చెవి కడుపునింపే పాట | vipranarayana film in Endukoyi thotamali song | Sakshi
Sakshi News home page

చెవి కడుపునింపే పాట

Jan 25 2015 1:10 AM | Updated on Sep 2 2017 8:12 PM

చెవి కడుపునింపే పాట

చెవి కడుపునింపే పాట

సినీసాహితీ జగత్తులో సముద్రమంత ముద్ర సముద్రాలది. ‘సాక్షి’ కోసం సముద్రాల గురించి ఆలోచిస్తుంటే నా గురించి చెప్పవూ అంది, విప్రనారాయణ చిత్రంలోని ‘ఎందుకోయి తోటమాలి’ పాట.

ఈవారం సముద్రాల పాట నాతో మాట్లాడుతుంది.
సినీసాహితీ జగత్తులో సముద్రమంత ముద్ర సముద్రాలది. ‘సాక్షి’ కోసం సముద్రాల గురించి ఆలోచిస్తుంటే నా గురించి చెప్పవూ అంది, విప్రనారాయణ చిత్రంలోని ‘ఎందుకోయి తోటమాలి’ పాట. ఇంకా ఏమందంటే- ‘‘నా వల్ల ఒక మహా సంగీత దర్శకునికి నామకరణం జరిగింది తెలుసా? సముద్రాల నన్ను మీ రసమయలోకంలోకి తీసుకొచ్చిన తర్వాత - ఒక బహుముఖీన ప్రజ్ఞావంతుడొచ్చి(శివశక్తిదత్తా)... స్వర ‘రసమ్రాట్’ రాజేశ్వర్‌రావును ఈ ‘ఎందుకోయి తోటమాలి’ని ఏ రాగంలో కట్టారు మాస్టారు మహత్తరంగ లోకోత్తరంగా ఉంది అంటే... ఏటవాలుగా నవ్వుతూ ‘కీరవాణి’ రాగం అన్నాడు. అంతే ఆ ప్రజ్ఞావంతుని పుత్రుని పేరు ‘కీరవాణి’ అయింది.
 
విప్రనారాయణ సినీరచన - సముద్రాల. దేవదేవి (భానుమతి) విప్రనారాయణ(ఏఎన్‌ఆర్) బ్రహ్మచారివ్రతాన్ని తపోభంగం చేయాలని తోటకు నీళ్లు చేదిపోస్తున్న తరుణంలో పారదర్శకమైన ధవళచేలాంచలాలతో పలుచని తెల్లని చీరకట్టి విరహస్త్రీమూర్తిమత్వం సాక్షాత్కరించేస్తూ పాట పాడాలి.అక్కడ సముద్రాల అర్ధనిమీలిత నేత్రాలతో నాకోసం అన్వేషిస్తుండగా ఏవేవో పదగుచ్చాలు ఏవేవో భావలావికలు తన ముందు దోబూచులాడుతుండగా ‘‘ఎందుకోయి సముద్రాల అంతులేని యాతన నన్ను చూడు పనికొస్తానేమో’’ అన్నాను. ఇంకేం నిమిషంలో వెయ్యోవంతు కాలంలో నా ‘నడుంపట్టి’ తన శ్వేతపత్రాంకంపైన కూచుండబెట్టి అద్భుత శబ్దాల, భావాల ఆభరణాలు నాకు అలంకరిస్తూ పోయారు.
 
అహర్నిశలూ భగవన్నామస్మరణంలో ఉన్న నటనలో అక్కినేని కళ్లు ఒక అలౌకికదివ్యానందంతో తేలిపోతుంటాయి. అతన్ని తన లౌకిక శరీరసోయగానందంలోకి రప్పించాలి. (‘ఇటు నుంచి గాకుంటే అటునుంచి నరుక్కురా’ గురజాడ అన్నట్టు). నిన్ను నిరంతరం ఏలుతున్నవాని సృష్టిలీలా విలాసమే నేను కూడా! ‘కన్నులారా కనరా’ అనే పదాలను కన్నార - కనరా అనడంలో తనివితీర చూసుకో ఈ తనుసౌందర్య ప్రకాశం చందమామ చిన్నబోయెంత గొప్పగా ఉంది. ఇది ఏ మరో సృష్టికర్త చేతిపనితనం కాదు. నువ్వు భజిస్తున్న శ్రీమన్నారాయణుడిదే సుమా - నాది కూడా.
 
అలా తన వేపు- తన తనువు వేపు మళ్లిస్తుంది. ఇక్కడ ‘ఎఎన్‌ఆర్’ తన కళ్లతో మెల్లగా ఆమె తనువుపై దాహార్తికి అంకురార్పణ జరిగినట్టు అద్భుత నటనా విశ్వరూపం చూపిస్తారు.
 ‘వన్నె - వన్నెచిన్నెలీనూ ఈ విలాసం’లో కూర్చిన బాణి ఆ వాక్యాన్ని నడిపించిన తీరు స్త్రీ శరీర ఎత్తొంపులను సూచించేలా ఒలికించింది సముద్రాల, పలికించింది రాజేశ్వర్‌రావు.
 
రెండో చరణంలో..
ఈ పూజా పునస్కారాలవల్ల ఎపుడో రాబోయే స్వర్గలోకంలో లభించబోయే విందులపైన ఆశ ఎందుకు. పక్కనున్న నీ ‘పొందు’ను ఆశించే చిన్నదాన్ని చూడవేం అనే భావాన్ని ‘పొందుగోరు చిన్నదాని పొందవేలా’ అన్న అందమైన పదపొందిక రసాన్నం వడ్డించిన విస్తరిలా పరిచి అటు విప్రనారాయణున్ని ఇటు సినీమా వీక్షించే ప్రేక్షకనారాయణుల్ని కూడా ఊరింపచేస్తుంది. సన్యాసిని ‘‘అందాల రాయా’’ అని సంబోధించడంతో పాటలోని లక్ష్యాన్ని క్లైమాక్స్‌కు తీసుకొస్తారు సముద్రాల.
 
అందాల రాయా - అందరారా/ ఆనందమిదియే అందుకోరా
 బిందుపూర్వక దకారాలలో చెవి కడుపునింపే విందు ఉందని అందాల తెలుగు పదసముద్రునికి తెలుసు కనుకే సన్నివేశాన్ని పరాకాష్టకి చేర్చాడు.కేవలం పదకొండు వాక్యాలతో నటీనటులను దర్శక, సంగీతదర్శకులను, ప్రేక్షకశ్రోతలను 1954లో కట్టి పడేస్తే ఇదిగో ఇప్పుడు 2015లో కూడా లేవలేకపోతున్నారు. మీ రసైక హృదయులు అశోక్‌తేజ అంటూ సముద్రాల గారి పాట రాగాల గాలిలో విలీనమైంది.
 - డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement