ఆటలో గవ్వలు సరిగ్గా పడాలి

Sri Ramana Article On TDP MPs Joining BJP - Sakshi

అక్షర తూణీరం

ఎంతో లోకానుభవం ఉన్న ఒక మహాకవి ‘... అధికారాంతమునందు చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్‌’ అంటూ పద్యం నాలుగో పాదాన్ని ముగించాడు. అదొక సామెతలా జనంలో మిగిలిపో యింది. చంద్రబాబు విమానం టేకాఫ్‌ కాగానే, సెల్‌ ఫోన్‌ ఎయిరోప్లేన్‌ పంథాలోకి వెళ్లగానే నలుగురు తెలుగు తమ్ముళ్లు పచ్చచొక్కాలు విసర్జించి కాషాయ కండువాలు ధరించారు. మోదీ మాత్రమే ఈ దేశాన్ని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఉద్ధరించగలరనే ఏకాభిప్రాయం కలిగిందని వినమ్రంగా చెప్పారు. విమానంపైకి లేచిందో లేదో నలుగురు రాజ్యసభ సభ్యుల మెదళ్లలో జ్ఞానదీపాలు ఒక్కసారిగా వెలి గాయి. మాకు మా దేశం, అంతకంటే ముందు మా సొంత గడ్డ, దానికంటే ముందు మా ప్రజ ముఖ్య మనిపించింది. ఇన్నాళ్లూ జరిగిన అనైతిక చర్యలకు వగచి, చింతించి, బాధపడి, కంటకళ్లు పెట్టుకు న్నారు. మా పశ్చాత్తాపాన్ని పెద్దమనసుతో అర్థం చేసుకోండి. 

రోజుకి ఆరు లీటర్లు మినరల్‌ వాటర్‌ తాగే వాళ్లం ప్రాయశ్చిత్తంగా అరలీటరు సాదా పానీతో సరిపెట్టుకోవడానికి నలుగురం నిర్ణయించు కున్నాం. చంద్రబాబే మా తండ్రి, చంద్రబాబే నేత, చంద్ర బాబే మా గురువు. ఆయనకి ముందుగానే మా నిర్ణయం విన్నవిద్దామని మేము సిద్ధపడ్డాం. గురు కటాక్షం లేక అది సాధ్యపడలేదు. మిగిలిన అరకొర, అడుగుబొడుగు తెలుగు తమ్ముళ్లు మేమంతా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుని ఇలా సన్యసించి కాషాయం లోకి కన్వర్ట్‌ అయ్యారని ఒక పుకారు లేపారు. అంతా వట్టిది. బీజేపీ తీర్థం పుచ్చుకున్నందున డబ్బు కరువు తీరుతుందా?’ అని ఆ నలుగురూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. మిగిలిన ఇద్దరూ కూడా చేరిపోతారని, మంచిరోజు దొరక్క ఆగారని ఒకమాట చక్కర్లు కొడుతోంది. 

అసలీ రాజ్యసభ సభ్యత్వాలు వాటి గడువులు పెద్ద పజిల్‌. సామాన్యులకు, మనలాంటి వాళ్లకి గడువులు వాటి గొడవ అంతుపట్టదు. లాటరీ అంటారు, కాలం తీరిందంటారు, అధిక మాసాలం టారు.. అంతా అయోమయంగా ఉంటుంది. మరో వైపు ఓడిపోయిన తెలుగు దిగ్గజాలు పది పదిహేను మంది, ఒకచోట గుమికూడి ఓ రోజల్లా మంతనాలు సాగించారు. కాకినాడ కేంద్రంగా సాగిన ఈ రహస్య సమాలోచనలు కూడా బాబు విమానం గాల్లోకి లేచీ లేవగానే! ‘అబ్బే! రహస్యం ఏముందిందులో. అసలు రామరాజ్యానికి దీటుగా సాగిన బాబు పాలనకి ఇట్టి దుర్గతి ఎందుకు పట్టిందో చర్చించాం. చర్చల ఫలితాలు మా నేతకి చెప్పాలని నివేదిక సిద్ధం చేస్తున్నాం’ అని చెబుతున్నారు. పాపం పుణ్యం కాకినాడ గ్రామ దేవతలకి తెలియాలి. చంద్రబాబు బ్రహ్మాండంగా ఓడిపోవడం మాట అలా ఉంచి, ఆయన వాచాలత్వం వల్ల సమీ కరణాలన్నీ అద్దాలు పగిలినట్టు పగిలాయి. 

మోదీ సర్కార్‌ భూస్థాపితం కాబోతోందని బాబు భవిష్య వాణిని వినిపించారు. అసలు ఒకటి మాట్లాడి ఒకటి పేలలేదని లేదు. మోదీ జ్ఞాపకశక్తి ఇంకా మసక బారలేదు. ఆయనపై వ్యక్తిగత విమర్శలకు కూడా వెళ్లారు. ఏంలేదు. రేపు అన్ని రాష్ట్రాలలో స్థానిక పార్టీలు విజయదుందుభులు మోగిస్తాయనీ, టీడీపీ సంగతి చెప్పనే అక్కర్లేదనీ బాబు కలలు కన్నారు. తెలుగు తమ్ముళ్లకి అనగా చినబాబుకి స్టేట్‌ అప్ప గించి పెదబాబు ఢిల్లీలో చక్రం తిప్పాలని ఉవ్విళ్లూ రారు. అసలు దేశ భవిష్యత్తంతా లోకల్‌ పార్టీలదే నని శంఖం పూరించారు. చంద్రబాబు తన నలభై ఏళ్ల రాజకీయ అనుభవం గురించి పదే పదే బెది రించేవారు. అనుభవం కంటే ప్రపంచ తంత్రం గుర్తె  రిగి ప్రవర్తించడం అసలైన విజ్ఞత. ఏ మాత్రం అను భవం లేకపోయినా ఇందిరాగాంధీ దేశాన్ని తిరుగు లేకుండా ఏలింది. 

ప్రజారాజ్యానికి ఎమర్జెన్సీ ఏమిటో, ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూపించింది. ఇందిర శకంగా ముద్ర వేసుకుంది. అందాకా దేనికి ఎన్టీఆర్‌ పేపర్‌ చదవడం, రాజకీయాలు చెవిన వేసుకోవడం లాంటి దురలవాట్లకి దూరంగా ఉండేవారట. ఆయన తల్లి కడుపులో బిడ్డవలె 9 నెలల్లో పరి పూర్ణంగా తయారై గొప్ప నేతగా పేరు తెచ్చుకు న్నారు. పరమపద సోపాన పటంలో ఎన్టీఆర్‌ చంద్ర బాబుకి చిక్కి అరుకాసురుడనే పెద్దపాము నోట్లో పడ్డాడు. మొదటి గడికి జారాడు పాపం. ఇప్పుడు అంతకుమించిన మహాసర్పం నోట్లోపడి చంద్ర    బాబు సోపాన పటం దాటి నేలకి అంటుకున్నాడు. అందుకని ఆటలో అనుభవాలు కాదు, సరైన పందాలు పడటం ముఖ్యం.

వ్యాసకర్త : శ్రీరమణ, ప్రముఖ కథకుడు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top