంగస్ ఏర్పడుతుంది. ఆ ఫంగస్ అల్ఫాటాక్సిన్-బి1 అనే విషపదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. అలాంటి విషపదార్థం పరిమితికి మించి సోకిన ఆహారధాన్యాలను తింటే మనిషి డీఎన్‌ఏలో మార్పులు వచ్చి క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదాలు అధికంగా ఉంటాయని బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ బి.శశిధర్‌రావు వెల్లడించారు. భారత్‌లో ఆహార ధాన్యాలను వండేప్పుడు పసుపు వాడటం వల్ల అల్ఫాటాక్సిన్-బి1కు చెక్ పెట్టవచ్చని తన పరిశోధనలో తేలిందన్నారు. ఎలుకల మీద చేసిన పరిశోధనలో ఈ విషయం బయటపడిందన్నారు. ఇదిలావుండగా రైతులు పురుగుమందులను నేరుగా స్ప్రే చేయడం వల్ల వారి జన్యువులపై ప్రభావం చూపి క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని డాక్టర్ పద్మజ తన పరిశోధన పత్రంలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement