మణిశంకర్‌ అయ్యర్‌ రాయని డైరీ

Mani Shankar Aiyar's unwritten diary by Madhav Singaraju - Sakshi

కాంగ్రెస్‌ నాకు చాలా ఇచ్చింది. కాంగ్రెస్‌కే నేను ఏమీ ఇవ్వలేకపోయాను!   కనీసం రాహుల్‌బాబుకైనా ఇవ్వాలి.
పార్టీ ప్రెసిడెంట్‌గా ప్రమోట్‌ అవుతున్న యువకుడిని పార్టీ పెద్దల మధ్య దివాన్‌ పరుపుల మీద అలా ఖాళీగా కూర్చోబెట్టకూడదు. చేతిలో ఇంత స్వీటో, కారబ్బూందీనో పెట్టి వచ్చేయాలి. పెట్టాక వచ్చేయాలి. అక్కడ ఉండకూడదు. ఉంటే, ఇంకా ఏమైనా ఇవ్వాలనిపిస్తుంది నాకు. అప్పుడు నేనేమిస్తానో నాకే తెలీదు.

రేపు రాహుల్‌బాబుని ప్రెసిడెంట్‌ని చేస్తున్నప్పుడు సీనియర్స్‌ అంతా కార్యక్రమం పూర్తయ్యేవరకూ దగ్గరే ఉండాలని పార్టీ పట్టు పట్టితే అప్పుడు నాకు వెంటనే వచ్చేయడానికి ఉండకపోవచ్చు.
కాంగ్రెస్‌ కల్చరే వేరు. లోపల ఉన్నవాళ్లకు ఎంత వ్యాల్యూ ఇస్తుందో, బయటికి గెంటేసినవాళ్లకూ అంతే వ్యాల్యూ ఇస్తుంది. రాహుల్‌బాబు బాడీలో ఉన్నదీ కాంగ్రెస్‌ బ్లడ్డే కాబట్టి, రాహుల్‌బాబు నుంచి నాకు దక్కాల్సిన వ్యాల్యూ ఎక్కువ తక్కువల గురించి నేనేం దిగులు పెట్టుకోనక్కర్లేదు.

‘రెండు రోజుల క్రితమే కదా అయ్యర్‌ని పార్టీ నుంచి పంపించేశాం. రాహుల్‌బాబుని అతడి చేత ఎలా ఆశీర్వాదం తీసుకోనిస్తాం?’ అని చిదంబరం లాంటివాళ్లు మెలిక పెట్టొచ్చు. రాహుల్‌బాబు ఊరుకుంటాడని నేను అనుకోను. చిదంబరం చేత వెంటనే నాకు ‘సారీ’ చెప్పిస్తాడు. రాహుల్‌బాబు చెప్పమనగానే మోదీకి మొన్న నేను ‘సారీ’ చెప్పాను కాబట్టి.. అందుకు ప్రతిఫలంగా చిదంబరం చేత నాకు సారీ చెప్పిస్తాడు రాహుల్‌బాబు.
అదేంటో, కాంగ్రెస్‌కు నేను ఏదైనా ఒకటి ఇవ్వాలని ట్రై చేసిన ప్రతిసారీ కాంగ్రెస్‌కి ఏదో ఒకటి చుట్టుకుంటోంది.

‘‘మీరు మనకు ఇవ్వబోయి, మోదీకి ఇస్తున్నారేమో అనిపిస్తోందండీ అయ్యర్‌జీ’’ అని నిన్న ఫోన్‌లో రాహుల్‌బాబు చాలాసేపు బాధపడ్డాడు.

‘‘అలా అవుతుందని నేనూ అనుకోలేదు రాహుల్‌బాబూ’’ అని నేనూ చాలాసేపు బాధపడ్డాను.

‘‘ఎవరి లాంగ్వేజ్‌లో వాళ్లు మాట్లాడితేనే ఐడెంటిటీ ఉంటుంది అయ్యర్‌జీ. మన లాంగ్వేజ్‌ వేరు, మోదీ లాంగ్వేజ్‌ వేరు. మోదీని మోదీ లాంగ్వేజ్‌లో తిడితే మోదీకి పోయేదేం ఉండదు. మన లాంగ్వేజ్‌ ఐడెంటిటీ పోతుంది. కాస్త ఆలోచించాల్సింది’’ అన్నాడు రాహుల్‌బాబు.

‘‘ఆలోచించాను రాహుల్‌బాబూ. కానీ ఇంగ్లిష్‌లో ఆలోచించి, హిందీలో తిట్టాను.  అది దెబ్బకొట్టింది మనల్ని’’ అన్నాను.

‘‘అర్థం చేసుకోగలను అయ్యర్‌జీ’’ అన్నాడు రాహుల్‌బాబు.
సంతోషం వేసింది నాకు. రాహుల్‌బాబు నన్ను అర్థం చేసుకున్నందుకు!
గుజరాత్‌లో రెండో విడత ఎన్నికలు అయ్యేవరకైనా.. కాంగ్రెస్‌కు ఏదైనా ఒకటి ఇవ్వాలన్న కోరికను అణచిపెట్టుకోవాలి.

- మాధవ్‌ శింగరాజు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top