కొండల్రావ్‌... ఆనప్పాదా?

Sree Ramana Remembering Kondal Rao - Sakshi

అక్షర తూణీరం

ఆయన పేరు చెప్పగానే తెలుగు మేస్టారు ఆయన మాటలు గుర్తొచ్చి నవ్వు తెప్పిస్తాయి. రావి కొండల్రావు బహుముఖ ప్రజ్ఞాశాలి. అన్నిటికీ మించి ప్రఖ్యాత నటి రాధాకుమారిని కట్టుకున్న భర్త. కొండల్రావు నాటక రచయిత, స్టేజ్‌ నించి వెండితెరకెక్కిన నటుడు, పత్రికా రచయిత, పత్రికా సంపాదకులు, దర్శకులు, ప్రయోక్త ఎందరో ప్రముఖులకు తలలో నాలుక, కళాప్రపూర్ణ బిరుదుని సార్థకం చేసుకున్న విలక్షణ వ్యక్తి మొన్న జూలై 28న 88వ ఏట కాలధర్మం చెందారు. కొండల్రావ్‌ శ్రీకాకుళం నించి వస్తూ వస్తూ తనకు చిన్నప్పుడు చదువు చెప్పిన తెలుగు మేస్టారిని భుజాల మీద ఎక్కించుకు వచ్చారు. మేస్టారి మేనరిజమ్స్‌ని రకరకాలుగా ప్రదర్శిస్తూ దర్శింపచేస్తూ తెలుగు మేస్టారిని మద్రాసు, ఆంధ్రా, రాష్ట్రాలలో ప్రాచుర్యం తెప్పించి, ఆ పాత్రని చిరంజీవిగా కొండల్రావ్‌ నిలబెట్టారు. ఇంతకుమించిన గొప్ప గురుదక్షిణ మరొకటి ఉండదు. నాలుగిళ్ళ సావిడి, కుక్కపిల్ల దొరికింది కొండల్రావుకి పేరు తెచ్చిన నాటకాలు.

తెలుగు మేష్టారు ఓ రోజు శిష్యుడి ఇంటిముందు ఆగారు. ఇంటిమీద ఆనప్పాదు ఆనూపంగా అల్లుకుని వుంది. తెరచాప చూసి ‘కొండల్రావ్‌..! ఆనప్పాదా?’ అని ప్రశ్నించారు. శిష్యుడు క్షణం తడబడకుండా ‘కాయట్లేదు మేష్టారూ’ అని వినయంగా స్పష్టంగా జవాబు యిచ్చాడు. దాంతో తెలుగు మేస్టారు తోక తొక్కిన త్రాచులా లేచారు. రాస్కెల్‌ నేనడిగిందేమిటి, నువ్‌ చెప్పేదేమిటి? కొండల్రావ్‌ ఆనప్పాదా అని అడిగినపుడు అది ఆనప్పాదైతే ఆనప్పాదని లేదూ బీరపాదైతే బీరపాదని, కాదూ చిక్కుడైతే చిక్కుడనీ లేదూ నాశార్థం పాదైతే నాశార్థం పాదు, నీ శార్ధం పాడైతే ఆ పాదూ అని చెప్పి అఘోరించాలి. కాయట్లేదు మేష్టారూ ఏమిట్రా బటాచోర్‌ ! ఏవిరా, నీ ఇంటికాయలు తినే ఇంతవాణ్ణి అయానా దొంగరాస్కెల్‌! అసలు నేనేమడిగాను, నువ్వేం చెప్పావ్‌! అయ్యారండి కొంచెం మీరు జడ్జిమెంటింగ్‌ ఉండాలి... వీడు నా క్లాసు మీటు (తెలుగు మేస్టారు ఇంగ్లిష్‌లో పరమపూర్, ఇంగ్లిష్‌ మీద చాపల్యం మెండ్‌. క్లాస్‌మీట్‌ అంటే స్టూడెంట్‌ అని భావించాలి) వీడిని కొండల్రావ్‌ ఆనప్పాదా అని అడిగినపుడు వాడేం చెప్పాలండీ... అని మేస్టారు మళ్ళీ మొత్తం లూప్‌ వేస్తారు. 

ఇలాగే మనిషి మనిషికీ చెప్పి వేష్టపడడంతో యీ ఫార్స్‌ వినోదాన్ని పంచుతుంది. విషాదం కూడా తొంగి చూస్తుంది. ఈ మహత్తర సన్నివేశాన్ని సంగీత కోవిదుడు ప్రతి సభలోనూ  ఎలాగ సరికొత్త సంగతులతో కొత్త మెరుపులు అద్దు తాడో.. రావి కూడా అలాగే మనోధర్మంతో పలుకులకి నగిషీలు చెక్కేవారు. ఈ సంకీర్తన గంటసేపు జనరంజకంగా నడిచేది. మన కథల మేష్టారు కాళీపట్నం రామారావు. రావి కొండల రావు ఒకే ప్రాంతం వారు. ఒకే బడి విద్యార్థులు కూడా ‘ఆ తెలుగు మేస్టారు నాకూ అయ్యవారే. కానీ కొండల్రావ్‌ భూత ద్దంలోంచి చూపిస్తూ వేదిక లెక్కించి హాస్యం జోడించి మేష్టా రుని నవ్వుతాలు చేశారు’ అని కాళీపట్నం ఒకసారి చాలా సౌమ్యంగా నవ్వుతూ వ్యాఖ్యానించారు. కళాకారుడు కళా ప్రపూర్ణుడు అయినవాడు అంతమాత్రం చనువు చొరవ తీసుకోవడంలో తప్పేముంది? గురుభక్తితోనే యింతటి అక్షరా  భిషేకం చేశాడని అనుకోవచ్చు. 1965లో ఆదుర్తి సుబ్బారావు అంతా కొత్తవారలే, కొత్త తారలే అంటూ తేనెమనసులు సినిమా తీశారు. హీరో కృష్ణ, రామ్మోహన్, సుకన్య, సంధ్యారాణి రావి కొండల్రావ్‌ ఆ వరదలో వచ్చినవారే! చందమామ ఆవరణలో రచన నించి నిర్మాణ నిర్వహణలు దాకా రక్తి కట్టించారు. 

డాల్టన్‌ ప్రెస్‌ నుంచి వచ్చిన ‘‘విజయచిత్ర’’ సినిమా పత్రిక ఎవర్‌ గ్రీన్‌ సినిమా మ్యాగజైన్‌. గాసిప్స్‌ గాలి కబుర్లు లేకుండా మల్టీకలర్‌లో చక్కని ఘుమఘుమలతో వచ్చేది. విజయచిత్రకి దాదాపు పాతికేళ్లు ఎడిటర్‌గా పనిచేసిన ఘనత కొండల్రావ్‌ది. బాపు రమణలు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి నడిపిన జ్యోతి మాసపత్రిక, సంపాదక వర్గంలో రావి వున్నారు. ‘సుకుమార్‌’ ఆయన కలం పేరు. బాపురమణ, వీఏకే, శ్రీశ్రీ, ఆరుద్ర, నండూరి ఇత్యాదులందరికీ సుకుమార్‌ చాలా ఆత్మీయులు. మద్రాస్‌ తెలుగు సాంస్కృతిక సంస్థలకు లోగోగా ఉండేవారు రావి కొండల్రావ్‌. అయన సినిమా కబుర్ల పుట్ట. కడదాకా ఆయన జ్ఞాపకశక్తి, నలుగురికీ చెప్పాలనే చాపల్యం సడలలేదు. కెరీర్‌లో లెక్కకి 500 సినిమాలలో కనిపించినా, ఒక పాతిక వేషాలు ఎన్నదగినవి. ఆయన రాసిన తెలుగు సినిమా చరిత్ర, నాగావళి నించి మంజీరా దాకా జ్ఞాపకాల కబుర్లు వాసి కెక్కాయి. అది మద్రాస్‌ ఎయిర్‌పోర్టు. అన్నగారు ఎదురుపడితే నమస్కరించారు కొండల్రావ్‌. ఆయన చిరునవ్వు నవ్వి ‘బ్రదర్‌! దుర్యోధనుడు లాంటి నెగెటివ్‌ క్యారెక్టర్‌కి ఎవరైనా శృంగార భరిత డ్యూయెట్‌ పెడతారా’ అని సూటిగా అడిగారు. వెంటనే తడుముకోకుండా ‘ఛీ.. ఛీ ఎవరూ పెట్టరండీ’ అన్నారు రావు  కరాఖండిగా. యన్టీఆర్‌ విశాలంగా నవ్వి ‘మేం పెట్టాం బ్రదర్‌.. వినండి’ అంటూ చేతిలో ఉన్న టేప్‌రికార్డర్‌ మీట నొక్కారు. ‘చిత్రం... విభళారే చిత్రం’ (పాట) ఇవ్వాళే రికార్డ్‌ చేశాం. మన రెడ్డిగారు రాశారంటూ వినిపించారు. కొండల్రావుకి మొహం ఎట్లా పెట్టాలో అర్థం కాలేదు. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఎన్నెన్నో చెబుతుండేవారు. అన్ని రంగాలలో సత్కీర్తి గడించిన కొండల్రావ్‌ ధన్యజీవి. ఆయనతో ఉన్న వేల వేల జ్ఞాపకాలకు అంజలి ఘటిస్తూ....
       

(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
శ్రీరమణ

 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top