కేరళపై ఇంత వివక్షా?

PM Narendra Modi Help To Kerala Over Floods - Sakshi

ప్రకృతి విలయతాండవంతో మొత్తం 14 జిల్లాలు నీటిలో మునిగి కేరళ రాష్ట్రం నేడు ఒక దీవిగా మారింది. ఆవాసాలు నీటిలో మునిగి తిండి, తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవడానికి ప్రతీ ఒక్కరూ ఏదో రూపంలో, తమ తమ శక్తిమేరకు సాయం చేస్తున్నారు. దేశవిదేశాల్లో ఉండే భారతీయులు సైతం సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. కాగా ప్రధాని మోదీ వైఖరి మాత్రం తీవ్ర వివాదాస్పదమౌతుంది. కేరళ రాష్ట్రానికి తక్షణ సహాయక చర్యల కోసం రూ. 2 వేల కోట్లు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం కోరగా, కేవలం రూ. 500 కోట్లు మాత్రమే ప్రకటించడం బాధాకరం. ఏరియల్‌ వ్యూ ద్వారా పరిస్థితులు చూసి కూడా మోదీ ప్రకటించిన సాయం ఏ మూలకు సరిపోవని, ఇలాంటి పరిస్థితుల్లో వివక్ష చూపరాదని హితవు పలుకుతున్నారు. సోషల్‌ మీడియాలో ఈ అంశంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

దేశ ప్రజల సొమ్ముకు కాపలా
దారుగా ఉండాల్సిన ప్రధాని మోదీ దుబారా ఖర్చులకు, వ్యక్తిగత అభీష్టానికి, బీజేపీ, సంఘ్‌ పరివార్‌ ఉనికిని కాపాడుకోవటానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. తన సొంత నియోజకవర్గం వారణాసిలో 2019లో జరుగబోయే అర్ధ కుంభమేళా ఏర్పాట్లకు రూ.1200 కోట్లు కేటాయించారు. 2015 ఆగస్టులో బిహార్‌ ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న మోదీ ఆ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సాయం కింద ఎంత కావాలంటూ లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వేలంపాట పాడి మరీ ప్రకటించారు. 2014–16 మధ్య వరుసగా రెండేళ్లు అనావృష్టి పాలైన తెలం గాణ రాష్ట్రంలో ఇన్‌–పుట్‌ సబ్సిడీ కోసం ప్రభుత్వం రూ. 5 వేల కోట్ల సాయం అడుగగా, రూ.800 కోట్లు మాత్రమే ఇచ్చి మోదీ చేతులు దులుపుకొన్నారు.

2014 అక్టోబర్‌లో హదూద్‌ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్టానికి రూ. 1,000 కోట్లు ప్రకటించారు కానీ, రూ.400 కోట్లకు మించి విడుదల చేయలేదు. 2015 డిసెంబరులో చెన్నై సిటీ జలదిగ్బంధం అయినప్పుడు అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రూ. 5 వేలకోట్లు తక్షణ సాయం కోరగా, ఒక వెయ్యి కోట్లు ప్రకటిం చారు. ఇప్పటికైనా సర్వస్వం కోల్పోయిన కేరళ రాష్ట్రంపై వివక్ష చూపకుండా, నిలువ నీడ లేకుండా పోయిన ప్రజలను మోదీ ప్రభుత్వం ఆదుకోవాలని ఆకాంక్షిద్దాం.
కొనగాల మహేష్, ఏఐసీసీ సభ్యులు ‘ 98667 76999 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top