మైత్రీపురి పొత్తూరి

Madabhushi Sridhar Writes A Special Story On Potturi Venkateswara Rao - Sakshi

సందర్భం

ఆయన పేరు పొత్తూరి. మైత్రీపురి అని తన ఈమెయిల్‌ పేరు పెట్టుకున్నారు. 86 సంవత్సరాల జీవన సంఘర్షణ తరువాత ప్రశాంతంగా మృత్యువు ఒడిలోకి ఒరిగి పోయారు. ఆధ్యాత్మిక జీవనం, తత్వం, భక్తి, వేదాంతం అలవరుచుకుంటున్న రోజులలో ఆయనను అన్యాయంగా క్యాన్సర్‌ రక్కసి ఆవరించింది. ఆ రాకాసితో ఓపికగా పోరాడి, ఆస్పత్రినుంచి విడుదలై నిజనివాసంలో స్వేచ్ఛావాయు వులు పీల్చుకుంటూ దోసపండువలె రాలిపోయారు. సమాజం కోసం పోరాడుతున్న నక్సలైట్లను ప్రధాన జీవనస్రవంతివైపు మళ్లించాలన్న తపన. వారికీ, ప్రభుత్వానికీ మధ్య సయోధ్య సాధించడానికి అకుంఠిత దీక్షతో కృషి చేశారు. ఇవన్నీ ఆయన వ్యక్తిత్వ లక్షణాలు. 

1983–84లో ఆంధ్రప్రభ, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ వరంగల్‌ విలేకరిగా ఉన్నప్పుడు నాకు పొత్తూరితో సన్నిహిత పరిచయం.  వరంగల్లులో సమాచార భారతి విలేకరిగా ఉన్న ప్పుడు నేను రాసిన వార్తలు, పరిశోధనా వ్యాసాలు ఆంధ్రప్రభలో వచ్చేవి. సంచలనం కలిగించే వార్తలు అనేకం వచ్చాయి. అవి కొన్ని సమస్యలు కూడా తెచ్చిపెట్టాయి. వాటిని చాలా హుందాగా ఎదుర్కొన్నారు. పొత్తూరి ఉదయం పత్రిక సంపాదకులుగా రావడంతో మళ్లీ ఆయనతో మాకు సన్ని హిత సంబంధాలు ఏర్పడ్డాయి. పత్రికా సంపాదకుడుగా, విమర్శకుడుగా, రచయితగా పొత్తూరి ఎప్పుడూ సంచలనాలను నమ్ముకోలేదు. జాగ్రత్తగా ఎవరినీ నొప్పించకుండా రాయడం, నిర్మాణాత్మకమైన విమర్శలను చేయడం, సున్నితంగా మందలించడమే గానీ పరుష పదజాలం వాడడం అవసరం లేదనే సౌమ్యుడైన పత్రికా రచయిత. 

ఒకసారి నేను, సాయిబాబా రాసిన పరిశోధనా వార్తను ఆయన చర్చించి ఆమోదించి ప్రచురించారు. తొలి ఎడిషన్‌ ప్రతులు జిల్లాల కోసం ట్రక్కులు ఎక్కించాక, రాత్రికి రాత్రి వాటిని వెనక్కు రప్పించి, ఆ వ్యాసం తొలగించి కొత్త పత్రికలు ముద్రించి పంపారు. ఆ వార్త ఆగిపోవడం వెనుక కథ పొత్తూరికి తెలుసు. ఎవరితో ఘర్షణ పడకుండా మౌనంగా రాజీనామా చేశారు. ఇప్పటికీ ఆయన రాజీనామాకు మేమే పరోక్షంగా కారణమని బాధపడుతూనే ఉంటాం. పొత్తూరి వినియోగదారుల ఫోరంలో సామాజిక ప్రతినిధిగా, న్యాయమూర్తిగా హైకోర్టులో న్యాయపీఠం పైన కూర్చున్నారు. నన్నొకరోజు సహజ న్యాయసూత్రాల గురించి అడిగారు. నేను చదివింది, నేను తరగతి గదిలో చెప్పేది నాకు తెలిసింది చెప్పాను. ఆయన నాకు చిన్న పరీక్ష పెట్టారనీ నేను అందులో ఉత్తీర్ణుడినైనాననీ నాకు ఆ తరువాత తెలిసింది.  

పొత్తూరి ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అయిన తరువాత పిలిచి, పత్రికా రచన, కోర్టు ధిక్కారం, పరువు నష్టంపైన పుస్తకం రాయమన్నారు. తను స్వయంగా చదివి న్యాయధిక్కారం అనే మాటపై విశ్లేషణ చేశారు. మా నాన్నగారు ఎంఎస్‌ ఆచార్య స్మారక ప్రసంగం 2017లో పొత్తూరి ఇచ్చారు. పొత్తూరి లేని లోటు తీరదు. తెలంగాణ తన శ్రేయోభిలాషిని, తెలుగు రాష్ట్రాలు ఉత్తమ పాత్రికేయుడిని, ఒక చింతనాపరుడిని కోల్పోయాయి.

వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్‌
బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్,
కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌
madabhushi.sridhar@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top