కథల పాతరను తిరగదోడుదాం

vaka manjulareddy on world telugu conference - Sakshi

పిల్లలకు పాలమీగడలు ఎంతిష్టమో పాటల తోరణాలూ అంతే ఇష్టం అంటారు బాలకథా రచయిత్రి డి.సుజాతాదేవి.  పిల్లలకు తేనెల తేటల మాటలతో పాటు పాత కథలనూ అలవాటు చేస్తే అవి వారి సంస్కారానికి తోడ్పడుతాయంటారు. ఎంత తవ్వినా తరగని సంపద అని మన ప్రాచీన సాహిత్యాన్ని గుర్తుచేస్తారు.

బాలల కోసం ప్రత్యేకమైన సాహిత్యం అవసరమా?
తప్పకుండా ఉండి తీరాలి. పిల్లలకు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని వారి కోసం ఎలా ప్రత్యేకంగా శ్రద్ధగా తయారు చేస్తామో సాహిత్యమూ అంతే. పిల్లల వయసుకూ, అవగాహనకూ అనువైన సాహిత్య సృష్టి జరగాలి.

పౌరాణిక ఇతిహాసాల కాలం నాటి సాహిత్యంలో బాలల కోసం ఏమైనా ఉన్నాయా?
రామాయణ, భారతాల్లో నీతి కథలు అనేకం ఉన్నాయి. బాలకాండలో రామలక్ష్మణుల మైత్రి, గురుభక్తి ప్రస్ఫుటమవుతాయి. మహాభారతంలో కురుపాండవుల మధ్య మంచిచెడుల వ్యత్యాసం బాలలకూ అర్థమయ్యే రీతిలో ఉంటుంది. భాగవతంలో శ్రీకృష్ణుని బాల్యక్రీడలు, ఆటల్లోనే దుష్టసంహార ఘట్టాలు వినడం పిల్లలకు ఉత్సాహంగా ఉంటుంది. పట్టుదల గలిగిన కార్యసాధకుడు ధృవుడు, ధర్మాన్ని అనుసరించడానికి తండ్రినే ఎదిరించిన ప్రహ్లాదుడు, భక్తితో మృత్యుంజయుడైన మార్కండేయుడు, కడ వరకు తల్లిదండ్రుల బాధ్యతను నిర్వర్తించిన శ్రవణ కుమారుడు, తండ్రికి బ్రహ్మోపదేశం చేసిన కుమారస్వామి, ధర్మం కోసం తండ్రితో యుద్ధం చేసిన కుశలవులు... ఇవన్నీ మన ప్రాచీన సాహిత్య సౌగంధికాలు.

బాల సాహిత్యం పట్ల పిల్లల ఎక్కువ ఆసక్తి యాభై ఏళ్ల క్రితం ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది?
యాభై ఏళ్ల కిందట కథాగేయాలు బాగా ప్రచారంలో ఉండేవి. మధ్యాహ్నం వేళల్లో నలుగురు ఆడవాళ్లు ఒక చోట కూర్చుంటే ఊర్మిళాదేవి నిద్ర, సీతా స్వయంవరం వంటి కథల్లో ఏదో ఒక ఘట్టం వారి నాలుకల మీద నాట్యం చేసేది. పిల్లలకు నేర్పించడం కోసం తల్లులు కంఠతా పట్టేవారు. వేంకట పార్వతీశ కవులు, తిరుమల రామచంద్ర, గిడుగు సీతాపతి, గురజాడ, వావిలికొలను సుబ్బారావు, వీరేశలింగం, చింతా దీక్షితుల రచనలను పాటల రూపంలో పాడుకునేవారు. పిల్లల కోసం ఎన్నెన్ని కథలనీ... భట్టివిక్రమార్క కథలు, కాశీమజిలీ కథలు, శతక పద్యాలు! అవి అమ్మభాష మీద అలవోకగా పట్టుని తెప్పించేవి.

మన దగ్గర పిల్లల సినిమాలు తక్కువే. ఇందుకు కారణం బాల సాహిత్యం పరిపుష్టం కాకపోవడమే అనుకోవచ్చా?
అది నిజం కాకపోవచ్చు. తెలుగులో పాత రచనల పాతర తీస్తే ఎన్నో కథలుంటాయి. ఇప్పటికంటే గతంలోనే తెలుగులో బాల సాహిత్యం ఎక్కువగా వచ్చింది. పిల్లల సినిమాలు తీయాలంటే అవి కొన్ని దశాబ్దాలకు సరిపోతాయి.

బాలసాహిత్యం మాతృభాషలోనే ఉంటే మంచిదా? ఇంగ్లిష్‌ చిల్డ్రన్‌ లిటరేచర్‌ మ్యాగజైన్స్‌ని చదివించడాన్ని ప్రోత్సహించవచ్చా?
బాల సాహిత్యాన్ని మాతృభాషలో చదవడమే బాగుంటుంది. భాష నుడికారాలు పట్టుబడతాయి. పిల్లలకు ఆసక్తి ఉంటే ఇతర భాషలలోని బాల సాహిత్యాన్ని కూడా చక్కగా ఆస్వాదించవచ్చు. మాతృభాష మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికే తప్ప భాష పట్ల పరిధులు విధించుకుంటూ మనకు మనమే గొప్ప అనే అహంకారాన్ని ఒంటపట్టించుకోవడానికి కాకూడదు.
- వాకా మంజులా రెడ్డి

Read latest Hyderabad City News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top