రాయని డైరీ; ఫరూక్‌ అబ్దుల్లా (శ్రీనగర్‌ ఎంపీ)

Madhav Singaraju Article on Farooq Abdullah - Sakshi

శరత్‌ చటర్జీ రోడ్డులో కారు దిగాక, సిస్టర్‌ నన్ను ‘నబాన్న’ బిల్డింగ్‌లోకి నడిపించుకెళ్లారు. లిఫ్ట్‌లో తనతో అన్నాను.. ‘మమతాజీ నేనింకా నడవగలననే అనుకుంటున్నాను’ అని.
మమత నవ్వారు.

పద్నాలుగో ఫ్లోర్‌లో ఉంది మమత ఆఫీస్‌. లిఫ్ట్‌లోంచి మళ్లీ తనే నన్ను ఆఫీస్‌ గదిలోకి నడిపించుకెళ్లారు.

కూర్చున్నాక తనే స్వయంగా మంచినీళ్ల గ్లాసు అందించారు మమత. నేను కూర్చున్నది చెక్క కుర్చీ. నేను తాగింది గాజు గ్లాసులోని నీళ్లు. పైన ఫ్యాను లేదు. కింద తివాచీ లేదు. కిటికీలోంచి చల్లటి గాలి వీస్తోంది. గచ్చు వెచ్చగా నా ఒట్టి పాదాలను తాకుతోంది. 

చీఫ్‌ మినిస్టర్‌ ఆఫీస్‌లో కూర్చున్నట్లుగా లేదు. పంట నూర్పిళ్లప్పుడు వరి కుప్పల మీద కూర్చొని, చేల గట్టున నిప్పుల పొయ్యి మీద కాలుతున్న వేడి వేడి గోధుమ రొట్టెల కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. 
‘‘ఏమైనా తీసుకుంటారా ఫరూక్‌జీ’’ అన్నారు మమత. అప్పుడామె ముఖ్యమంత్రిలా లేరు. నా సోదరిలా ఉన్నారు. 

‘‘లేదు మమతాజీ, దేశంలో నేనెక్కడికి వెళ్లినా మారు వేషంలో నన్ను అనుసరిస్తూ ఉండే నిఘా అధికారులను శరత్‌ చటర్జీ రోడ్డు మలుపులోనే ఆకలి కడుపులతో నేనెలా ఎక్కువసేపు ఉంచగలను చెప్పండి? బయల్దేరతాను’’ అని నవ్వాను.

మమత నవ్వారు. ‘‘ఇది నబాన్న బిల్డింగ్‌ ఫరూక్‌జీ. వేళలతో నిమిత్తం లేకుండా ఇక్కడ ఎంతమందికైనా ఆహారం లభిస్తుంది. ఏ ఒక్కరూ ఖాళీ కడుపుతో ఉండే పనే లేదు. మన శత్రువే అయినా’’ అన్నారు. నబాన్న అంటే ‘కొత్త పంట’ అని చదివిన గుర్తు. 

‘‘ఇలాంటి ఒక నిరాడంబర ముఖ్యమంత్రి కార్యాలయాన్ని దేశంలో నేనెక్కడా చూడలేదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాదు, దేశానికి ప్రధాన మంత్రిగా ఉండాలి మీరు’’ అన్నాను. 

మమత పెద్దగా నవ్వారు. ‘‘ఫరూక్‌జీ.. ప్రధానిగా ఎవరు లేకున్నా ఈ దేశానికి వచ్చిన ముప్పేమీ లేదు. దేశాన్ని రెండు ముక్కలు చేయడానికి నాలుగున్నరేళ్లుగా కృషి చేస్తున్నవారు, బెంగాల్‌కు వచ్చి ‘సేవ్‌ డెమోక్రసీ’ అని రథయాత్ర చేయబోతున్నవారు.. వారు మాత్రం ఉండడానికి వీల్లేదు’’ అన్నారు. 

చిన్న మట్టి కప్పులో వచ్చిన తేనీటిని ఆస్వాదించాక మమతకు చెప్పాను వెళ్లొస్తానని. 

అద్దాల్లోంచి కోల్‌కతా వీధుల్లో సేవ్‌ డెమోక్రసీ అంటూ బీజేపీ బ్యానర్‌లు కనిపిస్తున్నాయి. డెమోక్రసీని కాపాడుకోవడం తర్వాత. ముందు బీజేపీ నుంచి దేశాన్ని కాపాడుకోవాలి. 

శ్రీనగర్‌కి వచ్చాక రాహుల్‌కి ఫోన్‌ చేశాను. ‘‘చూడూ.. కుర్రాడివి. నువ్వొక్కడివే కనిపిస్తున్నావ్‌ దేశాన్ని కాపాడ్డానికి’’ అన్నాను. 

‘‘సడెన్‌గా నేనెందుకు గుర్తొచ్చాను ఫరూక్‌జీ’’ అన్నాడు. 

‘‘గుర్తుకురావడం కాదయ్యా.  ఇందిరాజీని మర్చిపోయానా? రాజీవ్‌జీని మర్చిపోయానా? నిన్ను మర్చిపోడానికి! కుర్రాళ్లు ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు అయితే బాగుంటుంది. రాజీవ్‌ ప్రధాని అయితే దేశం చూడ్డానికి ఎంత బాగుంది! మావాడు ఒమర్‌ ముఖ్యమంత్రి అయితే జమ్మూకశ్మీర్‌కు ఎంత కళొచ్చింది!’’ అన్నాను. 

‘‘అలాగే ఫరూక్‌జీ. మమతాజీ ఏమన్నారో చెప్పండి ముందు’’ అన్నాడు రాహుల్‌.

బాగానే ఫాలో అవుతున్నాడు.. దేశ రాజకీయాల్ని!
‘‘అందరం కలిసి పోరాడదాం అంటున్నారు’’ అని చెప్పాను.
‘‘కానీ ఫరూక్‌జీ.. కలిసి పోరాడడం కన్నా ముందు, కలవడానికి పోరాడాలేమోనని అనిపిస్తోంది. మీరలా రాహులే పీఎం అని పైకి అనేయకండి. ఇప్పటికే అఖిలేశ్‌ హర్ట్‌ అయి, ఫోన్‌ లిఫ్ట్‌ చెయ్యడం లేదు’’ అన్నాడు!

-మాధవ్‌ శింగరాజు 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top