కోహినూర్‌ వజ్రం మనకు దక్కేనా?

Madabhushi Sridhar Article On Kohinoor Diamond Issue - Sakshi

విశ్లేషణ

మన చరిత్ర, సంస్కృతి కాపాడుకోవడంలో మన ఘనత ఏమిటి? మన తాతలు తాగిన నేతుల కథలు చెప్పి మూతుల వాసన చూడమంటున్నామే గాని, ఆ ఘనత చాటే సాక్ష్యాలను దోచుకుపోతుంటే ఏమీ చేయలేకపోతున్నామా? అని ఓ పౌరుడు ఆర్టీఐలో ప్రశ్నించాడు. కోహినూర్‌ వజ్రం, సుల్తాన్‌గంజ్‌ బుద్ధుడు, నాసాక్‌ వజ్రం, టిప్పు సుల్తాన్‌ ఖడ్గం, ఉంగరం, మహారాజా రంజీత్‌ సింగ్‌ బంగారు సింహాసనం, షాజహాన్‌ మద్యపాత్ర, అమరావతి నిర్మాణ వస్తువులు, వాగ్దేవి చలువరాతి బొమ్మ, టిప్పు సుల్తాన్‌ దాచుకున్న యాంత్రిక పులి బొమ్మ వంటి విలువైన వస్తువులను విదేశీ పాలకులు మన దేశం నుంచి తరలించుకుపోయారని, వాటిని రప్పించే ప్రయత్నాలు ఎంతవరకు సత్ఫలితాలు ఇచ్చాయో తెలపాలని ప్రధానమంత్రి కార్యాలయాన్ని కోరుతూ రాజమండ్రికి చెందిన బీకే ఎస్‌ఆర్‌ అయ్యంగార్‌ ఆర్టీఐ దరఖాస్తు దాఖలు చేశారు.

ప్రధాని కార్యాలయం ఆ పత్రాన్ని వెంటనే పురావస్తు శాఖకు బదిలీ చేసింది. కళాఖండాల ఖజానా చట్టం ప్రకారం 1972 తరువాత దేశం నుంచి తస్కరించిన పురాతన వస్తువులను తెప్పించేందుకు చర్యలు తీసుకోవలసి ఉంటుంది గాని అంతకుముందు స్మగ్లింగ్‌ అయిన వస్తువులు, వాటి తరలింపుపై తాము ఏ చర్యలూ తీసుకోలేమని ఏఎస్‌ఐసీపీఐఓ  తెలిపారు. దేశం నుంచి తరలించుకుపోయిన 25 ప్రాచీన వస్తు వులను తిరిగి రప్పించగలిగామని, దరఖాస్తుదా రుడు అడిగిన కోహినూర్‌ వంటి అత్యంత విలువైన వస్తువుల గురించి తామే చర్యలు తీసుకోలేమని జవాబు ఇచ్చారు. తనకు కావలసిన సమాచారం ఇవ్వలేదని కమిషన్‌ ముందు రెండో అప్పీలు దాఖలు చేశారు.

స్వాతంత్య్రానికి ముందే తరలి పోయిన కోహి నూర్‌ వజ్రం, టిప్పు ఖడ్గం వంటి  చారిత్రక వార సత్వ చిహ్నా లను స్వదేశం రప్పించే అధికారం, వన రులు ఏఎస్‌ఐ శాఖలకు లేవని తనకు తెలుసనీ, అందుకే ప్రధాని కార్యాల యాన్ని సమాచారం అడిగానని, దానికి సమాధానం చెప్పకుండా, అధికారాలు లేని పురావస్తు శాఖకు బదిలీ చేయడం అన్యాయమని అయ్యంగార్‌ విమర్శించారు. కోహి నూర్‌ వజ్రం తిరిగి తెప్పించాలని కోరుతూ అఖిల భారత మానవ హక్కులు, సాంఘిక న్యాయం ఫ్రంట్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. తమకు ప్రజల భావాలు తెలుసనీ, కనుక కోహినూర్‌ వజ్రాన్ని సాధించడానికి భారత విదేశాంగ శాఖ ప్రయత్నిస్తోందని, బ్రిటన్‌ ప్రభు త్వంతో సంప్రదింపులను కొనసాగిస్తుందని సుప్రీం కోర్టుకు సర్కారు విన్నవించింది. సుప్రీంకోర్టులో హామీ ఇచ్చి రెండు రోజులు దాటకముందే ప్రభు త్వం మాట మార్చింది.

బ్రిటిష్‌ రాణికి బహుమతిగా ఇచ్చిన కోహినూర్‌ వజ్రాన్ని తిరిగి ఇవ్వాలని అడ గడం సాధ్యం కాదని తెలిపింది. గత ప్రభుత్వాల వాదన ప్రకారం కోహినూర్‌ విదేశీ పాలకులు దొంగి లించిన వస్తువు కాదని 1956లో ప్రధాని నెహ్రూ వజ్రాన్ని తిరిగి ఇమ్మని కోరడానికి ఏ ఆధారాలూ లేవని, అయినా డిమాండ్‌ చేయడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారని ప్రభుత్వ పక్షాన లాయర్లు వాదించారు. వాటిని వెనక్కి రప్పిం చడానికి ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని దాఖ లైన ఆర్టీఐ దరఖాస్తును పురావస్తు శాఖకు బదిలీ చేయడానికి బదులు ప్రధాన మంత్రి కార్యాలయమే జవాబు ఇవ్వాలని కేంద్ర సమాచార కమి షనర్‌ కోరారు.

దేశం నుంచి తరలిపోయిన పదో శతాబ్దపు దుర్గా మాత విగ్రహాన్ని జర్మన్‌ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ సంపాదించి 2015లో ప్రధాని నరేంద్రమో దీకి బహూ కరించారు. 900 ఏళ్ల పురాతన కీరవాణి సాలభంజిక సంపాదించి 2015 ఏప్రి ల్‌లో కెనడా ప్రధాని ఇచ్చారు. ఆస్ట్రేలియా ప్రధాని టోనీ ఆబట్‌ 2014లో భారత పర్యటనకు వచ్చినపుడు తమ దేశపు ఆర్ట్‌ గ్యాలరీల్లో ఉన్న హిందూ దేవతామూర్తులను మన ప్రధానికి అంద జేశారు. టవర్‌ ఆఫ్‌ లండన్‌లో ఉన్న కోహినూర్‌ వజ్రాన్ని రప్పించడానికి తీసుకోవలసిన చర్యల గురించి ప్రధానమంత్రి 2016లో ఉన్నతాధికారు లతో సమావేశం నిర్వహించారని వార్తలువచ్చాయి.

ఈ సమాచారం ప్రధాని కార్యాలయంలో ఉంటుంది కానీ పురావస్తు సర్వే సంస్థ దగ్గర ఉండదు.  ముందుగా ప్రధాని కార్యాల యాన్ని ఈ సమాచారం కోరితే, వాటిని రప్పించే అధికారం లేదని తెలిసి కూడా వారు ఈ దరఖాస్తును పురావస్తుశాఖకు బదిలీ చేయడం సమంజసం కాదు. హోం మంత్రిత్వ శాఖ లేదా విదేశాంగశాఖ ఈ విషయమై తీసుకున్న చర్యలు, వాటి ఫలితాల గురించి ప్రధాని కార్యాల యమే తెలపాలని కమిషన్‌ భావించింది. ఈ విధంగా దరఖాస్తులు బదిలీ చేసే ముందు కాస్త ఆలోచించాలి. (బీకేఎస్‌ఆర్‌ అయ్యంగార్‌ వర్సెస్‌ ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా కేసులో 2018 ఆగస్టు 20న సీసీఐ ఇచ్చిన ఆదేశం ఆధారంగా).

మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌
professorsridhar@gmail.com

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top