'జంట' నోరెంట పద్యాల జేగంట

Ashtawadanam in world telugu conference - Sakshi

 మహాసభల్లో మెరిసిన జంట అష్టావధానం

రెండు ఎప్పుడూ నిండే. అలాంటిది జంట అష్టావధానమంటే పండుగ భోజనమే. రెండు స్వరాలు ఒకే భావ భాస్వరం. ఒకే పద్యం... చెరో పాదం. అనుకుంటేనే ఇంత ఇంపు. కనులారా చూస్తే సొంపు. ఈ ఇంపుసొంపుల జంటావధానం ఆదివారం రవీంద్ర  భారతి వేదికపై రసరంజకంగా సాగింది. ముదిగొండ అమరనాథశర్మ, ముత్యంపేట గౌరీశంకర శర్మ ఈ అవధానాన్ని అహ్లాదంగా నిర్వహించారు. జంటకవులు అనగానే మనకు వెంటనే స్ఫురించేది తిరుపతి వేంకట కవులు. వారి స్ఫూర్తితోనే అష్టావధానం చేస్తున్నట్టు వీరు వేదికపై ప్రకటించుకున్నారు.

సందడి సందడిగా సాగిన ఈ అవధానంలో కవులు మనసులో ఒకింత ప్రశాంతతను నిల్పుకుని, ధారణకు దారి ఇచ్చుకుని పద్యాలు చెప్పడం ప్రేక్షకుల్ని మెప్పించింది. నిషిద్ధాక్షరిగా మెతుకుసీమ మెదక్‌ వాసిగా పేరుగాంచిన కవి, లాక్షణికుడు మల్లినాథసూరిపై పద్యం అడుగగా ‘ధీమాత్ర విధాత శాస్త్ర ధీరాగ్రణ్యున్‌..’ అంటూ కవులు ప్రస్తుతించారు. ‘తెలుగు సభలోన కవులకు తెలుగు రాదు’ అని సమస్యనిస్తే... ‘తెలుగు సభలోన కవులకు... తెలుగురాదు దేశభాషలు రానట్టి వైదేశీలకు’ అంటూ మరోపాదం చేర్చి కవులకు కాదు సభలకు వచ్చిన విదేశీయులకు అని అర్థం వచ్చేలా పూరించారు. దత్తపదిగా అమెరిక, జపాన్, దుబాయి, హలెండ్‌ ఈ పదాలతో తెలుగుసభలను వర్ణించండి అని కోరారు. కాంతిరేఖలమరికల్యాణ, ఊహలెండిపోవ, భాషజపానువ్రతాన, మాదుబాయని చమత్కారంగా పదాలను వేరే పదాలతో కూర్చి తమ నేర్పు ప్రకటించారు. తెలంగాణ ఆత్మ బతుకమ్మ పండగను వర్ణనాంశంగా పద్యం చెప్పమని పృచ్ఛకుడు అడిగిన వెనువెంటనే సీస పద్యంలో చెరో పాదాన్ని చకచకా నడిపించారు. గునుగుపువ్వు, మందారం, తంగేడు, బంతిపూల ప్రసక్తి తీసుకురావడంతో పద్యం బతుకమ్మగా మెరిసింది. మెట్రో రైలుపై ఆశువుగా ‘ఉరుకులతో పరుగులతో... ధరలో విద్యుచ్ఛకటమా... మెరుగుల మురిపించినావు మెట్రో జయహో’ అంటూ ప్రేక్షకుల చప్పట్ల మధ్య పూరించారు. ధరలో అంటే అధిక ధరలో అని అవధానులు చమత్కరించగా పక్కనున్న వారు అంత ఎక్కువ కాదులే అనగానే ధర‘లో’ అనడంతో నవ్వులు పూశాయి. అప్రస్తుత ప్రసంగంలో పృచ్ఛకుడు గ్రంథసాంగులా మీరు అన్నప్పుడు అవధానులు ఉద్గ్రంథసాంగులం, గ్రంథాన్ని సాంగులా పాడగలం అంటూ చెణుకులు విసిరారు. అవధానులు వర్ణన చెబుతున్నప్పుడు మీరు కందం నుంచి సీసాల దాకా ఎదిగారే అనగానే పద్యసీసం మాది మరో సీసం మీది అన్నారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ ఎ.పి.జితేందర్‌ రెడ్డి తను పాతికేళ్లు విదేశాల్లో ఉన్నా మూడ్రోజులుగా నడుస్తున్న సభల స్ఫూర్తితో కవిత్వం రాయాలన్న ఆసక్తి కలుగుతోందని చమత్కరించారు. మొదట సభ శనివారం లాగానే ఇరివెంటి కృష్ణమూర్తి వేదికలో ప్రారంభమైనా... నిన్నటి జనాదరణ దృష్ట్యా ప్రధాన వేదిక యశోదారెడ్డి వేదికకు మార్చినా ఆ హాలు నిండి ద్వారాల వద్ద జనాలు గుంపులుగా నిలుచుని వినడం కొసమెరుపు.
- రామదుర్గం

Read latest Hyderabad City News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top