
సమాచార మాధ్యమాలు అతి తక్కువగా ఉన్నకాలంలో జన ప్రయోజన రాజకీయ ఆచరణను ప్రజలకు తెలియచేసిన విజయవంతమైన నాయకుడు గాంధీజీ. విస్తృత స్థాయిలో తన వ్యక్తీకరణలు చేరాలని భిన్న పద్ధతులు ఉపయోగించిన విలక్షణ సామాజికుడు ఆయన. నిజానికి పొలిటీషియన్ అంటే సామాజికవేత్త అనే అర్థం. అనంతరకాలంలో అది ఒక సంకుచిత అర్థంలో రాజకీయవేత్త అయింది. సమాచార సాంకేతిక వ్యవస్థలు అంతంతమాత్రంగా ఉన్నప్పుడు వందేళ్లక్రితం ఆయన ఏ విధానాల ద్వారా, ఏ వ్యక్తీకరణలద్వారా దేశ ప్రజలకు స్వాతంత్య్ర పోరాట అవసరాన్ని తెలియజేసి, బ్రిటిష్ సామ్రాజ్య దురహంకార వలసవాద ప్రభుత్వానికి సవాలుగా నిలిచారన్నది గమనిస్తే గాంధీజీ విలక్షణ శైలి వెల్లడవుతుంది. ఒకపక్క విశాల ప్రజారాశిని కూడగట్టి, ఉద్యమాన్ని విస్తృతం చేయడంతోపాటు, తన కాలపు ప్రధాన సమాచార వ్యవస్థ పత్రికలేనని గుర్తించి పాత్రికేయునిగా వారిలో జాతీయోద్వేగ భరిత స్వాతంత్య్ర పోరాట కాంక్షను రగిల్చారు. దక్షిణాఫ్రికాలో ఉండగా ఒక పత్రికకు, మన దేశంలో మూడు పత్రికలకు సంపాదకత్వం వహించిన గాంధీజీ ఉత్తమశ్రేణి పత్రికా రచయిత అని చెప్పవచ్చు.
దక్షిణాఫ్రికాలో భారతీయుల ఆత్మగౌరవ పోరాటం సమయంలోనే పత్రికల ద్వారా ప్రభుత్వంతో సంభాషించే సంస్కృతిని అలవరుచుకుని ‘ఇండియన్ ఒపీనియన్’ పత్రికకు సంపాదకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత యంగ్ ఇండియా, హరిజన్, నవజీవన్ వంటి పత్రికలను నడిపారు. రాజకీయవేత్తలకు అవసరం అయిన మాటతీరు, ప్రసంగకళతోపాటు గాంధీజీకి రాత నైపుణ్యంకూడా ఉంది. ఏ విషయాన్నయినా గుజరాతీ, హిందీ భాషల్లో సూటిగా సరళంగా చెప్పడం ఆయనకే చెల్లింది. అన్నిటికీ మించి ‘టైమింగ్’(సరైన సమయంలో ప్రబలమైన పని చేయడం)ను విజయవంతంగా అమలు చేశారు. కాంగ్రెస్ కేవలం సంపన్నులకు, మధ్యతరగతికి పరిమితమైన దశలో గాంధీజీ ప్రవేశించి పునాది వర్గాలైన అట్టడుగు ప్రజానీకం, రైతులు, పేదలతో సజీవ సంబంధాలు నెలకొల్పారు. చంపారన్, నీల్‌ఛాస్(నీలిమందు పంట పండించటం) రైతుల ప్రయోజనాలకోసం పనిచేశారు. బ్రిటిష్ పాలకులకు నిర్మాణాత్మక పోరాటం ఎలా ఉంటుందో చవిచూపించారు. బాబూ రాజేంద్ర ప్రసాద్ వంటి బీహార్ యువ నేతలతో అధ్యయనం చేయించి వందలాదిమంది రైతుల కడగండ్ల గురించి సవివరమైన నివేదికను రూపొందించి బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించారు. మొదట్లో గాంధీజీని కట్టడి చేయడానికి ప్రయత్నించి విఫలమైన ప్రభుత్వం చివరకు ఆ నివేదిక ఆధారంగా 1918 ఫిబ్రవరిలో నీలిమందు రైతుల కష్టాలను తీర్చడానికి చంపారన్ వ్యవసాయ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది.
తదుపరి కాలంలో అహ్మదాబాద్ కార్మికుల హక్కుల పోరాటం, రౌలట్ బిల్లు వ్యతిరేక ఆందోళన, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం, చౌరీచౌరా జనాగ్రహం వంటి పరిణామాలు సాగుతున్నా భారత జాతీయోద్యమం పట్ల ప్రపంచ దృష్టి ఉండాల్సిన స్థాయిలో లేదని గాంధీజీ భావించారు. ఉప్పు సత్యాగ్రహం సమయానికి సమాచార రంగంలో కీలక మార్పు చోటు చేసుకుంది. 1929లో ఇంపీరియల్ కమ్యూనికేషన్స్ కంపెనీ అంతవరకూ పరిమితంగా ఉన్న కేబుల్ సమాచార వ్యవస్థను అట్లాంటిక్ సముద్రానికి ఆవల ఇంగ్లాండ్, యూరప్, బ్రిటిష్ వలసపాలిత ప్రాంతాకు విస్తరించింది. ఈ వ్యవస్థ ద్వారా వార్తలు అతి వేగంగా ప్రపంచానికంతకూ చేరతాయని గ్రహించిన గాంధీజీ, ఇతర నాయకులు దండియాత్ర, సత్యాగ్రహం వంటి పోరాటాలపై ప్రపంచ పౌరుల్లో అవగాహన పెంచారు. దీని ఫలితంగా మన స్వాతంత్య్ర పోరాటంపై అంతర్జాతీయంగా ఆసక్తి ఏర్పడింది. మనకు నైతికంగా మద్దతునిచ్చేవారు అంతకంతకు పెరిగారు.
అమెరికా నుంచి వెలువడే టైమ్ పత్రిక రెండేళ్లలో రెండుసార్లు–1930లో ‘సెయింట్ గాంధీ’ అంటూ, 1931లో ‘మాన్ ఆఫ్ ద ఇయర్’ అంటూ గాంధీజీపై కవర్ పేజీ కథనాలను ఛాయాచిత్రాన్ని ముఖపత్రంగా ప్రచురించింది. ఆయన గ్రామగ్రామాన సాగించిన యాత్రలపై అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా కథనాలు వెలువడటం బ్రిటిష్ పాలకుల్లో కూడా మార్పు తెచ్చింది. దండియాత్రకు ముందు చర్చలకు సిద్ధమని, అవసరమైతే యాత్ర కూడా నిలుపుదల చేస్తామని గాంధీజీ చెప్పినా పట్టించుకోని ఆ పాలకులు ఆ తర్వాత పునరాలోచనలో పడి చర్చలకు ఆహ్వానించారు. ఫలితంగా గాంధీ–ఇర్విన్ ఒడంబడిక సాధ్యపడింది. ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా సాగిన ఆందోళనలు, అరెస్టులు, లాఠీచార్జ్‌ల గురించి అమెరికన్ పాత్రికేయుడు వెబ్ మిల్లర్ పంపిన వార్తాకథనం గమనిస్తే ఆ ఆందోళన ఏ స్థాయిలో జరిగిందో అర్ధమవుతుంది. ‘ఒక్క సత్యాగ్రహి కూడా తనపై పడుతున్న దెబ్బలను ప్రతిఘటించలేదు.
ఏ రక్షణా లేని తలలపై లాఠీ దెబ్బలు పడే శబ్దం నాకు వెగటు, రోత కలిగించింది. మైదానమంతా తలలు పగిలినవారూ, భుజాల ఎముకలు విరిగినవారూ చేస్తున్న రోదనలతో నిండిపోయింది. వారి తెల్లని దుస్తులపై రక్తం మడుగులు కట్టింది. వరుసలో మిగిలినవారు కూడా ఏ మాత్రం జంకకుండా తమ వంతు వచ్చేవరకూ నడిచి పోలీసుల ముందుకు రావడం, దెబ్బలు తినిపడిపోవడం కనబడింది. ఈ అహింసాత్మక నిరసనకు పోలీసులు విసుగుచెంది ఒక్కుమ్మడిగా సత్యాగ్రహులందరిపై విరుచుకుపడి ఎక్కడబడితే అక్కడ లాఠీలతో బాదారు. వారిని వంద అడుగుల వరకూ ఈడ్చుకెళ్లి పక్కనున్న పొదలు, తుప్పల్లోకి లాగి పారేశారు’. ఈ ఉద్యమంపై రూపొందిన మిల్లర్ నివేదికను బయటకు పొక్కకుండా ఆపేందుకు బ్రిటిష్ పాలకులు విశ్వ ప్రయత్నం చేశారు. చివరకు ప్రపంచ ప్రజల ఆగ్రహానికి జడిసి దాన్ని బయటపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా 1,350 పత్రికలు దాన్ని ప్రచురించాయి. భారత్‌ను తాము న్యాయబద్ధంగా పాలిస్తున్నామంటూ వలస పాలకులు చెబుతున్నదంతా బూటకమని దండియాత్ర దండోరా వేసింది. వారి పాలనపై దండి సత్యాగ్రహం తొలి గొడ్డలి వేటు.
భిన్న మార్గాల్లో ప్రజలతో నిరంతరం సంబంధబాంధవ్యాలను నెలకొల్పుకోవటం, సాధారణ దుస్తులు ధరించి సామాన్యులతో కలిసిపోవటం గాంధీజీకే చెల్లింది. శ్రేయోదాయక సామాజిక లక్ష్యాన్ని సంకల్పించి, అందుకోసం ఎంతగానో కృషి చేసి తన జీవితకాలంలోనే దాన్ని సాధించిన అరుదైన ప్రపంచ రాజకీయ నాయకుల్లో గాంధీజీ ముఖ్యులు. నిరంతర జన సంపర్కం, నిరాడంబరత, పట్టుదల, అద్భుతమైన భావవ్యక్తీకరణ ఆయన నుంచి ఈ తరం నేర్వదగిన గొప్ప సుగుణాలు. ఈ ఏడాది పొడవునా దేశ ప్రజలు జాతిపితను భిన్న కోణాల్లో అధ్యయనం చేయడం ద్వారా ఆయన స్ఫూర్తి పరివ్యాప్తం కావడానికి కృషి చేస్తారని ఆశిద్దాం.
రామతీర్థ, ప్రముఖ కవి
మొబైల్: 9849200385