దళిత రాజకీయాలే కీలకమా?

shekargupta articles on dalit politics - Sakshi

జాతిహితం

మైనారిటీలు, దళితులు, ఆదివాసుల నుంచి ఏ ఒక్కరూ నేడు కేంద్రంలో కీలక మంత్రు లుగా లేదా జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలలో మినహా మరెక్కడా సీఎంలుగా లేరు. ఈ పరిస్థితే మెవానీకి అవకాశాన్ని కల్పిస్తోంది. బీజేపీ ఈ ముప్పును లెక్కచేయడం లేదు. దేన్నయినా జయించగల సమున్నత శక్తినని అది భావిస్తోంది. దళిత ఐక్యత వల్ల కలిగే ముప్పును మొగ్గలోనే తుంచేయగలనని అది భావిస్తోంది. కాబట్టే దళితుల ఆందోళనల పట్ల అతిగా ప్రతిస్పందిస్తోంది. భీమా–కొరెగాం ఉదంతం వాటిలో తాజాది.

దళితులు మన జాతీయ రాజకీయాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేసే శక్తిగా ఆవిర్భవించనున్నారా? దళిత ఆత్మవిశ్వాసంగా ఇటీవల అభివర్ణిస్తు న్నది కేవలం సామాజిక–రాజకీయపరమైనదేనా లేక జోరుగా సాగనున్న ఈ ఎన్నికల ఏడాదిలో వర్తమాన రాజకీయాల ధోరణిని బద్దలుకొట్టే శక్తి దానికి ఉన్నదా? ఉన్నట్టయితే, ఆ రాకెట్‌లో మే 2019 వరకు సరిపడేటంత ఇం«దనం ఉన్నదా? లే క అంతకంటే ముందుగానే కొడిగట్టిపోతుందా? ఈ ప్రశ్నల పరం పరను మరో రెండు ప్రశ్నలతో ముగిద్దాం. ఈ నూతన అంశం జిగ్నేశ్‌ మెవానీ రూపంలో వ్యక్తమౌతోందా? రాజకీయ పరిభాషలో ఆయన సరికొత్త కాన్షీరాం కానున్నారా? లేక మహేంద్రసింగ్‌ తికాయత్‌ లేదా రిటైర్డ్‌ కల్నల్‌ కిశోరీసింగ్‌ బైంస్లాల వంటి వారు మాత్రమేనా? నేను చెప్పదలుచుకున్న అంశమైతే ఇదే.. కాన్షీరాం దేశ ప్రధాన భూభాగంలోని రాజకీయాలను ప్రగాఢంగా ప్రభావితం చేశారు. మిగతా ఇద్దరికీ వివిధ సమయాల్లో జాట్లు, గుజ్జర్ల మద్దతున్నా క్రమంగా తెరమరుగయ్యారు.

దళిత ఓటర్లను సంఘటితం చేయగలరా?
దేశ ఓటర్లలో దాదాపు 16.6 శాతం ఉండే దళితులు నిజానికి ముస్లింల కంటే మరింత శక్తివంతమైన ఓటు బ్యాంకు. కేరళ, తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాల్లో తప్పితే 1989కి ముందు కాంగ్రెస్‌ దళితులంతా తమ ఓటర్లేనని భావించగలిగేది. 1989 నుంచి కాంగ్రెస్‌ వెనుకబడిన కులాలు, ముస్లింలతో పాటూ దళితుల ఓట్లను కోల్పోవడం మొదలైంది. ముస్లింలకు భిన్నంగా దళితులు ఎన్నడూ వ్యూహాత్మకంగా లేదా ఒక పార్టీని ఎన్నుకోవాలి లేదా మరో పార్టీని అధికారానికి దూరంగా ఉంచాలి అనే ఏకైక లక్ష్యంతో ఎన్నడూ ఓటు చేయలేదు. ఉత్తరప్రదేశ్, బిహార్‌ సహా చాలా కీలక రాష్ట్రాల్లో దళితుల ఓట్లు కాంగ్రెసేతర పార్టీలకు వెళ్లాయి. బీజేపీకి అది ఉపయోగపడింది. దళి తులలో కొందరు నరేంద్ర మోదీ పట్లా్ల, ఇటీవలి కాలంలో ఆ పార్టీ పట్ల కూడా ఆకర్షితులయ్యారు. కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు తదుపరి దశలో... జాతీయ రాజ కీయాల్లో ఏమంత ప్రాధాన్యం లేనంతగా దళితుల ఓట్లు చీలిపోయాయి. మరోవిధంగా కూడా ముస్లింలకంటే దళితులు విభిన్నమైన ఓటర్లు.  దళితుల ఓట్లు వివిధ రాష్ట్రాల్లో బాగా చెల్లా చెదురుగా ఉన్నాయి. కాబట్టి ముస్లింల వలే చాలా రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలను తలకిందులు చేయగల శక్తిని కోల్పో యారు. ఉత్తరప్రదేశ్‌ ఒక్కటే ఇందుకు మినహాయింపు.

దళిత ఓటర్లు అత్య ధికంగా ఉన్నది పంజాబ్‌లో (32%). కానీ వారిలో చాలా మంది సిక్కులు. ఆ రాష్ట్రంలో ఓటర్లు కులం ప్రాతిపదికపై సమీకృతం కారు. కానీ పెద్ద సంఖ్యలో ఎవరి ఓట్లయినా ఒక పక్షంవైపు మొగ్గితే బలాబలాలు తారుమారు అవు తాయి. అందువల్ల మనం ముందు వేసిన ప్రశ్నల సారం ఒక్కటే.. దళిత ఆత్మ విశ్వాసానికి ప్రాతినిధ్యం వహిస్తూ, వారికి నాయకత్వం వహిస్తున్న మెవానీ దళిత ఓట్లను అలా సంఘటితం చేయగలరా? ఆ పని చేయగలిగితే అది ప్రస్తుత రాజకీయాల ధోరణిని భగ్నం చేయగలుగుతుంది. మెవానీ దళిత నేతగా ఆవిర్భవించినా ఆయన చాలా రాష్ట్రాలకు విస్తరిం చిన జనాకర్షణశక్తిగల నేత కూడా కావాల్సి ఉంటుంది. దళితులను అందరినీ సమీకరించగలిగిన ఒక నేత అవసరం. 1970ల మధ్య వరకు జగ్జీవన్‌రాం కాంగ్రెస్‌కు అలాంటి నేతగా ఉండేవారు. ఆ తర్వాత మరో దళిత నేతకు అలాంటి సాధికారతను కల్పించడంలో కాంగ్రెస్‌ విఫలమైంది. దాదాపు 8 శాతం ఓటర్లుగా ఉన్న ఆదివాసులకు చెందిన అలాంటి జాతీయ స్థాయి నేత ఏ పార్టీకీ, ప్రత్యేకించి కాంగ్రెస్‌కు (పీఏ సంగ్మా తర్వాత) లేరు. ఈ విష యంలో బీజేపీ పరిస్థితి మరీ అధ్వానం. దళితుడైన రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతిగా ఉన్నా అది లెక్కలోకి రాదు.

దళిత ఐక్యతకు అందివచ్చిన అవకాశం
మైనారిటీలు, దళితులు, ఆదివాసులలో ఎవరూ కేంద్రంలో కీలక మంత్రులుగా లేదా జమ్మూకశ్మీర్, ఈశాన్యాలను మినహా రాష్ట్ర ముఖ్యమంత్రులుగా లేని ఆసక్తికరమైన పరిస్థితి నేడుంది. సరిగ్గా ఇదే జిగ్నేశ్‌ మెవానీకి అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ముప్పును లెక్కచేయనంతటి రాజకీయ చతురత మోదీ–షాల బీజేపీకి ఉంది. దేన్నయినా జయించేయగల సమున్నత శక్తిననే ఆలోచనా ధోరణి దానిది. కాబట్టి తలెత్తగల ఆ ముప్పుతో తలపడి సాధ్యమైనంత త్వరగా, మొగ్గలోనే తుంచేయాలని ఆ పార్టీ భావిస్తుంది. క్షేత్రస్థాయిలో దళి తులు కార్యాచరణకు దిగడం పట్ల వారు అతిగా ప్రతిస్పందించడంలో అదే వ్యక్తమౌతోంది. భీమా–కొరెగాం ఉదంతం వాటిలో తాజాది.

ఉనాలో గోరక్షకులు దళితులపై సాగించిన అత్యాచారం నేపథ్యంలో మెవానీ నేతగా ముందుకు వచ్చారు. తొలుత ఆయనను గుజరాత్‌కే పరిమి తమైన స్థానిక నేతగానే చూశారు. రాజకీయంగా పెద్దగా లెక్కలోకి తీసుకోవా ల్సిన వాడిగా చూడలేదు. ఆయన రాజకీయాల్లో మొదట్లో సాంప్రదాయ కమైన ఎన్నికల రాజకీయాలను మెచ్చని జేఎన్‌యూ తరహా భావజాలం కని పించింది. అదికాస్తా ఆయన ఎన్నికల బరిలోకి దిగాలని, అది కూడా  బూర్జువా జాతీయ పార్టీ కాంగ్రెస్‌తో కూటమి కట్టాలని నిర్ణయించు కోవ డంతోనే అది ఒక్కసారిగా పూర్తిగా మారిపోయింది. ఆయన ప్రస్తుతం గుజ రాత్‌లోని ఒక ఎంఎల్‌ఏ మాత్రమే. అయినా అంతకంటే చాలా ఎక్కువ గానే లెక్కలోకి వస్తారు. ఇతర రాష్ట్రాలలోని దళితులకు తన సందేశాన్ని విని పించే అవకాశాన్ని కూడా అది ఆయనకు కల్పిస్తుంది. ఈ వారంలో ఆయన మహా రాష్ట్రలో చేసినది సరిగ్గా అదే.

మెవానీలో చాలా బలమైన అంశాలు చాలానే ఉన్నాయి. యవ్వనం, అద్భుత వాక్పటిమ, సామాజిక మాధ్యమాలను ఉపయోగించగల శక్తిసామ ర్థ్యాలు, రాజకీయ, భావజాలపరమైన పట్టువిడుపుల గుణం ఆయనకు న్నాయి. అంతేకాదు, ఇప్పటికి ఏకైక శత్రువు బీజేపీ మాత్రమేనంటూ దానిపైకే గురిపెట్టి... మిగతా వారందరితోనూ కలవగల దృష్టి కేంద్రీకరణ కూడా ఉంది. పైగా ఆయన దళితులలోని ప్రధానమైన ఒక ఉపకులానికి చెంది నవారు. ఆయన వచ్చింది చిన్న రాష్ట్రం నుంచి, అయితే ఆయనకు ముందు కాన్షీరాం కూడా ఆయనలాగే ఒక చిన్న రాష్ట్రం నుంచి వచ్చి జాతీయస్థాయిలో  అత్యంత ప్రబలమైన రాజకీయ ధోరణిని నిర్మించారు. అది ఆయనకు అను కూలంగా పనిచేసే మరో బలీయమైన అంశం అవుతుంది.

పంజాబీ అయిన కాన్షీరాం కూడా సాంప్రదాయకంగా చెప్పుకోదగినది కాని ప్రాంతం నుంచి రంగం మీదకు వచ్చారు. డీఆర్‌డీఓలో సైంటిస్టుగా పనిచేస్తూ, అంబేడ్కర్‌ రచనలతో ప్రభావితుడై ఆయన షెడ్యూల్డ్‌ కులాలు, వెనుకబడిన కులాలు, మైనారిటీ ఉద్యోగుల జాతీయ స్థాయి సంఘాన్ని (బీఏఎంసీఈఎఫ్‌) నిర్మించడంతో ప్రారంభించారు. అప్పటివరకు దళితులు అనే పదం పెద్దగా వాడుకలో లేదు. మొదట్లో ఆయన పతాకశీర్షికలకు ఎక్కా లని తాపత్రయపడేవారిలా కనిపించారు. 1980ల చివరి కాలం అస్థిరమైనది, కాంగ్రెస్‌ క్షీణిస్తూ పలు వేర్పాటువాద ఉద్యమాలు పుట్టుకొచ్చాయి.

కాన్షీరాం చూపిన రాజకీయ చతురత ఉందా?
సిక్కు వేర్పాటువాద నేతలు సహా రకరకాల గ్రూపులను ఆయన ఒక్క చోటికి చేర్చి భారీగా ప్రజలను సమీకరించారు. అయినా ఆయనను పెద్దగా లెక్క చేయలేదు. త్వరలోనే ఆయన తన శక్తిని పెంచుకుని, వారందరినీ వదిలించే సుకున్నారు. తన రాజకీయాలు వృద్ధి చెందాలంటే మెవానీ కూడా ఉమర్‌ ఖలీద్‌ను విడిచిపెట్టాలి. దేశ ప్రధాన భూభాగంలో వేళ్లూనుకోనిదే జాతీయ వాదాన్ని లేదా మతాన్ని ఢీకొంటూ దళిత రాజకీయాలను నిర్మించలేమని కాన్షీరాం 30 ఏళ్ల క్రితమే కనిపెట్టారు. దాన్ని మెవానీ గుర్తించాలి. అయితే, కాన్షీరాంగానీ, మాయావతిగానీ హిందూయిజాన్ని తిరస్కరించలేదు లేదా బౌద్ధాన్ని స్వీకరించలేదు. ‘‘మన పోరాటం హిందూ దేవతలతో కాదు మను వాదులతో’’ అనే వారాయన. ఇక బుద్ధుడంటారా? మను వాదులు మూడు కోట్ల దేవతల్లో ఒకడిని చేసేస్తారు అంటుండేవారు. ఆయన రాజకీయాల్లోకి ప్రముఖంగా ముందుకు వచ్చినది 1988లో.

బోఫోర్స్‌ కుంభకోణం విష యంలో రాజీవ్‌ను తప్పు పడుతూ వీపీ సింగ్‌ ఆయన మంత్రివర్గం నుంచి రాజీనామా చేశారు. అదేసమయానికి అమితాబ్‌ బచ్చన్‌ రాజీనామా చేయ డంతో అలహాబాద్‌ పార్లమెంటు స్థానానికి ఉపఎన్నిక అవసరమైంది. వీపీ సింగ్‌కు, కాంగ్రెస్‌ అభ్యర్థి, లాల్‌బహదూర్‌ శాస్త్రి కుమారుడు సునీల్‌ శాస్త్రికి మధ్యనే పోటీ జరుగుతున్నదని మేం అంతా అనుకున్నాం. కొన్ని రోజుల ప్రచారం జరిగే సరికే కాన్షీరాం నిర్ణయాత్మక శక్తిగా ముందుకు వచ్చారు. అప్పుడే మేం మొదటిసారిగా సూటిగా సరళంగా దళిత రాజకీయాలను విన్నాం : ‘‘40 ఏళ్లుగా మనం జంతువుల్లా బతికాం. మనుషులుగా బతకా ల్సిన సమయం వచ్చింది.’’ ఆయన ఎన్నికల ప్రచారంలో, ఆ తర్వాత రూప కల్పన చేసిన రాజకీయాల్లో మూడు అంశాలు కొట్టవచ్చిట్టు కనిపించేవి.

ఒకటి, అస్పష్టంగానైనా వేర్పాటువాది అనిపించిన వారెవరైనా వారిని ఆయన దూరంగా ఉంచేవారు. రెండు, తన కుటుంబ జాతీయవాద, సైనిక వారసత్వాన్ని పదే పదే ఏకరువు పెడుతుండేవారు. అంతేకాదు, తన ప్రచా రాన్ని కూడా సైనిక పద్ధతుల్లోనే నిర్వహించేవారు: ప్రింటింగ్‌ బ్రిగేడ్, పాంప్లెట్‌ బ్రిగేడ్, దళిత బస్తీల్లో డబ్బాలు పట్టుకుని చందాలు సేకరించే బిచ్చగాళ్ల బ్రిగేడ్లను నిర్మించేవారు. వాళ్లిచ్చే డబ్బు ఎంత అని కాదు. ‘‘ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఒకసారి ఒక రూపాయి ఇచ్చాడంటే, కాంగ్రెస్‌ వెయ్యి రూపాయలిచ్చినా దానికి ఓటు వేయడు’’ అనేవారు. ఇక మూడవది, అతి ముఖ్యమైనది. ఆయన తన శిబిరాన్ని సువిశాలంగా మార్చారు. బహుజన సమాజ్‌ అనే నిర్వచనంతో ఇతర వర్గాలన్నిటినీ ఆకర్షించడానికి ప్రయత్నిం చారు. అలాగే ఆయన ఓట్లు మావి, అధికారం మీదా/ ఇక చెల్లదు, ఇక చెల్లదు అనే నినాదాన్ని తయారుచేశారు. తర్వాతి కాలంలో అధికారంలోకి రావడా నికి ముస్లింలను, కొన్ని ఉన్నత కులాలను కూడా కలుపుకుపోవాలని ఆయన, మాయావతి గుర్తించారు.

అదే వారిని అధికారంలోకి తెచ్చింది. ఓడినా మాయావతిని ఇంకా ప్రబల శక్తిగా నిలిపింది. దళిత కౌటిల్యునిగా కాన్షీరాం తన మేధస్సుతో మాయావతిని తన చంద్రగుప్తునిగా తయారుచేశారు. మెవానీకి అలాంటి నైపుణ్యం, ప్రతిభ, తదేక దృష్టి ఉన్నాయా? చెప్పడం కష్టమే. కానీ, బీజేపీ, హిందూ ఉన్నత వర్గాలకు చెందిన మితవాదశక్తులూ ఆయన గురించి ఆందో ళన చెందడమే ఆ విషయాన్ని విశదం చేస్తుంది.


శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త దప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌

twitter@shekargupta

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top