అజ్ఞాతవాసం: ఓసి మనసా... ఈమెక్కడుందో తెలుసా? | Where is Ayesha Jhulka? | Sakshi
Sakshi News home page

అజ్ఞాతవాసం: ఓసి మనసా... ఈమెక్కడుందో తెలుసా?

Jan 19 2014 3:37 AM | Updated on Apr 3 2019 6:23 PM

అజ్ఞాతవాసం: ఓసి మనసా... ఈమెక్కడుందో తెలుసా? - Sakshi

అజ్ఞాతవాసం: ఓసి మనసా... ఈమెక్కడుందో తెలుసా?

ప్రత్యక్షంగా కలిసినప్పటికన్నా... ఊహల్లో మరింత అందంగా, ఆహ్లాదంగా కనపడితే, ఆ అమ్మాయి... ప్రేమికుడి మనసుని ఎప్పటికీ వీడిపోదు.

ప్రత్యక్షంగా కలిసినప్పటికన్నా... ఊహల్లో మరింత అందంగా, ఆహ్లాదంగా కనపడితే,  ఆ అమ్మాయి... ప్రేమికుడి మనసుని ఎప్పటికీ వీడిపోదు. అంత గొప్పగా ఉండే ఊహాసుందరిని వర్ణించాలంటే వేయి పదాలు అక్కర్లేదు. ఆయేషా ఝల్కాని చూపిస్తే చాలు. ఎవరీ ఆయేషాఝుల్కా అనుకుంటున్నారా? అయితే నేటి సిద్ధార్థ సినిమా చూడాలి. ఆ సినిమాలో వనకన్యలా మెరిసి యువ ప్రేక్షకుల ఊహాలోకపు ద్వారాలు ‘తెర’పించిన అమ్మాయిని గుర్తు చేసుకోవాలి. ఓసి మనసా నీకు తెలుసా... అంటూ నాగార్జున  కలల్లో తేలిపోయేలా చేసిన  ఆయేషా... ఇప్పుడేం చేస్తోంది?  ‘పహలా నషా పహలా హువా’ అంటూ అమీర్‌ఖాన్‌ను ఊహాలోకంలో ఊరేగేలా చేసిన ఆయేషా... కహాహై ఆప్?
 
 కాశ్మీర్ యాపిల్స్‌కు ప్రసిద్ధి. అలాగే ప్రకృతి అందాలకూ. జన్మతః ఆ ప్రాంతానికే చెందిన ఆయేషాఝుల్కా స్వచ్ఛమైన ప్రకృతి సంపదలా ఉంటుంది. మమతాకులకర్ణి లాంటి మెరుపులు, మాధురీదీక్షిత్ లాంటి  సౌందర్యరాశులు తెరనేలుతున్న 1990 ప్రాంతంలో... ఆమె తనదైన ముద్రవేసింది.  అప్పట్లో బాలీవుడ్ హీరోయిన్స్‌ను టాలీవుడ్‌కి తేవడంలో ముందున్న హీరోగా పేరొందిన నాగార్జున సరసన ఛాన్స్ దక్కించుకుని నేటి సిద్ధార్థలో నటించింది. నాజూకు అందాలతో అలరించినా, నాగ్‌తో ఫ్రెంచ్‌కిస్‌ని సైతం పండించినా ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో తన వన్నెచిన్నెల్ని మరికొంత కాలం తెలుగు ప్రేక్షకులకు పంచలేకపోయింది. ఆ తర్వాత బాలీవుడ్‌కి పరిమితమైంది.
 
    
  సల్మాన్‌ఖాన్, గోవిందా, అక్షయ్‌కుమార్ వంటి టాప్‌స్టార్స్ అందరి సరసన చోటు దక్కించుకున్న ఆయేషా నటించిన ఖుర్బాన్, దలాల్, రంగ్, సూరజ్ వంటి చిత్రాలు హిట్స్‌గా నిలిచాయి. ఇవన్నీ ఒకెత్తయితే... అమీర్‌ఖాన్, పూజాబేడీ తదితరులతో కలిసి చేసిన జో జీతా వ హీ సికిందర్ సినిమాలో అంజలి పాత్ర ఒక్కటీ ఒకెత్తు. ఆ సినిమాలో.. టీనేజ్‌గాళ్‌గా చేసిన ఆయేషా... సన్నజాజి తీగలా, సంపంగి మొగ్గలా... లా...లా...లా... అంటూ కుర్రకారుకు  అందమైన ఊహలా ఒద్దికగా అమరిపోయింది. అక్కడి నుంచి కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా పలు రకాల పాత్రలు పోషించి మెప్పించింది. దశాబ్దం పాటు కళకళలాడిన ఆయేషా...కెరీర్ బాగా ఉండగానే... సినిమాలకు దశలవారీగా దూరమైంది. 2000 సంవత్సరం తర్వాత తెలుగులో ‘జై’ సినిమాలో చేసిన తల్లి క్యారెక్టర్‌లాగే హిందీలోనూ అరకొరగా కనిపించిన ఆమె...గత నాలుగేళ్లుగా సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఏమైంది?
 
    
 అక్షయ్‌కుమార్‌తో కొంతకాలం, అర్మాన్‌కొహ్లితో మరికొంతకాలం తెరబయట అనుబంధాన్ని కొనసాగించిన ఆయేషా... కన్‌స్ట్రక్షన్ టైకూన్‌గా పేరున్న సమీర్‌వషిని 2003 లో పెళ్లాడారు.  సినిమాలకు పూర్తిగా దూరమయ్యాక నలభెరైండేళ్ల వయసులో...ప్రస్తుతం రంగస్థలంపై అభినయాన్ని పండిస్తున్నారు. పురుష్, ప్రకృతి వంటి ‘ప్లే’లను నిర్మిస్తూ, నటిస్తూ ‘థియేటర్’పై తనదైన ముద్ర వేస్తున్నారు. అనంత పేరుతో ఒక ‘స్పా’ సైతం నిర్వహిస్తున్నారు.
 
 అందమైన ప్రయాణం...     
 తన బాలీవుడ్ జర్నీ ఓ అందమైన ప్రయాణమని పేర్కొంటారు టీనేజీ వయసులోనే సినిమారంగంలో కాలుపెట్టిన ఆయేషా. అప్పటికీ ఇప్పటికీ పరిశ్రమ చాలా మారిపోయిందంటున్నారు. తను నటిగా వెలుగుతూ ఉండగానే తప్పుకుందామనుకున్నానని, రిటైర్‌మెంట్ తర్వాత సినిమా ఆవల ప్రపంచాన్ని ఆనందిద్దామనేదే తన ఉద్దేశ్యమనీ అన్నారు. గత దశాబ్దకాలంగా తాను  చేసిన సినిమాలు... కేవలం స్నేహితులైన కొందరు సినీపెద్దలు అడిగితే కాదనలేక చేసినవి మాత్రమేనన్నారు. భర్తకు చెందిన నిర్మాణసంస్థ, యాడిషన్స్ పేరుతో తన స్వంత ఫ్యాషన్ డిజైనింగ్ లైన్, ఇటీవలే గోవాలో కొన్న బొటిక్ రిసార్ట్.. వీటన్నింటితో ఊపిరిసలపనంత బిజీ కావడంతో... తనకు సినిమాలను మిస్ అవుతున్నాననే ఫీలింగ్ లేదంటారు. పూజాబేడీ ఇల్లు తన సెలూన్‌కు ఎదురుగానే ఉందని ఆమెతో సహా అందరు సహనటులతో తన సంబంధాలు ఇంకా సజావుగా కొనసాగుతూనే ఉన్నాయన్నారు. సినిమా కెరీర్‌ను ప్లానింగ్ ప్రకారం నడిపించినట్టు కనిపించని ఆయేషా...  విభిన్నరంగాల్లో ఇప్పటికీ విజయవంతమైన వ్యక్తిగానే కొనసాగుతున్నారు. రంగుల లోకమే సర్వస్వం అనుకునే తారలకు ఆమె విభిన్నం.
  - ఎస్.సత్యబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement