రికార్డులన్నింటినీ సమర్పించండి | All records rohith suicide note should be submited to HIgh court | Sakshi
Sakshi News home page

రికార్డులన్నింటినీ సమర్పించండి

Feb 12 2016 2:13 AM | Updated on Aug 31 2018 8:53 PM

రికార్డులన్నింటినీ సమర్పించండి - Sakshi

రికార్డులన్నింటినీ సమర్పించండి

హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య నేపథ్యంలో నమోదైన కేసుకు సంబంధించి రోహిత్ సూసైడ్ నోట్‌తో పాటు రికార్డులన్నింటినీ తమ ముందుంచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

- రోహిత్ సూసైడ్ నోట్ కూడా మా ముందుంచండి
- పోలీసులకు హైకోర్టు ఆదేశం

 
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య నేపథ్యంలో నమోదైన కేసుకు సంబంధించి రోహిత్ సూసైడ్ నోట్‌తో పాటు రికార్డులన్నింటినీ తమ ముందుంచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో తనపై నమోదైన ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ కేసును కొట్టేయాలని కోరుతూ హెచ్‌సీయూ వైస్ చాన్స్‌లర్ అప్పారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని న్యాయ మూర్తి జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్ గురువారం మరోసారి విచారించారు. అప్పారావు తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఏబీవీపీ యూనివర్సిటీ అధ్యక్షుడు సుశీల్‌కుమార్‌పై దాడి జరిగే నాటికి అప్పారావు వీసీ కాదని, ఆయన ప్రొఫెసర్ మాత్రమేనన్నారు. కొంత మంది విద్యార్థులు సుశీల్ గదికి వెళ్లి దాడి చేసిన నేపథ్యంలో ఘటనను ప్రాక్టోరియల్ బోర్డు తీవ్రంగా పరిగణించి ఐదుగురు విద్యార్థులను వర్సిటీ నుంచి సస్పెండ్ చేసేందుకు సిఫారసు చేసిందన్నారు. దీనికి వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా సిఫారసు చేసిందన్నారు.
 
 ఇవన్నీ అప్పారావు వీసీగా నియమితులు కావడానికి ముందే జరిగాయని,  వీసీగా నియమితులైన తర్వాతనే ప్రాక్టోరియల్ బోర్డు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సిఫారసులు అప్పారావు ముందుకు వచ్చాయని, వాటిని పరిశీలించిన ఆయన విద్యార్థుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మానవతా ధృక్పథంతో వారి పట్ల మెతక వైఖరిని అవలబించారన్నారు.  రోహిత్  సూసైడ్ నోట్‌లో   అప్పారావు గురించి ఎటువంటి ప్రస్తావన లేదన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ సూసైడ్ నోట్ లేకుండా అందులోని కొంత భాగాన్ని మాత్రమే ఎలా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. రోహిత్ సూసైడ్ నోట్‌తో పాటు ఈ కేసు పూర్తి రికార్డులను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను 17కు వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement