ఆంధ్రప్రదేశ్‌కు వరప్రసాదియైన పోలవరం ప్రాజెక్టులో ‘పట్టిసీమ’ తరహా మరో దోపిడీకి ప్రభుత్వం తెరలేపింది.
- పురుషోత్తపట్నం ఎత్తిపోతల వ్యయం 71.7 శాతం పెంపు
- రూ.946 కోట్ల నుంచి రూ.1638 కోట్లకు పెరిగిన అంచనా వ్యయం
- జలవనరుల ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు వరప్రసాదియైన పోలవరం ప్రాజెక్టులో ‘పట్టిసీమ’ తరహా మరో దోపిడీకి ప్రభుత్వం తెరలేపింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం అంచనా వ్యయాన్ని రూ. 954 కోట్ల నుంచి ఏకంగా రూ.1638 కోట్లకు పెంచింది. రూ.1638 కోట్లతో పోలవరం ఎడమవైపున సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు ప్రభుత్వం పరిపాలనామోదం తెలిపింది. ఈ మేరకు జలవనరుల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం కుడికాలువపై పట్టిసీమ ఎత్తిపోతలకు రూ.1600 కోట్లకు పైగా విడుదల చేసి దోచుకున్న ప్రభుత్వ పెద్దలు ఇదే తరహాలో దండుకునేందుకు ఎడమ కాలువలో పురుషోత్తపట్నం ఎత్తిపోతలు -1, 2కు ఆమోదముద్ర వేశారని అధికార వర్గాలు అంటున్నాయి.
ఎప్పుడేమి చేయాలో? ఎలా చేయాలో ప్రభుత్వ పెద్దలకే స్పష్టత లేదని, ఒకటి చెప్పి తర్వాత మరికొంత దోచుకునేందుకు మరొకటి ప్రతిపాదిస్తున్నారని అధికారులు అంటున్నారు. ‘పట్టిసీమ’ టెండరు నిబంధనలు మార్పు, టెండర్లు పిలిచిన తర్వాత అధిక చెల్లింపులకు ఆమోదం, తాజాగా పురుషోత్తపురం ఎత్తిపోతల స్వరూపం మార్పులే ఇందుకు నిదర్శనాలని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.ఈ ఫైలుపై ఆర్థిక శాఖ అభ్యంతరాలు తెలిపినా సీఎం ప్రత్యేక చొరవతో దీనిని చేపట్టడానికి అనుమతి ఇచ్చిన విషయాన్ని ఆ అధికారి ప్రస్తావించారు.