ఆ ‘పెళ్లీ’ మగాళ్ల హక్కేనా?

samanya kiran article on Renu Desai marriage comments - Sakshi

ఆలోచనం
రేణూ దేశాయ్‌ రెండో పెళ్లి చేసుకోవాలని ఉందన్నపుడు పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు ఏమన్నారన్నది పక్కన పెడదాం. నిజానికి, ఇద్దరు పిల్లల భారాన్ని తన భుజాలపై మోస్తున్న ఆమెకు వరుడు దొరకడం అంత సులభమేనా?

మహాభారతంలో దీర్ఘతమ మహర్షి అంధుడు. అతని భార్య ప్రద్వేషి. ఆమె ఒకానొకరోజు అతని అంధత్వాన్ని భరించలేనని భావించి  ‘‘పతియు భరియించు గావున భర్తయయ్యె! భామ భరియింపబడుగాన భార్య యయ్యె బరగనవి మనయందు వీడ్వడియె నిన్ను ! నేన ఎల్లకాలం భరియింతు గాన (మహాభారతం 1–4–228)’’ అంటూ భర్తను వదిలిపెట్టేస్తున్నానని ప్రకటిస్తుంది. అప్పుడు దీర్ఘతముడు భార్య కాళ్లావేళ్లా పడలేదు. చక్కగా ‘‘భర్తలను కోల్పోయిన భార్యలు అతి ధనవంతులైనా, ఉత్తమ కులాలలో పుట్టినవారైనా ఇప్పటినుంచి, అలంకారాలు లేనివారుగా, తాళిహీనులవుదురుగాక’’ అని శాపం పెట్టేశాడు. ఆపై ఉశిజను పెళ్లాడి 11 మందికి జన్మనిచ్చాడు, సుదేష్ణకు 5 మంది పుత్రులను అనుగ్రహించాడు. కానీ ప్రద్వేషి ‘ఒక మగవాడిని నేను భరించలేను బాబో విడిచిపెట్టేస్తాను’ అన్నందుకు ఇవాళ స్త్రీ జాతంతా ఆ శాపాన్ని అనుభవిస్తున్నట్లుందని నాకు రేణూదేశాయ్‌ మాటలు విన్నాక తోచింది.

దీర్ఘతమ మహర్షి నుంచి నేటివరకు పురుషులు భార్యలను వదిలేశాక మళ్లీ పెళ్లాడుతూ, ఆ స్త్రీలకు సంతానాన్ని ప్రసాదిస్తూ, పెళ్లాడలేని స్త్రీలకు సంతానాన్ని అనుగ్రహిస్తూ సంతోషంగానే ఉన్నారని పవన్‌ కళ్యాణ్‌ మనకు సోదాహరణంగా తెలియపరుస్తున్నారు. భవయ్యా అనేది ఒక బెంగాలీల జానపద పాయ. అందులో ఒక పాట పల్లవి ‘‘నారీ హోవార్‌ కీ జె భేతా, ఏ పృథ్వి భూజేన తాహా’’ అంటే.. స్త్రీగా జన్మనెత్తడం ఎంత బాధాకరమైన విషయమో ఈ ప్రపం చం దానిని అర్థం చేసుకోవడం లేదు అని అర్థం.

నా జీవితంలో నాకు తారసపడిన అనేకమంది స్త్రీలు, స్త్రీగా పుట్టడంలో ఉన్న బాధను అనేక సార్లు నాకు పరిచయం  చేశారు. నా ఇంట్లోకి  కొత్తగా వచ్చిచేరిన వంటమ్మాయి కోటమ్మ. ఒక బిడ్డ పుట్టీ పుట్టగానే అకారణంగా భర్త ఆమెను విడిచి పెట్టేశాడు. బిడ్డకు పందొమ్మిదేళ్లు. పద్దెనిమిదేళ్ల క్రితపు తన జీవితాన్ని నాకు చెబుతూ ఇవాళంతా ధారాపాతంగా ఏడ్చింది. ఈ మధ్యనే పరిచయమైన భ్రమరాంబ దిగువ మధ్యతరగతి స్త్రీ. భర్త గుండెపోటుతో పోయాడు. ఇద్దరు పిల్లలు. మళ్లీ పెళ్లి చేసుకోవాలంటే బోలెడు సందేహం.. నా పిల్లల్ని చూస్తాడా ఆ వచ్చేవాడు అని. ఆ నలభయ్యేళ్ల స్త్రీ రెండు చేతులతో కళ్లనుంచి జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ఉంటే నాకు చాలా నిస్సహాయంగా అనిపించింది.

ఎందుకని వీళ్లందరికీ పవన్‌ కల్యాణ్‌కి అయినంత సులభంగా పెళ్లిళ్లు కావడం లేదు? సౌందర్యమూ, సంస్కారమూ ఉన్న రేణూ దేశాయ్‌ రెండోపెళ్లి చేసుకోవాలని ఉందన్నపుడు పవన్‌ అజ్ఞానపు అభిమానులు ఏమన్నారు అన్న విషయాన్ని పక్కన పెడితే, నిజానికి, ఇద్దరు పిల్లల భారాన్ని కావడిని మోస్తున్నట్లు తన భుజాలపై మోస్తున్న ఆమెకు వరుడు దొరకడం అంత సులభమేనా? కాదని చెబుతుంది యునైటెడ్‌ నేషన్స్‌ వారి వరల్డ్‌ విమెన్‌ 2015 రిపోర్ట్‌. ఈ నివేదిక ప్రకారం ‘‘తల్లిదండ్రులలో ఒకరే ఉన్న కుటుంబాలలో నాలుగింట మూడొంతులు.. పిల్లలతో కూడిన ఒంటరి మహిళలతోనే ఉంటున్నాయి. 40 నుంచి 49 ఏళ్ల వయస్సు కలిగివుండి విడాకులు తీసుకున్న లేక విడిపోయిన మహిళల నిష్పత్తి అదే వయస్సు ఉన్న పురుషుల గ్రూప్‌ నిష్పత్తి కంటే 25 శాతం అధికంగా ఉంటోంది’’. ఒకప్పుడు అంటే వితంతు పునర్వివాహ ఉద్యమం జరుగుతున్నపుడు సంఘసంస్కర్తలు అదే పనిగా ఆ విషయంపై దృష్టి కేంద్రీకరించారు కనుక ఆనాటి ఉద్యమావేశంలో కొంతమంది స్త్రీలకు పునర్వివాహాలు అయిఉండొచ్చు కానీ ఇప్పుడు గ్రామాలవారీగా పరిశీ లిస్తూ వెళితే నిండు యవ్వనంలో ఉండీ పునర్వివాహం కానీ స్త్రీలు మీకు ఎంతోమంది కనిపిస్తారు కానీ పురుషులు ఆ స్థాయిలో కనిపించరు.

సెలెబ్రిటీ అయినా రేణూ దేశాయ్‌ పునర్వివాహం గురించి చర్చ పెట్టడం బాగానే ఉంది కానీ ఆమె  స్టేట్‌మెంట్‌లో నన్ను చాలా ఆశ్చర్యపరిచిన అంశం ‘‘శరీరం బాగాలేనప్పుడు చూసుకునేందుకు ఎవరైనా ఉంటే బాగుంటుంది కదా అందుకని పునర్వివాహం గురించి ఆలోచిస్తున్నాను’’ అని చెప్పడం. కొన్నేళ్ల క్రితం, అప్పటికే ఉద్యోగం నుంచి రిటైరయి ఉన్న నా స్నేహితురాలి తండ్రి ఏళ్లకు ఏళ్లు కాపురం చేసిన తన భార్య చనిపోయిన కొద్ది నెలల్లోనే ‘‘కాసిన్ని ఉడుకు నీళ్లు కాచి ఇచ్చే వాళ్లుంటే బాగుంటుంది’’ అని భావించి పిల్లల్తో ఘర్షణపడి ద్వితీయ వివాహం చేసుకున్నాడు. అలా చేసుకునేందుకు ఆయన చెప్పిన ‘‘ఉడుకు నీళ్ల’’ కారణమే, బాగా పుస్తకాలు చదువుతాను అని చెప్పుకునే రేణూ దేశాయ్‌ కూడా చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. చలం ‘స్త్రీకి శరీరం ఉంది దానికి వ్యాయామం కావాలి’ అన్నాడు. ఆ వ్యాయామం భౌతిక సుఖావసరాలు కూడా కదా. అందుకని  బాగా చదివే రేణూ దేశాయ్‌కి ‘‘గాన్‌ విత్‌ ది విండ్‌’’ రాసిన మార్గరెట్‌ మిషెల్‌ మాటలు గుర్తు చేయాలని నాకనిపిస్తోంది. మార్గరెట్‌ మిషెల్‌ 1930లలోనే ‘‘మగవాడితో నిమిత్తం లేకుండా ఆడది ఈ ప్రపంచంలో ఏ పనైనా చేయగలదు; పిల్లల్ని కనడం తప్ప, మరే పనైనా చేయగలదు’’ అని తన నవలా పాత్ర ద్వారా ప్రకటించింది.

పోతే, రేణూ దేశాయ్‌ విషయంలో నాకు, పవన్‌ అభిమానులను ఒక ప్రశ్న అడగాలని ఉంది. ఈ ప్రశ్న తనను బిడ్డ తల్లిని చేసి వదిలేసిన దుష్యంతుడిని శకుంతల అడుగుతుంది.. ‘బుద్ధితో బాగా పరిశీలిస్తే – పతి వ్రత, గుణవంతురాలు, సంతానవతి, అనుకూలవతి అయిన భార్యను తిరస్కారభావంతో చూసే కడు దుర్బుద్ధికి ఇహపరసుఖాలు రెండూ ఉంటాయా?


సామాన్య కిరణ్‌
వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 91635 69966

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top