0.0 ఈ ప్ర‌పంచం మనుషుల కోస‌మే కాదు...

This world is not for men ... - Sakshi

లాఫింగ్‌ గ్యాస్‌

 ప్రదేశం: అమీర్‌పేట్, హైదరాబాద్‌దృశ్యం: ఒకాయన ఇరానీ చాయ్‌ తాగుతూ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నాడు...\ ‘‘హలో లింగమూర్తి, ఎలా ఉన్నావు? బాగానే ఉండి ఉంటావులే. అది సరేగానీ ఏమిటీ విశేషాలు? నా బొంద, విశేషాలేముంటాయి... రోజూ తినడం తొంగోవ్వడమే కదా నీ పని, అది సరే, హెల్త్‌ ఎలా ఉంది, నా బొంద,  అది ఎక్కడ బాగుంటుంది,  నీకు మందు సిగరెట్లు లేనిది గడవదాయే! పిల్లాడు బాగా చదువుతున్నాడా, నా బొంద, వాడెక్కడ చదువుతాడు...అన్నీ నీ పోలికలే వాడికి, పొట్ట చీల్చిన అక్షరం ముక్క కనిపించదు. అరే మరిచిపోయాను. మీ ఫ్రెండ్స్‌ ఎలా ఉన్నారు. నా బొంద,  మీదో తొక్కలో ఫ్రెండ్‌షిప్, ఎవడైనా ఆపదలో ఉంటే ఒక్కడూ కనిపించడు. మీ మామగారు ఎలా ఉన్నారు? దిట్టంగా ఉండి ఉంటాడులే. పనా పాటా! పొద్దున్నంత పేకాడడం, రాత్రయితే మందుకొట్టడమే కదా ఆయన పని...’’ కొద్దిసేపటి తరువాత... ‘ఠాప్‌’ అని పెద్దగా సౌండ్‌ వినిపించింది. సెల్‌ఫోన్‌ గాల్లోకి ఎగిరిపోయింది! ప్రదేశం: ఏలూరు రోడ్, విజయవాడ దృశ్యం: ఒక సెలూన్‌లో గెడ్డం చేయించుకుంటున్న నాగభూషణం సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నాడు... ‘‘మనకు కొన్ని అలవాట్లుంటాయి నాగేçశ్వర్రావు. అవి మంచివనుకో, చెడ్డ వనుకో. కానీ అలవాటు అలవాటే కదా. సెలూన్‌లో గెడ్డం గీసుకుంటున్నప్పుడు  సైలెంట్‌గా కూర్చోవాలి. నీకు తెలుసుకదా నాగేశ్వర్రావు... నేను సైలెంట్‌గా కూర్చోలేను. గెడ్డం చేయించుకుంటున్నప్పుడు కూడా సెల్‌ఫోన్‌లో  ఎవరో ఒకరితో మాట్లాడుతుంటాను. నీకు తెలుసు కదా నాగేశ్వర్రావు... మాట్లాడుతున్నప్పుడు రకరకాలుగా ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తుంటాను. బాడీని రకరకాలుగా కదిలిస్తుంటాను. అలా కదిలించినప్పుడల్లా ముఖం మీద కత్తిగాట్లు పడుతుంటాయి. సెలూన్‌ నుంచి నేను వెళ్లేది హాస్పిటల్‌కే. అయినా నేను ఈ పాడు అలవాటును మానుకోలేకపోతున్నాను నాగేశ్వర్రావు. చంద్రబింబంలాంటి ముఖం నీది  అనే వాళ్లు గర్ల్‌ఫ్రెండ్స్‌. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా నాగేస్వర్రావు... చంద్రబింబం మాటేమిటోగానీ ఇప్పుడు నా ముఖం మీద కత్తి గాటు లేని ఏరియా లేదంటే నమ్ము...’’ కొద్ది సేపటి తరువాత... ‘ఠాప్‌’ అని సౌండ్‌ వినిపించింది. సెల్‌ఫోన్‌ గాల్లోకి ఎగిరిపోయింది! ప్రదేశం: నేషనల్‌ హైవే 18 (కర్నూల్‌–చిత్తూరు) దృశ్యం: ‘‘హలో ప్రసాదు. నేను డ్రైవింగ్‌లో ఉన్నాను. ఏమిటి విశేషాలు? ఆ... ఎప్పుడు? ఎలా? ఛాఛాఛా... డ్రైవ్‌ చేస్తూ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుంటే యాక్సిడెంట్‌ కాకుండా గాడిద గుడ్డవుతుందా! చేతులు కాలాక ఆయింట్‌మెంట్‌ రాసుకొని ఏంలాభం! అవును... అవును... నేనే డ్రైవింగ్‌ చేస్తున్నాను. హ్హా హ్హా హ్హా.... నాకేమవుతుంది. డ్రైవింగ్‌లో నేను చాలా స్ట్రాంగ్‌. సెల్‌ఫోన్‌ సెల్‌ఫోనే... డ్రైవింగ్‌ డ్రైవింగే! నాకేమీ కాదు ప్రసాదూ... నేను అనేది వేరే వాళ్ల గురించి. ఇంకేంటి విశేషాలు...’’ఠా....ప్‌ సెల్‌ఫోన్‌ మాయం!

స్థలం: హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ హాస్పిటల్‌లో ఆపరేషన్‌ థియేటర్‌.దృశ్యం: డాక్టర్‌ మాణిక్‌చంద్‌బాషా గుండె ఆపరేషన్‌ చేస్తూ ఫ్రెండ్‌తో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు...‘‘ఏరా పండు ఎలా ఉన్నావ్‌! ఇన్ని రోజుల తరువాత గుర్తొచ్చానా? అయినా మేమెందుకు గుర్తుంటాం లెండీ మీకు! ఒకప్పటి పండు కాదు కదా మీరు... ఆ గుండురావుగాడి చెల్లిని చేసుకున్న తరువాత మీలెవలే మారిపోయింది.మాలాంటి వాళ్లు మీ విలువైన కంటికి ఎలా కనబడతారు.సెలవా!!నాకు సెలవనేదే లేదు.పనే నాకు విశ్రాంతి. అంతెందుకు ఇప్పుడు కూడా నేను ఒకరికి గుండె ఆపరేషన్‌ చేస్తున్నాను. పనిలో పడి స్నేహాన్ని మరిచిపోయే క్యారెక్టర్‌ కాదు నాది. అందుకే గుండె ఆపరేషన్‌ చేస్తూ కూడా నీలాంటిమిత్రులతో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుంటాను.ఇలా చేయడం  వల్ల పని తాలూకు అలసట మన మీద ఉండదు.అదెలా? అంటావా.సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ స్పీడ్‌గా డ్రైవింగ్‌ చేయగా లేనిది, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ స్లోగా గుండె ఆపరేషన్‌ చేయలేమా! అలా ఎన్ని ఆపరేషన్‌లు చేశానో....’’కొద్దిసేపటి తరువాత...డాక్టర్‌ మాణిక్‌చంద్‌బాషా సెల్‌ఫోన్‌ ఎవరో లాగేసినట్టు మాయమైపోయింది.‘ఇచట’, ‘అచట’ అనే తేడా లేకుండా సెల్‌ఫోన్లు మాయమవుతున్నాయి. ఎవరికీ ఏమీ అర్థం కావడం లేదు.పోలీసులు రంగంలోకి దిగారు. వారితో పాటు సైంటిస్టులు కూడా దిగారు. రాజ్యాంగ సంక్షోభంలాగా సెల్‌ఫోన్‌ సంక్షోభం తలెత్తింది. కొనే వాళ్లు లేక సెల్‌ఫోన్‌ దుకాణాలు వెలవెలబోతున్నాయి. టవర్లు బేల ముఖం వేశాయి. సెల్‌ఫోన్‌ సంక్షోభంపై ఒక కమిటీ ఏర్పాటయింది. ఈ కమిటీ వాళ్లు రకరకాల కోణాల్లో సమస్యను విశ్లేషించారు. ఎన్నో పుస్తకాలు తిరగేశారు. అయినప్పటికీ సమస్యకు పరిష్కారం దొరకలేదు. సెల్‌ఫోన్‌ రహిత సమాజం ఏర్పడింది.
 
‘‘చాలా టఫ్‌ క్వశ్చన్‌ అడుగుతున్నాను విక్రమార్కా. సెల్‌ఫోన్‌ సంక్షోభం  ఎందుకు తలెత్తింది?’’ విక్రమార్కుడి కళ్లలోకి సూటిగా చూస్తూ అడిగాడు బేతాళుడు.అప్పుడు విక్రమార్కుడు ఇలా చెప్పాడు:‘‘బేతాళామనిషి తన సౌకర్యం, సుఖం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు. ఈ భూగ్రహం తనది మాత్రమే అనుకుంటున్నాడు. సెల్‌ఫోన్‌ టవర్ల  వల్ల పక్షుల జనాభా తగ్గిపోతుంది. ఎలక్ట్రోమాగ్నటిక్‌ రేడియేషన్‌  పక్షుల పాలిట యమపాశంగా తయారైంది. అందుకే మిగిలిన జీవరాసులతో కలిసి పక్షులు మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఎంతో శ్రమించి ‘ఎలిమినేట్‌–0.0’ అనే సరికొత్త పరికరాన్ని తయారుచేశాయి. ఇది పనిచేస్తున్నంత కాలం ఎక్కడి సెల్‌ఫోన్‌లు అక్కడ మాయమైపోతూనే ఉంటాయి.’’
– యాకుబ్‌ పాషా 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top