
తమ అస్తిత్వం మొత్తాన్నీ కంపెనీ పేరుతో ముడివేసుకుని తమను తాము దానికి సమర్పించుకునే ఉద్యోగులుంటారు. అదే వారి జీవితానికి కేంద్రం. కానీ ఎన్నాళ్లు? విరమణ అనేది ఒకటి ఉంటుంది... ‘వయసు మీరటం వల్ల ఎవరికీ అవసరం లేనట్టు’ అనిపించే బాధ! వయసును అంగీకరించడానికి సిద్ధంగా ఉండని మనసు. ఈ స్థితిని సున్నితంగా చెప్పే కథ ‘ఋతుసంక్రమణం’.
మూడేళ్ల తర్వాత పుట్టింటికి వస్తున్న కొడుకు కోసం అతడికి నచ్చే రొయ్యలు, పీతలతో వంట ఏర్పాట్లు చేయిస్తుంది తల్లి. ఆమెకు కళ్లకు మసకలు. చెవులు అంతంత మాత్రం. కొడుకు వచ్చాడు. పూటైనా ఉండకుండా ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఇంకెవరినో కలవాలని హడావుడిగా వెళ్లిపోయాడు. ‘నువ్వు ఎలా ఉన్నావు? ఆరోగ్యం ఎలా ఉంది? మందులు వేసుకుంటున్నావా?’– ఏమైనా అడిగాడా? అడిగినా వినపళ్లేదా? లోపల ఎక్కడో గుచ్చే కథ ‘రెండు ధృవాలు’.
గోకులదాసు ప్రభు ప్రసిద్ధ కొంకణి కథకుడు. మలయాళ భాషా సాహిత్యాలను అధ్యయనం చేసినవారు. మలయాళ సాహిత్యాన్ని కొంకణిలోకి అనువదించినవారు. ప్రభు కథల సంపుటిని రంగనాథ రామచంద్రరావు తెలుగులోకి తెచ్చారు. ఇందులో 12 కథలున్నాయి. సాధారణ ఇతివృత్తాలనే హృద్యంగా చెప్పడం ప్రభు శైలిగా తోస్తుంది.
- సాహిత్యం డెస్క్
ఋతుసంక్రమణం; కొంకణి మూలం: గోకులదాస ప్రభు; తెలుగు: రంగనాథ రామచంద్రరావు; పేజీలు: 116; వెల: 80; ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్, గిరిప్రసాద్ భవన్, జి.ఎస్.ఐ. పోస్టు, బండ్లగూడ(నాగోల్), హైదరాబాద్–68. ఫోన్: 24224453