ఐటీ.. వైద్యం.. ఇంటి రుణం | Average employee view on budget this side | Sakshi
Sakshi News home page

ఐటీ.. వైద్యం.. ఇంటి రుణం

Jan 30 2018 2:42 AM | Updated on Sep 27 2018 4:47 PM

Average employee view on budget this side - Sakshi

ఈయన పేరు ఎండీ అజీమ్‌.. హయత్‌నగర్‌ ఎంపీడీవో ఆఫీసులో సూపరింటెండెంట్‌.. పెరుగుతున్న నిత్యావసర ఖర్చులు.. పిల్లల చదువులు.. ఇంటి అద్దె.. అన్నీ లెక్కేసుకుంటే వచ్చే జీతం వాటికే సరిపోతోంది..! వీటికితోడు వార్షికాదాయంపై పన్ను విధిస్తుండటంతో అజీమ్‌ దిగులు చెందుతున్నాడు. ఇది ఒక్క ఆయన బాధనే కాదు.. సగటు జీతభత్యాలను అందుకునే చిన్న ఉద్యోగులందరిదీ ఇదే సమస్య. అందుకే కేంద్ర బడ్జెట్‌ ఈసారైనా తమకు న్యాయం చేస్తుందేమోనని ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని కోరుతున్నారు. ప్రస్తుతం రూ.2.5 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంది. అదనంగా మరో రూ.1.5 లక్షల సేవింగ్స్‌పై పన్ను లేదు.

మొత్తం రూ.4 లక్షల ఆదాయం దాటితే 20 శాతం పన్ను అమలవుతోంది. అందుకే ఈసారి బడ్జెట్‌లో ఆదాయ పన్ను పరిమితిని కనీసం రూ.5 లక్షలకు పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. సెక్షన్‌ 80(ఇ) కింద రూ.1.5 లక్షల సేవింగ్స్‌కు ఉన్న మినహాయింపును కనీసం రూ.3 లక్షలకు పెంచితే ఎక్కువ మందికి లాభం చేకూరుతుందని అంటున్నారు. ‘పిల్లల చదువులకు విద్యా రుణాలను వందశాతం ఇవ్వాలి. ప్రస్తుతం పిల్లలను ఉన్నత చదువులు చదివించాలంటే ఆషామాషీగా లేదు. ఇంజనీరింగ్‌ చదివించాలంటే ఏడాది జీతం చెల్లించినా సరిపోవడం లేదు’అని సగటు ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అలాగే తనతోపాటు తన కుటుంబీకులకు వైద్య ఆరోగ్య ఖర్చులపై ఆదాయపు పన్ను మినహాయింపును ఉద్యోగులు ఆశిస్తున్నారు.

వీటన్నింటికీ మించి సగటు, మధ్య తరగతి ఉద్యోగులందరూ సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకుంటారు. అందుకే గృహరుణాలను మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉంది. ‘గృహరుణాలపై వడ్డీ రేటును తగ్గించాలి. ప్రస్తుతం ఉద్యోగి వేతనంపై దాదాపు ఇరవై రెట్ల వరకు బ్యాంకులు గృహ రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఈ రుణ పరిమితిని పెంచాలి. ఆస్తి విలువకు తగినట్లు గరిష్ట రుణం మంజూరు చేసేలా సడలింపు ఇవ్వాలి. ఉద్యోగుల గృహ రుణాలపై వడ్డీ రేటు బ్యాంకుల్లో కనిష్టంగా 8.5 శాతం ఉంది. ఈ వడ్డీ రేటు తగ్గిస్తే సొంతింటి కల నెరవేరుతుంది’అని ఉద్యోగులు అంటున్నారు. మరి వారి ఆశలను జైట్లీ నెరవేరుస్తారా?..  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement