విజయ్‌ మాల్యా (లండన్‌) రాయని డైరీ

Vijay Mallya Rayani Diary - Sakshi

మాధవ్‌ శింగరాజు

నాలుగేళ్లు అయింది నేను లండన్‌ వచ్చి. వచ్చిన రోజు నుంచి సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నా మీద బెంగ పెట్టేసుకున్నాయి. ఇండియా రమ్మంటాయి! ‘నాతో ఏం పని.. డబ్బులు తీసుకెళ్లండి’ అంటాను. ‘డబ్బుల్తో ఏం పని.. నువ్వొస్తే బాగుంటుంది’ అంటాయి! 
‘అసలు నువ్వెందుకొచ్చావ్‌ చెప్పూ..’ అన్నాను.. మూడేళ్ల క్రితం లండన్‌ కోర్టు బయట  సుమన్‌ కుమార్‌ కనిపిస్తే ! ‘ఎక్కడికి రావడం? లండన్‌కా, లండన్‌ కోర్టుకా?’’ అన్నాడు! సీబీఐ ఆఫీసర్‌ అతను. ఇండియాలో వేరే ఫ్రాడ్‌లు ఏమీ లేనట్లు నన్ను వెతుక్కుంటూ బ్రిటన్‌ అంతా ఏడాది పాటు తిరిగి, చివరికి కోర్టు బయట నన్ను పట్టుకున్నాడు.
‘టీ తాగుతూ మాట్లాడుకుందాం వస్తావా విజయ్‌’ అన్నాడు. 

‘మాల్యా అను. విజయ్‌ అంటే నేను నేను కానట్లుగా ఉంటుంది నాకు’ అన్నాను. ‘విజయ్‌ అని అనకుంటే నేను సుమన్‌ కానట్లుగా ఉంటుంది నాకు’ అన్నాడు! 
‘సరే చెప్పు, టీ తాగడం కోసం మాట్లాడ్డమా, మాట్లాడ్డం కోసం టీ తాగడమా? ఏదైనా మాట్లాడ్డమంత ఈజీ కాదు నాకు టీ తాగడం’ అన్నాను. ‘టీ తప్ప నాకు ఇంకేదీ తాగడం రాదు’ అన్నాడు. ‘అయితే ఇక్కడ మాట్లాడేందుకేం లేదు. ఏదైనా ఉంటే కోర్టులో మాట్లాడుకో.. నేను వెళ్తున్నా’ అన్నాను. ఆగమన్నాడు. ఆగాను. 
‘ఐడీబీఐకి నువ్వు తొమ్మిది వందల కోట్లు ఇవ్వాలి. ఎస్‌బీఐకి తొమ్మిది వేల కోట్లు ఇవ్వాలి. నేను డబ్బు మనిషిని కాదు. వాటిని అడగడానికి రాలేదు. నిన్ను తీసుకెళదామని వచ్చాను’ అన్నాడు.

‘డబ్బులు కావాలంటే బ్యాగులో పెట్టిస్తా తీసుకెళ్లు. భుజానికి బ్యాగేసుకుని ఇండియా వచ్చేయమంటే నీ వెనకే వచ్చేవాళ్లు ఎవరూ లేరిక్కడ’ అని చెప్పాను.
‘నా వయసు యాభై రెండేళ్లు. ఇరవై మూడేళ్ల వయసులో ఫీల్డులోకి వచ్చాను. తెల్ల కాలర్‌ల మీద నల్ల మరకల్ని వెతికే డ్యూటీ నాది. బెస్ట్‌ ఇన్వెస్టిగేటింగ్‌ ఆఫీసర్‌గా మన్మోహన్‌సింగ్‌ నాకు మెడల్‌ ఇచ్చారు. పోలీస్‌ మెడల్‌ వచ్చింది. రాష్ట్రపతి పోలీసు మెడల్‌ వచ్చింది. ఇన్ని వచ్చిన నాకు నీ కేసు అప్పగించారంటే నాకు కాదు గొప్ప. నీకు. వచ్చేయ్‌.. వెళ్లిపోదాం’ అన్నాడు!

‘డబ్బొక్కటే నా చేతుల్లో ఉంది. నేను నా చేతుల్లో లేను. డబ్బు కావాలంటే తీసుకెళ్లు. నేను కావాలంటే కోర్టు లోపల వాదించుకుని వెళ్లు..’ అని చెప్పాను. అప్పుడు వెళ్లినవాడు మళ్లీ కనిపించలేదు. సుమన్‌–2 ఎవరో కోర్టుకు వచ్చేవాడు ఫైళ్లు పట్టుకుని. ఫైల్‌ చూసుకుంటూ ఉండేవాడే కానీ పాపం నన్ను చూసేవాడు కాదు. మాల్యాను ఇరవై ఎనిమిది రోజుల్లో ఇండియా పంపిస్తాం అని కోర్టు చెప్పినప్పుడు కూడా తలెత్తి చూడలేదు.

కోర్టు తీర్పు వచ్చిన వెంటనే బయటికి వస్తుంటే సుమన్‌ ఫోన్‌ చేశాడు. ‘‘ఎక్కడా?’’ అన్నాను. ‘‘ఇండియాలో’’ అన్నాడు. ‘‘ఏంటి చెప్పు’’ అన్నాను. ‘‘సుప్రీంకోర్టుకు కూడా వెళ్లడానికి లేదని కోర్టు తీర్పు చెప్పిందటగా. ముందే నాతో ఇండియా వచ్చి వుంటే.. ఇప్పుడిలా తీర్పు వచ్చేదే కాదు’’ అన్నాడు!
‘‘క్యాష్‌ ఇస్తా. డౌన్‌ పేమెంట్‌. మోయగలిగితే వచ్చి తీసుకెళ్లు. కొత్త నోట్లు. వాసన చూసి తీసుకో. మోదీజీలా ఇరవై లక్షల కోట్లు ఇస్తున్నానని చెప్పి పప్పులు ఉప్పులు ప్యాక్‌ చేసి ఇవ్వడం కాదు. ఫెళపెళలాడే కరెన్సీ’’ అన్నాను. 

‘‘కరెన్సీ వద్దు. విజయ్‌ కావాలి నాకు’’ అన్నాడు!
‘‘విజయ్‌ కూడా కాదు, మెడల్స్‌ కావాలి నీకు. íపీఎం మెడలు, ప్రెసిడెంట్‌ మెడలు.. ఇస్తే ఐడీబీఐ మెడలు, ఎస్‌బీఐ మెడలు కూడా వేసుకుంటావ్‌ నువ్వు’’ అని ఫోన్‌ పెట్టేశాను. సుప్రీంకోర్టు కాకపోతే, మానవ హక్కుల కోర్టు. ఫ్రాన్స్‌కు వెళ్లకుండా ఇండియా వస్తానని ఆశిస్తున్నందుకు కూడా సుమన్‌కి ఒక మెడల్‌ ఏదైనా చేయించి ఇవ్వాలి.

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top