బ్రెయిలీలో భగవద్గీత

Bagavath geetha in Braille - Sakshi

తెలుగుపై అభిమానం ఉన్న వారందరినీ మహాసభలు హైదరాబాద్‌కి నడిపిస్తున్నాయి. ముఖ్యంగా పండితులు, రచయితలు తాము రాసిన పద్యాలు, కవితలు, పుస్తకాల గురించి వినిపించాలని తాపత్రయపడుతున్నారు. అలా కర్నూలు నుంచి తాను రాసిన బ్రెయిలీ భగవత్‌గీత తీసుకొని వచ్చారు బూర్ల తిక్క లక్ష్మన్న. మహాసభల్లో పాల్గొనాలనే ఆసక్తి ముందు ఆయన అంధత్వం అడ్డంకి కాలేదు. తోడుగా మనువడిని తీసుకుని వచ్చిన ఆయన  అవకాశమిస్తే స్టేజ్‌ మీద నాలుగు శ్లోకాలు  చదివే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన్ను పలకరించినప్పుడు చెప్పిన విశేషాలు...

కర్నూలు జిల్లా ఉరుకుండ గ్రామంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. చిన్నప్పుడే భగవంతుని ప్రేరణతో భగవద్గీత రాయాలని, గుడి నిర్మించాలని సంకల్పించుకున్నాను. సంస్కృత పండితులు, మా గురువు వరప్రసాద్‌ ఆశీస్సులు, సహకారంతో ఐదేళ్లలో ఈ పుస్తకాన్ని పూర్తి చేశాను. పద్యాలూ, వాటి అర్థాలనూ బ్రెయిలీలో రాశాను. తేజోమయనంద చిన్మయ మిషన్‌ 2001 డిసెంబర్‌లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించింది.

వికలాంగులకు ప్రాధాన్యమిచ్చే గ్రంథం
వికలాంగులు ఎవరైనా వారి వైకల్యం పట్ల బాధతో ఉంటుంటారు. భగవద్గీత మొదటి అధ్యాయం మొదటి ప్రార్థన శ్లోకంలోనే  కృష్ణ భగవానుడు వికలాంగులకు ప్రాధాన్యం ఇచ్చాడు. మూకం కరోతి వాచాలం... అంటే.. కాళ్లు లేనివాడు కొండలెక్కుట, మూగవాడు సత్‌గ్రంథ పఠనం చెయ్యుట పరంధాముని కృపాయోగంతో జరుగుతాయని అర్థం. అర్జున విషాదం భగవద్గీత ప్రథమ అధ్యాయం, అందులో అంధుడైన ధృతరాష్ట్రుడు యుద్ధంలో ఏం జరుగుతుందని సంజయుడిని అడుగుతాడు. ఆ విధంగా ఈ గ్రంథంలో దివ్యాంగునికి ప్రథమంగా చోటు కల్పించినట్లయింది.

జీవన దిక్సూచి ఈ గ్రంథం
పిల్లల మనసు పలక లాంటిది. ఏం రాస్తే అదే ముద్రించుకుపోతుంది. చిన్నప్పుడే ఈ గ్రంథాన్ని పఠించేలా చేస్తే జీవితంలో మరింత అభివృద్ధి పొందుతారు. గీతా సారం శాంతికి మార్గం. ప్రయత్న లోపం ఉండరాదు, ఫలితం ఏదైనా దైవ ప్రసాదంగా స్వీకరించు, కాలం విలువైనది, రేపటికి రూపులేదు. మంచి పని వాయిదా వెయ్యకు లాంటి జీవిత సూక్తులను చెప్పి మన జీవితానికి దిక్సూచిలా నిలుస్తుంది భగవద్గీత.

జీవిత లక్ష్యం
నాలాంటి అంధులకు గీతా సారాన్ని అందించేందుకు నా జీవితం అంకితం. భగవద్గీత పద్యాలను వీలైనన్ని ఎక్కువ చోట్ల గానం చేస్తూ ఎక్కువ మందికి ఈ గ్రంథ సారాన్ని తెలియజేయలన్నదే నా జీవిత లక్ష్యం.

ఒక అవకాశం..
ఫలాపేక్ష లేకుండా తెలుగు మహాసభల్లో భగవద్గీత గురించి వీలైనంత ఎక్కువ మందికి తెలియజేయాలని వచ్చాను. ఇంత దూరం వచ్చిన నేను... వచ్చే ముందు రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేదు. ఈ పుస్తకంలోని కొన్ని శ్లోకాలను వేదికపై చదవాలని ఉంది. అవకాశం ఇస్తే బాగుండు అని ఎదురుచూస్తున్నాను.
- ఓ మధు

Read latest Hyderabad City News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top