తమ్ముడూ... నీకు నడవడం నేర్పించాను... పొడవడం నేర్పించాను! | Vineet Kumar Best Villain | Sakshi
Sakshi News home page

తమ్ముడూ... నీకు నడవడం నేర్పించాను... పొడవడం నేర్పించాను!

Jan 23 2017 1:30 AM | Updated on Sep 4 2017 11:31 PM

తమ్ముడూ... నీకు నడవడం నేర్పించాను... పొడవడం నేర్పించాను!

తమ్ముడూ... నీకు నడవడం నేర్పించాను... పొడవడం నేర్పించాను!

‘బావూజీకీ ఏంతెలుసు?’అలా అంటారేమిటండీ బాబూ... విన్నా వినగలడు. ఎందుకొచ్చిన తలనొప్పి చెప్పండి..

ఉత్తమ విలన్‌
వినీత్‌ కుమార్‌


‘బావూజీకీ ఏంతెలుసు?’అలా అంటారేమిటండీ బాబూ... విన్నా వినగలడు. ఎందుకొచ్చిన తలనొప్పి చెప్పండి...అదిగో... ‘విక్రమార్కుడు’ సినిమా నుంచి మనల్ని ఉరిమురిమి చూస్తున్నాడు!బావూజీ... అలా చూడకండి..మీ గురించి చిన్న పరిచయం చేసుకుంటున్నామంతే...మన బావూజీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఎంత అంటే. ఇంత...‘నా రాజ్యం రామరాజ్యం.ఇక్కడ మర్డర్‌లుండవు. రేప్‌లు ఉండవు’అదేంటండీ... ఆయన మాట్లాడిందాట్లో తప్పేముంది?అలా అని బావూజీది ఆదర్శ రాజ్యం అనుకునేరు... పప్పులో నుంచి కాలు తీసి మిగతా వాక్యాలు కూడా వినండి...‘ఎవడైనా మాట వినకపోతే కదరా...మర్డర్‌ చేయాలి.ఎవరైనా రానంటే కదరా...రేప్‌ చేయాలి.ఎవడైనా ఇవ్వనంటే కదరా... మర్డర్‌ చేయాలి. అవ్వేమీ లేవు. అందుకే ఊరంతా ప్రశాంతంగా ఉంది’

‘ప్రశాంతత’కు ఎంత చక్కని నిర్వచనం ఇచ్చాడో కదా ఈ విలనీయుడు! తన గురించి ప్రజల్లో ఉండే విశ్వాసం గురించి కూడా ఈ విలనీయుడికి వీరలెవెల్లో విశ్వాసం ఉంది.‘ఒక్కరు తెగించి ముందుకు వస్తే... ఈరోజు వీడి బతుకైపోతుంది. రండి’ జనాలతో అంటున్నాడు హీరో. ఈ మాటలు విన్న బావూజీ ఊరుకుంటాడా ఏమిటి?‘రండిరా రండిరా... క్యా రండిరా?’ అంటూ వెక్కిరిస్తూనే...‘వాళ్ల గుండెల్లో ఉండేది నెత్తురు కాదురా... ఈ బావూజీ ముద్రలు’ అనగలడు.ఎంత కాన్ఫిడెన్సో!ఏడి... కనిపించడం లేదే...అదిగో ‘రామ రామ క్రిష్ణ క్రిష్ణ’ సినిమాలో కళ్లద్దాలు, సూటుబూటుతో ‘పవర్‌’గా మన ముందుకు వస్తున్నాడుబావూజీ. చూడండి ఆ కళ్లలో బాధ. ‘విక్రమార్కుడు’లో కొడుకు పోయిన బాధను కళ్లల్లో ఎర్రటి జీరతో ఎంత శక్తిమంతంగా వ్యక్తీకరించాడో! ఇప్పుడు తమ్ముడు పోయిన బాధలో ఏమంటున్నాడో చూడండి...‘తమ్ముడూ...నీకు నడవడం నేర్పించాను.పొడవడం నేర్పించాను.చంపడం నేర్పించాను’ఇంతకీ ఎవరీ నేర్పరి?వినీత్‌కుమార్‌ సింగ్‌ అంటే చాలామందికి తెలియకపోవచ్చు.‘విక్రమార్కుడు... బావూజీ’ అంటే మాత్రం చాలామంది గుర్తు పడతారు. ∙∙l

వినీత్‌ కుమార్‌ స్వస్థలం పట్నా (బిహార్‌). బి.ఎన్‌. కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన వినీత్‌ పట్నా యూనివర్సిటీలో లా, సైకాలజీ పూర్తిచేశాడు. వినీత్‌కు చిన్నప్పటి నుండి ఒక అలవాటు ఉండేది. ఎవరైనా  మాట్లాడుకుంటుంటే వారి హావభావాలను గమనించడం. ఈ అలవాటే సైకాలజీలో పీజీ చేయడానికి ఉపకరించడమే కాదు... తన నటనకు అవసరమైన సరంజామాను అందించింది. అన్న ఐపీయస్‌కు సెలెక్ట్‌ కావడంతో వినీత్‌పై ఒత్తిడి పెరిగింది.

‘‘అన్నయ్యలాగే ఏదైనా మంచి ఉద్యోగం చెయ్‌’’ అని ఇంటా బయట సలహాలు. అయితే... వినీత్‌ మనసంతా నటనపై ఉంది. తండ్రిని తృప్తి పరచడానికి లా కాలేజీలో చేరాడు. ఆ సమయంలో బోలెడు తీరిక దొరకడంతో నాటకాలపై దృష్టి పెట్టాడు. ఇండియన్‌ పీపుల్స్‌ థియేటర్‌ అసోసియేషన్, పట్నా విభాగంలో చేరాడు. ఆ తరువాత ఢిల్లీకి వెళ్లి ‘నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా’(ఎన్‌ఎస్‌డీ)లో చేరాడు. అక్కడ ఎందరో గొప్ప నటుల పరిచయం అయింది. నటనలో మరిన్ని మెలకువలు తెలుసుకునే అవకాశం ఏర్పడింది.

‘ద్రోహ్‌కాల్‌’ ‘శూల్‌’ ‘యే దిల్‌’ ‘మంజ్‌నాథ్‌’ ‘గాడ్‌మదర్‌’ ‘దౌడ్‌’ ‘మసాన్‌’... మొదలైన బాలీవుడ్‌ సినిమాలతో వినీత్‌ కుమార్‌ గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఫ్లై అవే సోలో’ ‘భోపాల్‌: ఏ ప్రేయర్‌ ఫర్‌ రెయిన్‌’ ‘రిటర్న్‌ టూ రాజాపూర్‌’ ‘స్ట్రింగ్స్‌’ ‘ఎలక్ట్రిక్‌ మూన్‌’... ఇంగ్లీష్‌ సినిమాల్లోనూ నటించాడు. ఇక తెలుగు విషయానికి వస్తే ‘విక్రమార్కుడు’లో బావూజీ పాత్ర ఆయనకు విలన్‌గా ఎంతో పేరు తీసుకువచ్చింది. ‘కందిరీగ’ ‘నాయక్‌’ ‘ఆగడు’ ‘సుప్రీం’ ‘శివం’ ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
‘పవర్‌ ఆఫ్‌ ఇమాజీనేషన్‌’ అనేది నటుడికి ముఖ్యం అని నమ్ముతాడు వినీత్‌. దీనికోసం ఫిక్షన్‌ చదవాలని కూడా చెబుతాడు.
 ఈ కసరత్తులే వినీత్‌ కుమార్‌ను వెండి తెర ‘ఉత్తమ విలన్‌’గా తీర్చిదిద్దాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement