ఎవరి గోష్టి వారిదే!

Akshara thuneekam by Sree ramana - Sakshi

అక్షర తూణీరం
రాహుల్‌ గాంధీ వయోలిన్‌ వాయిస్తూ మురిసిపోతు న్నారు. మధ్యలో జారిపోయిన కమాన్‌ని సోనియమ్మ తిరిగి దారిలో పెట్టి ఆనందబాష్పాలు విడుస్తున్నారు.

దేశంలో ఎవరికి తోచిన విధంగా వారు సందడి చేస్తున్నారు. ఎవరేమి చేసినా అందరి దృష్టి రానున్న ఎన్నికలమీదే. ఇదంతా ఒక వాద్య గోష్టిని తలపిస్తోంది. ఈ మహా బ్యాండ్‌లో ఎక్కడా శ్రుతి కలవదు. లయ నిలవదు. మన విద్వాంసులందరినీ ఇలా ఊహిస్తూ పోతే– ప్రధాని మోదీ గోష్ఠి పెద్ద కాబట్టి ఘటం వాయిస్తూ స్పష్టంగా వినిపిస్తున్నారు. తరచుగా తని ఆవృతంలో ఘన వాదనలో ఆయనకున్న నైపుణ్యాన్ని తిరగేసి, మరగేసి, ఎగరేసి వాయించి మరీ ప్రదర్శిస్తున్నారు. మోదీ ముక్తాయిం పులకి, తీర్మానాలకి జనం బెంబేలెత్తుతున్నారు. మూడేళ్లలో ఘటం బాగా నునుపు తేలింది. స్వరస్థానాల మీద మోదీకి పట్టు దొరికింది. అస్తమానం అరుణ్‌ జైట్లీ కంజరతో సహకరిస్తున్నారు. నాలిక తెగిపోతుందేమో అనేట్టు మోర్‌ సింగ్‌తో అనుసరిస్తున్నారు రాజ్‌నాథ్‌ సింగ్‌. శ్రుతి మీద ధ్యాస పెట్టి తాళం వేస్తున్నారు అమిత్‌ షా.

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ వయోలిన్‌ వాయించుకుంటూ తన వాదనకి తనే మురిసిపోతున్నారు. మధ్య మధ్య జారిపోయిన కమాన్‌కి సోనియమ్మ తిరిగి దారిలో పెట్టి ఆనందబాష్పాలు జారవిడుస్తున్నారు. కాస్త హిందూస్థానీ, కొంచెం ఇటాలియన్, మరికొంచెం అయోమయం కలిసి కొత్త ధ్వనులు వినవస్తున్నాయి. పాపం విద్వాంసుల పరంపర లోంచి వచ్చినా ఎందుకో కళ అబ్బలేదని కొందరు జాలి పడుతున్నారు. ఇక మిగిలిన పుంజీడు వామపక్షులు మూల పడేసిన తబలా ముక్కల్ని తలొకటి తీసుకుని గొడవ పడకుండా శక్తికొద్దీ చప్పుడు చేస్తున్నారు. కామ్రేడ్స్‌ మాత్రం వాళ్ల దెబ్బకే ఆకాశం ఎరుపెక్కిందని నమ్ముతూ, తన్మయ త్వంలో కాళ్లా చేతులా వాద్యగోష్ఠి సాగిస్తు న్నారు. ఇక అరుణోదయానికి ఆట్టే వ్యవధి లేదనే ప్రగాఢ నమ్మకంతో రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు.

ఇక తెలుగు రాష్ట్రాలకి వస్తే– కేసీఆర్‌ తలాడిస్తూ నాదస్వరం వినిపిస్తున్నారు. తరచూ దక్షిణాత్య సన్నాయి కర్రకి హిందూస్థానీ రాగాలు మప్పి లౌక్యం ప్రద ర్శిస్తున్నారు. డోలుతో కేటీఆర్‌ తండ్రికి సహకరిస్తున్నారు. సోలో వాదనకి చొరవ చేసి తరచూ బాదిపారేసి చప్పట్లు గెలుచుకుంటున్నారు. జనం భయపడి ఆ కర్ణక ఠోరాన్ని భరిస్తున్నారు. కోదండరామ్‌ నాగస్వరం అనే పాముబూరా ఊదుకుంటూ తిరుగుతున్నారు. ఆయన దగ్గర బుట్ట లేదు. బుట్టలో పాము లేదు. అయినా ఆ నాగస్వరం ఆగదు. లేని పాము పడగ విప్పదు. చంద్రబాబు ట్రంపెట్‌తో ప్రపం చాన్ని ఆకట్టే పనిలో ఉన్నారు. ఆ సొంత బాకాకి దాష్టీకం, బుకాయింపు తప్ప సంగ తులు లేవు. జగన్‌మోహన్‌రెడ్డి మ్యాజిక్‌ ఫ్లూట్‌తో జనాన్ని కూడగడుతున్నారు. ఉన్న ట్టుండి చేతులకి గజ్జెలు చుట్టుకుని, డోలక్‌ మీద సినిమా ట్యూన్‌లు వాయిస్తూ పవన్‌ కల్యాణ్‌ రంగప్రవేశం చేశారు. తీరా సమయం వచ్చినప్పుడు ఏఏ వాద్యాలు జట్టుకడితే గోష్టి జనప్రియం అవుతుందో చూడాలి.

(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
శ్రీరమణ

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top