ఆంధ్రాబ్యాంక్‌ మటుమాయం!

Ayyagari Prasanna Kumar Writes Story Merge Of Andhra Bank With Union Bank - Sakshi

ఆంధ్రా బ్యాంక్‌ జాతీయ ఉద్యమంలో ఆవిర్భం చిన ఒక ముఖ్య ఘట్టం సహకార ఉద్యమం. 1904లో లార్డ్‌ కర్జన్‌ వైస్రాయ్‌గా ఉన్నప్పుడు మొదటి కోఆపరేటివ్‌ సొసైటీ యాక్ట్‌ అమలులోకి వచ్చింది. భారత జాతీయ కాంగ్రెస్‌ సహకార ఉద్యమానికి, వ్యవస్థకి ప్రోత్సాహం ఇచ్చింది. ఆ ఉద్యమంలో ఒక అంశం ప్రతి గ్రామంలో ఒక బ్యాంక్‌ని నెలకొల్పడం. బందరులో డాక్టర్‌ పట్టాభి సీతారామయ్య, కోపల్లె హనుమంతరావు, ముట్నూరి కృష్ణారావు అనేక సంస్థలని, సంస్కరణలను చేపట్టారు. 1915లో పట్టాభి సీతారామయ్య రూ. 50 వేలతో కృష్ణా జిల్లా కోఆపరేటివ్‌ బ్యాంక్‌ను స్థాపించారు. ఆ బ్యాంక్‌ కోపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌గా ఎదిగింది. పట్టాభిగారు 1919–1921లో ఆంధ్ర ప్రొవిన్షియల్‌ కోఆపరేటివ్‌ కాన్ఫరెన్స్‌కి అధ్యక్షులుగా పనిచేశారు.

ఆయన పొదుపు ఎలా చేయాలో, ప్రజలకు ధనసహాయం ఎలా చేయాలో నేర్పారు. మహాత్మా గాంధీ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినప్పుడు పట్టాభిగారిని ఉద్దేశించి ‘ధనం సద్వినియోగం చేయడంలో, పొదుపు చేయడంలో పట్టాభి ఒక మంచి కాంగ్రెస్‌ కార్యకర్త’ అన్నారు. 1923లో పట్టాభిగారు ఆంధ్రాబ్యాంక్‌ను స్థాపిం చారు. సామాన్య మానవునికి, రైతుకీ, చిన్న వ్యాపారికీ ధనం అందుబాటులో ఉంచడానికి వీలుగా ఈ వ్యవస్థని పెట్టి రెండు సంవత్సరాలలో 12 శాతం డివిడెండ్‌ ప్రకటించారు. ఆంధ్రా బ్యాంక్‌ను స్థాపించడం కూడా జాతీయ ఉద్యమంలో ఒక భాగం అన్నారు. 

బ్యాంక్‌ను స్థాపించడానికి లక్ష రూపాయలు సేకరించినప్పటికీ బ్రిటిష్‌ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం సులభం కాలేదు. ఇంపీరియల్‌ బ్యాంక్‌ బందరు మేనేజర్‌ గార్డన్‌ అడ్డుపెట్టగా, పట్టాభి గారు మద్రాస్‌ వెళ్లి ప్రాంతీయ మేనేజర్‌ ల్యాంబ్‌ను కలిసి పోరాటంలో విజయం సాధించారు. ఆంధ్రా బ్యాంక్‌ స్వాతంత్య్ర ఉద్యమంలో కట్టుబానిసత్వం నుంచి ఆర్థిక స్వాతంత్య్రానికి అద్దంపట్టిందన్నారు. ఆంధ్రా బ్యాంక్‌ జాతీయ ఖ్యాతి గడించడం ఒక ముఖ్య విషయం అని ఆయన గర్వపడ్డారు.

1969లో ప్రధాని ఇందిరా గాంధీ బ్యాంకులను జాతీయం చేసి, అందుకు కారణం పేద రైతుకి, శ్రామికుడికీ, కార్మికుడికీ ధనం అందుబాటులో ఉంచడమే అన్నారు. అప్పటి ఆంధ్రా బ్యాంక్‌ చైర్మన్‌ కె. గోపాల రావు దీటుగా 50 ఏళ్ల క్రితం మా ఆంధ్రా బ్యాంక్‌ వ్యవస్థాపకులు ముందుచూపుతో, ఆ లక్ష్యాలతోనే ఆంధ్రాబ్యాంక్‌ను స్థాపించార’ని అన్నారు. ఆంధ్రా బ్యాంక్‌ చరిత్ర జాతీయ ఉద్యమంలో భాగం. ఆంధ్రుల ఆత్మగౌరవానికి సేవాభావానికి చిహ్నం. పవిత్రమైన ఆశయాలతో స్థాపితమై క్రమంగా జాతీయ స్థాయికి ఎదిగిన ఆంధ్రా బ్యాంక్‌ పేరుని మార్చడం ఆంధ్రులకు అవమానం.

వ్యాసకర్త:  ప్రొ‘‘ అయ్యగారి ప్రసన్నకుమార్, విశాఖపట్నం

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top