రుణమాఫీ పేరుతో నయవంచన

Cheating In The Name  Runamafi In AP - Sakshi

 రైతులను డిఫాల్టర్లుగా మార్చిన చంద్రబాబు ప్రభుత్వం 

అన్నదాత సుఖీభవ పథకం పేరుతో నేడు మభ్యపెట్టే యత్నం 

4,5 విడతల్లో దాదాపు రూ.1100 కోట్లకు పైగా రుణమాఫీ బకాయిలు  

సాక్షి, అమరావతి బ్యూరో: రుణమాఫీ పేరుతో ప్రభుత్వం రైతుల్ని నిండా ముంచింది. గత ఎన్నికల సమయాన మాఫీ చేస్తామని బాబు చెప్పిన మాటలు విని ఢిపాల్టర్లుగా మారిపోయారు. జిల్లాలో రూ. 8వేల కోట్లకు పైగా రైతు రుణాలు ఉండగా, ఇందులో రూ. 2884.64 కోట్ల మేర మాత్రమే మాఫీ అయ్యాయి. మూడు విడతల్లో రూ.1632.36 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు రైతు ఖాతాల్లో జమ అయ్యాయి. ఇంకా 4, 5 విడతల్లో రూ. 1152 కోట్ల మేర రుణాలు బకాయి ఉంది. 
 

హడావుడిగా జమ 
నాలుగో విడత రుణమాఫీకి సంబంధించి గత ఏడాది జూన్‌లోనే రైతు ఖాతాల్లో మాఫీ సొమ్మును జమ చేయాలి. దానిగురించి ఇప్పటి వరకు పట్టించుకోని ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడ్డాక హడావుడిగా జీవో జారీ చేసింది. ఏప్రిల్‌లో ఖాతాల్లో జమ చేస్తామని రైతుల్ని మరోసారి మభ్యపెట్టే యత్నం చేసింది. రుణమాఫీ పేరుతో దగా చేసిన ప్రభుత్వం, రకరకాల నిబంధనలు పెట్టి, అరకొర మాఫీ చేసే యత్నం చేసింది.
 

అన్నదాత సుఖీభవతో మరో ఎత్తుగడ
ఐదేళ్ల కాలంలో రుణమాఫీ చేయకుండా కాలయాపన చేసిన బాబు, వచ్చే బడ్జెట్‌లో, కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశాక నిధులు విడుదలంటూ రైతుల్ని  మరో నయవంచన చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ అంటూ కొత్త పథకం పెట్టి, రైతు ఖాతాల్లో రూ. 1000 వేసి, మరోసారి మోసం చేసే ఎత్తుగడను అవలంబించారు. రైతులకు రావా             ల్సిన, ఇన్‌పుట్‌ సబ్సిడీ, మొక్కజొన్నకు సంబంధించి అదనపు రాయితీ పాత బకాయిలను సంబంధించి ఇంతవరకు నిధులు మంజూరు చేయక పోవడం గమనార్హం. దీంతో తెలుగుదేశం ప్రభుత్వం మాయమాటలు చెప్పి, నట్టేట ముంచిందని  రైతులు మండి పడతున్నారు. తమకు సాయం చేసేందుకు ఐదేళ్లు అవకాశం ఉన్నా పట్టించుకోకుండా నేడు అన్నదాత సుఖీభవ అంటూ మోసం చేస్తోందని  మండిపడుతున్నారు.

 మోసం చేసిన ప్రభుత్వం  
ప్రభుత్వం రుణమాఫీ పేరుతో మాయ చేసింది. బాబు మాటలు నమ్మి  బ్యాంకులో అప్పు కట్టలేదు. తీరా నిబంధలు పెట్టి అరకొరగా రుణమాఫీ చేసింది. వడ్డీలు పెరిగిపోయాయి. బ్యాంకు డిఫాల్టర్‌గా భావించి కొత్తగా రుణాలు ఇవ్వడం లేదు. 4,5 విడతల రుణమాఫీ సంబంధించిన సొమ్ము ఇంత వరకు రాలేదు.
– నూతక్కి రాంబాబు, మంగళగిరి మండలం

ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం
 ఇన్‌పుట్‌ సబ్సిడీ, రుణమాఫీ బకాయిలు చెల్లించకుండానే అన్నదాత సుఖీభవ అంటూ రైతులను మోసం చేసే యత్నాన్ని ప్రభుత్వం చేస్తోంది. భారీ నష్టాల్లో ఉన్న రైతులకు ప్రభుత్వం ఇచ్చే రూ. 1000తో ఒరిగేది లేదు. తెలుగుదేశం ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాం.
  – చల్లా వెంకటేశ్వర్లు, తొండపిగ్రామం, ముప్పాళ మండలం 

 

పాత బకాయిల సంగతి ఏంటీ ?
ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైంది. గత ఏడాది రబీలో మొక్కజొన్న, జొన్న పంటలకు  గిట్టుబాటు ధర లేకపోవటంతో, క్వింటాకు రూ200ల చొప్పున అదనపు సాయం ఇస్తామని ప్రభుత్వం చెప్పి రైతుల జాబితాలను సిద్ధం చేసింది. దీనికి సంబంధించి రూ.53 కోట్లు ఇంతవరకు ఖాతాల్లో చేరలేదు. ని«ధులు విడుదల చేశామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చలేదు. అదనపు సాయం కోసం మొక్కజొన్న, జొన్న రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. 
 

నేటికీ అందని పరిహారం 
ఈ ఏడాది వరి పంట చేతికొచ్చే సమయంలో వచ్చిన పెథాయ్‌ తుపాన్‌ వరి రైతు వెన్ను విరిచింది. పంట నీట మునగడంతో పాటు, కళ్లాల్లో ధాన్యం తడిచి పంట మొలకెత్తడంతో పాటు, ధాన్యం రంగు మారిపోయింది. రైతులు భారీగా నష్టపోయారు. తుపాన్‌ ప్రభావంతో నష్టపోయిన రైతులకు సంబంధించి ప్రభుత్వం సర్వే చేసి, రూ.67 కోట్లను పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించినా ఇంత వరకూ రైతులకు పైసా అందలేదు. జిల్లాలోని తొమ్మిది కరువు మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలు ఎండిపోయి, దెబ్బతిన్నాయి. సర్వే చేసిన వ్యవసాయాధికారులు రూ.43 కోట్లను రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీగా ఇవ్వాలని ప్రతిపాదనలు పంపారు. ఇంతవరకు ప్రభుత్వం పైసా  విదల్చలేదు.

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top