మనుషుల అక్రమ రవాణా ఒక సవాల్ | A challenge to human trafficking | Sakshi
Sakshi News home page

మనుషుల అక్రమ రవాణా ఒక సవాల్

Mar 23 2014 2:41 AM | Updated on Aug 31 2018 8:24 PM

మనుషుల అక్రమ రవాణా ఒక సవాల్ - Sakshi

మనుషుల అక్రమ రవాణా ఒక సవాల్

మహిళల, చిన్నారుల అక్రమ రవాణా దేశానికి సవాలుగా మారిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా ఆందోళన వ్యక్తంచేశారు.

 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా
 

 మహిళల, చిన్నారుల అక్రమ రవాణా దేశానికి సవాలుగా మారిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా ఆందోళన వ్యక్తంచేశారు. కొందరు రాజకీయ నాయకులు, అధికారుల అండదండలతో మనుషుల అక్రమ రవాణా వ్యాపారం నిరాటంకంగా సాగుతోందన్నారు. దీనిపై వచ్చే కేసులను త్వరగా విచారణ పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని న్యాయాధికారులకు సూచించారు.


ఆంధ్రప్రదేశ్ జ్యూడీషియల్ అకాడమీ, కేంద్ర హోంశాఖలు శనివారం హైదరాబాద్‌లో ‘మనుషుల అక్రమ రవాణా’ అంశంపై చర్చా కార్యక్రమం ఏర్పాటు చేశాయి. ఈ కార్యక్రమంలో జస్టిస్ సేన్‌గుప్తాతో పాటు.. హైకోర్టు న్యాయమూర్తి, జుడీషియల్ అకాడమీ అధ్యక్షుడు జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ కేసీ భాను, జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ నూతి రామ్మోహనరావు, జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్, జస్టిస్ కె.జి.శంకర్, జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు, జస్టిస్ ఎం.సీతారామ్మూర్తి, కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సురేష్‌కుమార్, రిటైర్డ్ డీజీపీ (సీఐడీ) ఉమాపతి, అకాడమీ డెరైక్టర్ అవధాని, పలువురు న్యాయాధికారులు పాల్గొన్నారు.



 రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్: మనుషుల అక్రమ రవాణాలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని జస్టిస్ సేన్‌గుప్తా తెలిపారు. మూలాల్లోకి వెళ్లి పరిశీలిస్తేనే ఈ సమస్యకు ముగింపు పలకగలమన్నారు. ఈ సందర్భంగా ఆయన తన సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌లో మహిళల అక్రమ రవాణా ఎలా సాగుతుందో వివరించారు.  కొందరు స్థానిక రాజకీయ నాయకులు, కీలక స్థానాల్లో ఉన్న అధికారుల అండదండలు ఉండటం వల్లే మహిళల అక్రమ రవాణ యథేచ్ఛగా సాగుతోందన్నారు. ఈ విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చినప్పుడు అక్రమ రవాణను అడ్డుకోవడం సాధ్యమవుతుందన్నారు. జస్టిస్ సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆయుధాలు, డ్రగ్స్ తరువాత స్థానంలో మనుషుల అక్రమ రవాణానే సంఘవ్యతిరేక శక్తులకు లాభసాటి వ్యాపారంగా మారిందన్నారు. రాజ్యాంగంలో మనుషుల అక్రమ రవాణాపై నిషేధం ఉందని, అయినా అది అమలు జరగటం లేదని, అసమర్థ చట్టాలే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డారు.



జస్టిస్ కె.జి.శంకర్ మాట్లాడుతూ.. మనుషుల అక్రమ రవాణా గురించి ఎవ్వరూ సీరియస్‌గా పట్టించుకోవడం లేదన్నారు. ఇందుకు సంబంధించిన కేసులకు కింది కోర్టులు సైతం తగిన ప్రాధాన్యతనివ్వడం లేదని తెలిపారు. నిరక్షరాస్యత, పేదరికమే మనుషుల అక్రమ రవాణాకు ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. వ్యభిచారం కేసుల్లో  భారీ జరిమానాలు వేయవద్దని, ఒకవేళ అలా వేస్తే ఆ మొత్తాలను చెల్లించేందుకు నిర్వాహకులు తిరిగి బాధితుల చేత వ్యభిచారం చేయిస్తారని ఆయన న్యాయాధికారులకు సూచించారు. ఇటువంటి కేసుల విషయంలో న్యాయాధికారులు కొంత మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement