జూన్‌ 12న జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం

GST Council to meet on June 12 - Sakshi

జీఎస్‌టీ కౌన్సిల్‌ 40వ సమావేశం ఈ జూన్‌12న జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో రాష్ట్ర ఆర్థిక మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం జరుగనుంది. దేశంలో కరోనా వైరస్‌ వ్యాపించిన తర్వాత జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం కానుండటం ఇదే తొలిసారి. పన్ను ఆదాయాలపై కోవిడ్‌-19 వ్యాధి ప్రభావం గురించి చర్చించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.  

ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్రాల ఆదాయాలపై కరోనా మహమ్మారి ప్రభావంతో పాటు ఆదాయాలన్ని పెంచుకునే మార్గాలపై కౌన్సిల్‌ చర్చించే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌ అనంతరం కేవలం నిత్యావసర వస్తువులకే కాకుండా అన్ని రకాల వస్తువులకు డిమాండ్‌ను పెంచి ప్రతి రంగంలో ఆర్థిక కార్యకలాపాలను మెరుగుపర్చాల్సిన అవసరమున్నదని కౌన్సిల్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా కేసుల కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించిన జీఎస్‌టీ ఆదాయ వసూళ్ల గణాంకాలను కేంద్రం విడుదల చేయలేదు. భారీగా పడిపోయిన  వసూళ్లు, రిటర్నులను దాఖలు చేయడానికి గడువు పొడగింపుతో కేంద్రం తీవ్రమైన కష్టాలను ఎదుర్కోంటుంది.   

జీఎస్‌టీ కౌన్సిల్‌ చివరి సమావేశం మార్చి 14న జరిగింది. కాంపెన్‌సన్‌ అవసరాలను తీర్చుకునేందుకు మార్కెట్ నుండి జీఎస్‌టీ కౌన్సిల్ రుణాలు తీసుకునేందుకు చట్టబద్ధతను కేంద్రం పరిశీలిస్తుందని సమావేశం సందర్భంగా ఆర్థికమంత్రి సీతారామన్‌ తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top