వంశీ ఇళయరాజా

వంశీ ఇళయరాజా


కవర్ స్టోరీ

సంగీత దర్శకుడిగా ఇళయరాజా 1000 సినిమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనతో తన అనుబంధం గురించి దర్శకుడు వంశీ రాసిన మ్యూజికల్ ట్రావెలాగ్26 డిసెంబర్, సాయంత్రం ఆరు.

ఆ రోజు రాత్రి 8.30కి లాండయ్యే బాంబే ఫ్లైట్‌లో ప్రొడ్యూసర్ శ్రీరామ్‌రెడ్డి దిగుతున్నారు.

రేపొద్దుట మ్యూజిక్ డెరైక్టర్ ఇళయరాజాగార్ని కలవడానికి చెన్నై బయల్దేరుతున్నాం.
ఇళయరాజా, బాపూ, భారతీరాజా, విశ్వనాథ్, బాలచందర్, పుట్టణ్ణకణగాళ్ వీళ్ళంతా చాలా గొప్పవాళ్ళు నాకు. నేను డెరైక్టర్ కావడానికి కారకులు, నా గురువులు. అలాంటి వారిలో ఒకరైన ఇళయరాజాని రేపు కలవబోతున్నాను అన్న ఆలోచన నా మనసులో మార్గ హిందోళమంత మధురంగా పలికింది. మద్రాసులో ఉండేప్పుడు ఇళయరాజా క్లోజ్డ్ గ్రూపులో నేనూ ఒకడ్ని. స్నేహితుడు అనే వాడు లేని నేను పని లేక పోతే ఆయన దగ్గర కెళ్ళిపోయేవాడ్ని. బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం ఆయన్తోపాటే. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ ఇలా ఎన్నెన్నో భాషలు ఏవేవో సినిమాలకి ఆయన మ్యూజిక్ చేస్తా ఉంటుంటే నేను అక్కడే ఉండేవాడ్ని. అలాంటి నేను ఈ హైదరాబాదొచ్చేసి పద్నాలుగో ఏడు పూర్తి కావస్తుంది. నిర్మాత అడ్వాన్స్ ఇచ్చాకా మరి మ్యూజిక్ కంపోజ్ చేద్దామా అని రాజాగారంటే? కథ ఎప్పుడూ అడగడాయన. సాంగ్ సిట్యుయేషన్స్ ఏంటి అంటే...

‘‘కాదులే ఈసారి కథ చెపుదాం’’ అనుకుని కన్సివ్ చేసిన కథని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. కానీ అది నా వల్ల కాదు. ఎవరికన్నా చెప్పాలి తప్ప, టోటల్‌గా గుర్తు చేసుకోలేను. షూటింగప్పుడు కూడా అంతే.

 అయితే.... ఎవరికన్నా చెప్పడం ద్వారా మొత్తం వెర్షన్ రీ కలెక్ట్ చేసుకున్న వాడ్నవుతాను.

 ఆ ఆలోచనతోనే ఫైట్ మాస్టర్ని పిలిచి కథని స్థాలీ పులాక న్యాయంగా చెప్పాక... ఆ రాత్రి పడుకుందామంటే నిద్రపట్టలేదు. రాజా గారు గుర్తొస్తున్నారు. ఆయన్ని తొలిసారి ఎప్పుడు కలిశానా అని గుర్తు చేసుకుంటున్నాను. మిడ్‌లాండ్ థియేటర్‌లో ‘పదునారు వయదినిలే’ చూశాను. ఆ సినిమాకి దర్శకుడు భారతీరాజా. ఆయనకదే ఫస్ట్ పిక్చర్. ఏడిద నాగేశ్వరరావు గారితో ‘‘సినిమా చేస్తే అలాంటి డెరైక్టర్‌తో చెయ్యాలి’’ అనేవాడ్ని.

 ఒక రోజు తుపాన్ కుంభవృష్టి. మద్రాసు మోకాలు లోతు నీళ్ళల్లో మునిగిపోయింది. ఇద్దరం కలసి ఎల్లయమ్మనే కాలనీలో భారతీరాజా ఆఫీసుకెళ్ళాం. వెళ్లేసరికి అక్కడ ఎవరూ లేరు, ఒక్క ఆఫీస్ బాయ్ తప్ప. అతను మా ముందు నోట్ బుక్ పెట్టి ‘‘మీ పేరూ, అడ్రసూ ఇందులో రాయండి. సారొచ్చాకా చూపిస్తాను’’ అన్నాడు.ఏడిద నాగేశ్వరరావు గారు పేరూ, అడ్రసూ రాయబోయి షాకై చూస్తూ ఉండిపోయారు. అప్పటికే మూడొందలమంది నిర్మాతలు తమ పేర్లు రాసి వెళ్ళారు. ఆయన ప్రసాద్ స్టూడియోలో ఉన్నారంటే బయల్దేరాం. అక్కడ దీపావళికి రిలీజ్ కాబోయే సినిమా తాలూకు వర్క్ జరుగుతోంది. ఇద్దరు వ్యక్తులు పనిలో ఉన్నారు. ఒక వ్యక్తి బెల్ బాటమ్ ప్యాంట్, షర్ట్ టక్ చేసుకుని, హిప్పీ కటింగ్‌లో ఉన్నాడు. ఆ వ్యక్తే ఇళయరాజా. అదే ఇళయరాజా గారిని

 

మొదటిసారి చూడటం. ఆరింటికి అలారం.

 ప్రొడక్షన్ ఆఫీసునించొచ్చిన కారులో బయల్దేరి ఆఫీసుకెళ్ళేటప్పటికే నిర్మాత ఎవరో బాంబే పార్టీతో హిందీలో మాట్లాడుకుంటున్నారు. నిన్న రిలీజైన ‘‘వంశీకి నచ్చిన కథలు 2వ భాగం’’ పుస్తకం, మొన్న టెస్ట్ చేసిన హీరో హీరోయిన్ల స్టిల్సూ ఇచ్చాను. ఈ సినిమాకి నేను పెట్టిన పేరు చెప్పాను నిర్మాత గారికి.

 ఇండిగో ఫ్లైట్ 8.55 కంట. టైమవ్వడంతో బయల్దేరాం.

 ‘‘హీరోయిన్ బావుంది, టైటిల్ చాలా బావుంది’’ అన్నాడు నిర్మాత. గుడ్‌న్యూస్ చెబుదామని హీరోయిన్‌కి ఫోన్ చేశాను. లిఫ్ట్ చెయ్యలేదు. ఇళయరాజా గారికి చేశాను.

 

‘‘వచ్చేవా’’ అన్నారు.

 ‘‘హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నా’’ అన్నాను.

 ‘‘మరిరా’’ అన్నారు.

 ఫ్లైట్‌లో పల్చగా ఉన్నారు జనం. చలి కేన్సర్‌లా కొరికేస్తోంది. అదేంటో ఇవాళ విమానం నిండా ముసలి తమిలాళ్ళున్నట్టనిపించింది. గంట తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండయింది విమానం. ఆకాశం అంతా మబ్బులు పట్టడంతో పగలే చీకటిగా ఉంది. చెన్నై అలాగుండటం చాలా బాగుంది నాకు. క్యాబ్ డ్రైవర్‌కి  ప్రసాద్ స్టూడియో టోపోగ్రఫీ చెప్పి సీట్లలో సర్దుక్కూర్చున్నాం. చాన్నాళ్ల తర్వాత సాలిగ్రామంలో ఉన్న ప్రసాద్ స్టూడియోలోకెళ్తున్నా.సితార సాంగ్స్ ఎడిటింగ్ ఇంకా జరగలేదు. టాకీ ఎడిటింగ్ అయితే, ఏడిద నాగేశ్వరరావు గారు ప్రొజెక్షన్ వేయమంటే సురేష్ మహల్‌లో వేశారు. సినిమా చూసి డల్ అయిపోయారు. శంకరాభరణం, సాగర సంగమం, సీతాకోక చిలుకలాంటి సూపర్ హిట్స్ తీసిన నా కంపెనీలో సినిమాని ఈ కుర్రోడు నాశనం చేసేసేడు, ఎంత తప్పు చేశాను అని తెగ డీలా పడిపోయారు.

 

ఇక నేను ఎవరి దగ్గరైనా అసిస్టెంట్‌గా చేసుకుని బతకాల్సిందేనని ఒక విధమైన డిప్రెషన్‌లో ఉండిపోయాను. ఆవేళ... రీ రికార్డింగ్ చెయ్యటానికి ప్రొజెక్షన్ వేయమన్నారు ఇళయరాజా, నేను, ఏడిద నాగేశ్వరరావు వెళ్ళాము. వైట్ అంబాసిడర్‌లో (కారు నంబర్ 3335 అనుకుంటాను) దిగిన ఇళయరాజా థియేటర్‌లోకెళ్లారు. నేను వెనుక ఓ మూల కూర్చున్నాను. సినిమా ప్రొజెక్షన్ స్టార్ట్ అయ్యింది. టెన్షన్ మొదలైంది. ఇంటర్వెల్ అయ్యింది. లైట్ వేశారు. ఆ వెలుగుకి ఇబ్బందిగా అనిపించింది. బాయ్ కాఫీ తెచ్చాడు. తాగి ఏం మాట్లాడకుండా మళ్ళీ సినిమా చూడటం మొదలుపెట్టారు రాజా. సినిమా పూర్తయ్యింది. చూశాక సంతృప్తిగా ఫీలయ్యి నావైపు చూసి పిలిచారు. అద్భుతంగా ఉంది, నేను రీ రికార్డింగ్ చెయ్యటానికి గొప్ప అవకాశం ఉంది అని అభినందిస్తుంటే ఏడిద నాగేశ్వర్రావుగారు షాకై చూస్తూ ఉండిపోయారు.అమితాబ్ బచ్చన్, తమిళ్ హీరో ధనుష్ యాక్ట్ చేసిన హిందీ సినిమా షమితాబ్. ఆర్.బాల్కీ డెరైక్టర్. దానికి రీ రికార్డింగ్ చేస్తున్నారు ఇళయరాజా. నన్ను చూసిన రాజా  ‘‘దీని పేచ్ వర్క్ ఒక అరగంటలో అయిపోతుంది’’ అంటా అప్పుడే పరిచయం చేసిన నిర్మాత రెడ్డి గార్ని కూర్చోమన్నారు. బ్రేక్‌లో శ్రీరామ్‌రెడ్డి గారిచ్చిన అడ్వాన్స్ తీసుకున్న ఇళయరాజా నన్ను చూపించి ‘‘వీడిదీ నాదీ చాలా హిట్ కాంబినేషన్, ఈసారి కూడా హిట్ ఆల్బమ్ ఇవ్వాలి’’ అన్నారు.త్వరలో కంపోజింగ్... ఆలోచిస్తున్నాను... హేమ అనే అమ్మాయి పక్షుల అరుపులలో సంగీత స్వరాల్ని వెతకడానికి అడివిలో తిరుగుతుంది అని పాట సందర్భం చెబితే ఎక్స్‌పెర్‌మెంటల్ సాంగ్ చేశారు. మాటి మాటికీ ఆగిపోయే డొక్కు కారు హీరో బాలరాజు, హీరోయిన్ పామర్తి కృష్ణకుమారితో కలసి ముఖ్యమైన పనిమీదెళ్తున్నప్పుడు అమాంతంగా ఆగిపోడంతో పాత సామాన్లోడొచ్చేడు అంటే చల్తీకా నామ్ గాడీ రికార్డ్ చేసిచ్చారు.

 ఈసారి మరి ఎలాంటి సిట్యుయేషన్స్ చెబుదాం అనుకుంటా ఇంత కాలం చేసుకున్న స్కీములు గుర్తు చేసుకోడం మొదలెట్టి ఆయన దగ్గర కెళ్తే ‘‘రేపట్నుంచి పునీత్ రాజ్‌కుమార్ కన్నడం సినిమా రీరికార్డింగుంది, అదయ్యాకా కంపోజింగ్‌కి కూర్చుందాం మనం’’ అన్నారు. దాంతో వెనకొచ్చేస్తున్న నన్ను ఆనాటి ఆకుపచ్చని జ్ఞాపకాలు ముసురుకుంటున్నాయి.

 సితార రిలీజ్ అయ్యింది. అవతల జంధ్యాల ‘ఆనందభైరవి’ రిలీజయి హిట్ టాక్ వచ్చింది. సితార మెల్లగా పిక్‌అప్ అయ్యి హిట్ అయ్యింది. ఆనందభైరవికి అన్నీ స్టేట్ అవార్డ్స్ వచ్చాయి. సితారకి ఒక్క అవార్డూ రాలేదు.

 ఏడిద నాగేశ్వర్రావుగారు ఫీలయ్యారు. నేషనల్ అవార్డ్స్ కోసం పంపించాము. మూడు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ ఫిమేల్ సింగర్, బెస్ట్ రీజనల్ మూవీ.

 

తర్వాత అన్వేషణ స్క్రిప్ట్ పని మొదలయ్యింది. అరకు ఫారెస్ట్ గెస్ట్‌హౌస్‌లో ప్రొడ్యూసర్స్ పేకాడుతూ కూర్చుంటే నేను ఓ గదిలో స్క్రిప్ట్ రాస్తూ కూర్చున్నాను. రెండు వారాల్లో స్క్రిప్ట్ అయిపోయింది. గ్రీన్ ఫైల్‌లో ఫైల్ చేసుకుని వచ్చేశాను.

 నేను, ఇళయరాజా మ్యూజిక్ సిటింగ్స్ కోసం మదురై వెళ్ళాము. టూరిజం డిపార్ట్‌మెంట్ హోటల్ తమిళనాడులో దిగాం. ఇళయరాజా క్వీన్ సూట్‌లో, నేను ఏసీ రూమ్‌లో.

 

పొద్దున్నే ఇళయరాజా మేనేజర్ కళ్యాణం వచ్చి, ‘‘ఏంటీ ఇంకా రెడీ కాలేదు. రాజా గారు రెడీ అయిపోయి హార్మోనియం ముందు కూర్చున్నారు’’ అని కంగారు పెట్టాడు. లేచి స్నానం చేసి రెడీ అయ్యి గ్రీన్ ఫైల్ తీసుకుని ఓపెన్ చేసి షాక్ అయ్యాను. అది ఫారెస్ట్ గెస్ట్ హౌస్ తాలూకు వాళ్ళ ప్రోగ్రామ్ ఫైల్. స్క్రిప్ట్ ఉన్న గ్రీన్ ఫైల్ అక్కడే మరిచిపోయాను.

 ఒకటే టెన్షన్. అంతా గజిబిజిగా ఉంది. అలాగే వెళ్ళి ఇళయరాజా ముందు కూర్చుని ఏదో వాగేసాను. అద్భుతమైన ట్యూన్స్ చేశారు.

 

చక్రి చనిపోయాడు సడన్‌గా. చాలా సన్నిహితుడు వాడు. ఆ రోజు వాడి దిన కార్యానికెళ్తుంటే ‘‘ఇళయరాజా గారి చిన్నబ్బాయి మతం మార్చుకోడమే గాకుండా మూడో పెళ్ళి చేసుకున్నాడంట’’ అన్నారెవరో.

 ‘‘ఐతే... ఇంతట్లో ఆయన్నించి నాకు పిలుపు రాదు’’ అనుకున్నాను. అనుకున్నట్టే కొన్నాళ్ళు గడిచాయి.

 ఎమ్మెస్ నారాయణ పోయారు. మంచి నటుడు, రచయిత. అంతకన్న మంచి వ్యక్తి. సరిగ్గా అదే రోజు రమ్మని రాజా దగ్గర్నుంచి కబురు. మద్రాసుకి ముప్ఫై ఆరు వేలంట ఫ్లైట్ టికెట్. ఇవ్వాళా రేపు వదిలేసి ఎల్లుండి వస్తానని చెప్పండి మీ రాజా గారికి అన్నాడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

 

రెండు రోజుల తర్వాత ఆ తెల్లవారుఝామున బయల్దేరే ఎస్ జి 1003 స్పైస్‌జెట్‌లో బయల్దేరితే నటకిరీటి రాజేంద్రప్రసాద్ కలిశాడు. వాళ్ళబ్బాయి బాలాజీ పెళ్ళంట.

 మద్రాసులో దిగాకా తన కారెక్కించుకుని ప్రసాద్ స్టూడియోలో దింపాడు. లోపలికెళ్ళే సరికి నా కోసం వెయిట్ చేస్తున్నారాయన. టైమ్ చూస్తే ఉదయం ఏడున్నర.

 ప్రసాద్ స్టూడియో ఎదురుగుండా ఉన్న హోటలు దాని పేరు స్టూడియో 36. దాంట్లో దిగి మళ్ళీ స్నానం చేసి రాజాగారి దగ్గరకెళ్ళాను. టిఫిన్ చేస్తా నన్నూ చెయ్యమన్నారు. అదయ్యాకా ‘‘కథేంటి’’ అన్నారు. చెప్పాను.

 

‘‘చాలా బాగుంది. దీనికి మంచి పాటలు చేద్దాం. పాత తమిళ పాటలు మట్టుకు అడక్కు’’ అని కంపోజింగ్ మొదలెట్టి కొన్ని ట్యూన్లయ్యాకా ‘‘ఒక పెళ్ళి ఉంది చూసుకొస్తాను. మూడింటికి కూర్చుందాం నాతో పాటు నువ్వూ వస్తావా పెళ్ళికి?’’ అన్నారు. లంచ్‌కి తలపాకట్టి హోటల్ కెళ్దామని ముందే అనుకోవడం వల్ల రానంటే ఆయనెళ్ళిపోయారు.

 

 ప్రసాద్ స్టూడియోలో నడుస్తూ చుట్టూ చూస్తా ఆలోచిస్తున్నాను.

 ఆలాపన మ్యూజిక్ సిటింగ్స్ స్టార్టయ్యాయి. మదురైలో సేమ్ హోటల్లో దిగాము. ఐదింటికి లేచి, స్నానాలు చేసి రెడీ అయ్యాక ఇళయరాజా ఆ మదురై నగరంలో ఒక ప్లేస్‌కి తీసుకెళ్ళారు. అదొక పాత ఇల్లు. ఇంకా ఎవరూ నిద్రలేవలేదు. ఆ ఇంట్లో ఓ గదిలో ఒక వ్యక్తి ఫొటోకి హారతి ఇచ్చి మాకు చూపించాడు. కళ్ళకద్దుకున్నాము. అది రమణ మహర్షి చదువుకున్న గది.

 

అక్కడ్నుంచి వచ్చి మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేశాము. మధ్యలో ఒకసారి ఆపి ‘‘ఒక మనిషి చచ్చిపోవాలంటే ఎన్ని మాత్రలు వేసుకోవాలి’’ అని అడిగారు. నేను షాక్ అయ్యాను. ఎందుకలా అడిగారో ఇప్పటికీ అర్థం కాదు.

 మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతుండగా మధ్యలో ఇళయరాజా సొంతవూరైన పణ్ణయపురం వెళ్లాం. ఆ వూరు ఒక కొండని ఆన్చివుంది. కారు వెళుతుంటే ఇళయరాజాగార్ని చూసి ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు జనం. ఇక్కడ ఒక రైల్వేగేటు దగ్గర కారు ఆగింది. అప్పుడు నాకు ‘గాలి కొండపురం రైల్వేగేట్’ కథకి బీజం పడింది.

 ఊరికి వెళ్ళాం. అక్కడ ఓ మేడ ముందు కారు ఆగింది. ఆ ప్లేస్‌లో ఓ పూరి పాక ఉండేదనీ, ఆ ఇంట్లో మేము ఉండేవాళ్ళమనీ నేను మ్యూజిక్ డెరైక్టరయ్యాకా ఈ మేడ కట్టామనీ చెప్పారు రాజా. భోజనం తర్వాత ఏం చెయ్యాలో తొయ్యక ఆయన దగ్గరకెళ్ళాను. అప్పుడే భోజనం చేసి వేరుశెనగ పప్పు ఉండలు తింటున్నాడు. అలా తినడం ఆయనకి మొదట్నుంచీ అలవాటు. వెళ్ళి ఎదురుగా కూర్చుంటే ‘‘మూడింటికొస్తానన్నావ్ గదా?’’ అన్నాడు.

 ‘‘హోటల్ రూమ్‌లో ఏం చెయ్యాలో తోచలేదు’’ అన్నాను.

 ‘‘థియేటర్లో రికార్డింగ్ నడుస్తుంది మూడింటికే రా’’ అని థియేటర్లో కెళ్ళిపోయాడు. బయటికొచ్చి నడుస్తుంటే మళ్ళీ జ్ఞాపకాల వరద.

 ఉషాకిరణ్ మూవీస్ వాళ్ల ప్రొడక్షన్ నం.4కి మ్యూజిక్ డెరైక్టర్‌గా బాలసుబ్రహ్మణ్యంగారినీ, లేదా సత్యంగారినీ పెట్టుకోమని చెప్పారు. నేను ఇళయరాజాగారిని పెట్టాలంటున్నాను. మ్యూజిక్ కంపోజింగ్ కోసం డేట్స్ కూడా తీసుకున్నాను. తీరా ఇళయరాజా ఫైనలైజ్ అయ్యేసరికి డేట్స్ వేస్ట్ అయిపోయాయి. ఇన్‌చార్జ్ కళ్యాణంని సంప్రదిస్తే ‘‘చాలా బిజీగా ఉన్నారు. అస్సలు కుదరదు’’ అని చెప్పారు. మళ్లీ నన్ను చూసి ‘‘వన్ అవర్ మాత్రమే టైం ఉంది కలుస్తారా’’ అన్నారు. ‘‘ఆ వన్ అవర్ చాలు’’ అనుకున్నాను. నేను చెబుతున్నాను. ఆయన ట్యూన్స్ చేస్తున్నారు. 45 నిమిషాలలో సాంగ్స్ అన్నీ పూర్తయిపోయాయి.

 ‘‘గోపెమ్మ చేతిలో గోరుముద్ద’’, ‘‘వొయ్యారి గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మా కలవరం’’, ‘‘నిరంతరమూ వసంతములే, మందారముల మరందములే’’... వాటిలో ఈ పాటలు కూడా ఉన్నాయి.

 ‘‘ఈ శివరాత్రికి నన్ను బాలయోగి దర్శనానికి తీసుకెళ్తావా’’ అన్నారు.

 ‘‘అలాగే’’ అన్నాను. ఫస్ట్‌క్లాస్ ఏసీలో టికెట్స్ బుక్  చేశాను. రాజమండ్రి బయలుదేరాం.

 బాలయోగి దర్శనం కోసం పెద్దక్యూలో వేలల్లో జనం ఎదురు చూస్తున్నారు. ఇద్దరం క్యూలో నుంచున్నాం. ఆ క్యూ మధ్యలో రాళ్ళ గుట్టల పైనుంచి పెకైక్కి, కిందికి దిగుతోంది. తెల్లవారుఝాము వరకు ఆ కొండమీద వెయిట్ చేస్తూ కూర్చున్నాం. బాలయోగిని దర్శనం చేసుకున్నాక ఇళయరాజా సెలైంట్ అయిపోయారు.

 ఆ మౌనాన్ని బ్రేక్ చేశాయా అన్నట్టు, ఉషాకిరణ్ మూవీస్‌కి ఇళయరాజా చేసిన పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. ఆ సినిమా ‘ప్రేమించు పెళ్లాడు’. ఆయన చెప్పిన మూడు తర్వాత కంపోజింగ్ మొదలైంది.

 వెనకటి కొచ్చిన ఏదో దైవీగ రాగంలాంటి పాట ఒకటి చేశాడు. వెన్నెల్లో గోదారి అందం అని సితార సినిమాలో నేషనల్ అవార్డ్ వచ్చిన గౌరీ మనోహరి రాగంలో ఒక పాట. ఇలా కొన్ని రకాలు చేశాకా థియేటర్లో సాంగ్ రెడీ అయ్యిందని చెప్పడానికొచ్చాడు ఆయన పెద్ద కొడుకు కార్తీక్.

 ఆయన కూడా నేను వెళ్తే అదో వెస్ట్రన్ సాంగ్. చింతాద్రిపేట నించొచ్చిన ఒక ఆంగ్లో ఇండియన్ పాడ్తున్నాడు.

 దాని తర్వాత ఆడిటరొచ్చాడు. శ్రీరామ్ అనే ఒకాయన నైట్ మ్యూజిక్ ప్రోగ్రాం తెలంగాణ రాష్ట్రంలో అడగడానికొచ్చారు.

 సాయంత్రం మరో రెండు పాటలు చేశాకా ఈవాళ్టికింతే రేపు తొమ్మిదింటికన్నాడు. నిన్న రాత్రంతా నిద్ర లేక పోవడం వల్ల చాలా తొందరగా తిని పడుకుని పొద్దుటే ఆరింటికి నిద్ర లేచి వాకింగ్‌కని ఆర్కాట్‌రోడ్ ఎక్కి పోరూర్ వేపెళ్తుంటే మొత్తం అన్నీ మారిపోయాయి.

 భానుమతిగారి భరణీ స్టూడియో బోర్డు ఉంది. కుడి పక్క భరణీ హాస్పిటల్స్ ఎదురుగా తిరునల్ వేలికల్లు దోసె లేసే చిన్న హోటలొకటి ఇంకా ఉంది. ముందుకెళ్తే బాలూగారి కోదండపాణీ ఆడియో లేబ్ ఉండే స్థలంలో ఏవేవో బిల్డింగులు కట్టేశారు. కుడిపక్క శ్యామలా స్టూడియో ఉండే చోట పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్స్. అలా గోల్డెన్ స్టూడియో దాకా వెళ్ళాను. స్టూడియో ఫ్లోర్లు ఏవో గోడౌన్ల కింద మారాయి.

 ఒకప్పుడు మద్రాస్ రోడ్డులోని ఆర్కాట్ రోడ్‌లో ఉన్న గొప్ప గొప్ప స్టూడియోస్ సినిమా వాళ్లతో కళకళలాడుతూ ఉండేవి. విజయవాహిని, ఏవీయమ్, విక్రమ్, కర్పగం ఇలా ప్రతి స్టూడియోలోనూ పండుగ వాతావరణం ఉండేది. ఇప్పుడు ఆ స్టూడియోల ప్లేస్‌లో కాంప్లెక్స్‌లు, కళ్యాణ మండపాలు, ప్లాట్స్ కట్టేశారు. ‘మాసీ మాసం ఆనాలుం పొన్ను’ పాట శుద్ధ ధన్యాసి రాగం ఛాయల్లో చేసింది. అలాంటిదొక ట్యూన్ చెయ్యమంటే హార్మోనియం పెట్టి మెట్ల మీద రాజాగారి వేళ్ళు విహారం చేస్తున్నాయి. ఇంతలో మంజరి అనే సింగరొచ్చింది. వయసులో ఉన్న అమ్మాయి అందంతో పాటు యాక్టివ్‌గా ఉంది.

 నన్ను కాసేపు బయట కూర్చోమంటే రేపు పాటలు ఈ సింగర్‌తో పాడిస్తాడేమో అనుకుంటూ వెళ్ళి వెయిటింగ్ హాల్లో కూర్చుంటే కాకినాడనించి రామసీత ఫోను.

 నిన్నేదో టీవీ ప్రోగ్రాంలో బాలసుబ్రహ్మణ్యంగారన్నారంట. వెనకటికి ఇళయరాజా మ్యూజిక్‌లో ఒక పాట పాడాను. నన్ను చాలా హింసపెట్టి పాడించిన ఆ సిన్మా డెరైక్టర్ వంశీ చివరికి ఆ పాటని సినిమాలో వాడలేదు. చాలా గొప్ప పాటది. నీ లైఫ్‌లో పాడిన గొప్ప పాట ఇది అని ఇళయరాజా అన్నాడు. ఎప్పటికయినా వంశీ దాన్ని వాడితే బాగుండు అని. అది విని ఆశ్చర్యపోయాను. నిన్న వచ్చిన వెంటనే ఇదే మాటన్నారు ఇళయరాజా. అంటూ చివర్లో ‘‘ఆ పాట నా దగ్గర్లేదు నీ దగ్గరుంటే ఇయ్యి’’ అన్నారు. అదే విషయం బాలూగారూ అనడం... ఈ కో ఇన్సిడెన్స్ గురించి ఆలోచిస్తుంటే ఆ సింగర్ మంజరి వెళ్ళిపోవడం, నేను లోపలికెళ్ళడం జరిగాయి. కంపోజింగ్ మొదలైంది.

 రెండు మూడు ట్యూన్లయ్యాకా మహర్షి సినిమాకి మదురైలో నేను అబద్ధ సాహిత్యం రాస్తే ఆయన చేసిన ట్యూన్ సూపర్‌హిట్ సాంగ్ నాటి కాలం గుర్తుకొస్తుంది. ఒక రోజు... హిందూ పేపర్ పట్టుకుని ఇళయరాజా దగ్గరికి వెళ్లాను. ఆయన పాటకి బేక్‌గ్రౌండ్స్ రాసుకుంటున్నారు. పేపర్ చూపిస్తూ ‘‘ముమ్మిడివరం బాలయోగిగారు చనిపోయారు’’ అన్నాను. ఒక్కసారిగా తపస్సు భగ్నమైనట్టు నావైపు చూసి ‘‘బాలయోగిగారు చనిపోరు జీవించే ఉంటారు’’ అన్నారు.

 ‘‘లేదు చనిపోయారు... ఎప్పుడు చనిపోయారో తెలీదు, శవం బాగా కుళ్లిపోయిందట’’ అన్నాను. ఆ మాటతో బాగా డిస్టర్బ్ అయ్యారు. ఒక స్తబ్దతలో ఉండిపోయారు.

 ఆ మరుసటి రోజు బయలుదేరి, మ్యూజిక్ సిట్టింగ్స్ కోసమని పొల్లాచ్చీకి వచ్చాము.

 ఆ పొల్లాచ్చీలో పొల్లాచ్చీ తాత అనే అవధూత. ఆయన దర్శనం చేసుకుని, ఆయన కాళ్ళకి నమస్కరించారు ఇళయరాజా. తర్వాత మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేశారు. అక్కడనుంచి తిరుపణ్ణామలై వెళ్లాము. భగవాన్ రమణ మహర్షి సమాధిని దర్శనం చేసుకున్నాము.

 ఆశ్చర్యం... వాస్తు మహిమేమో తెలీదు. బయటంతా వుక్కపోతగా ఉంది. సమాధివున్న ఆ గదిలోకి అడుగు పెట్టేసరికి హిమాలయాల్లోకి అడుగు పెట్టినట్టు చల్లదనం. ప్రశాంతత ఆవరించింది.అక్కడినుండి మళ్లీ మ్యూజిక్ సిట్టింగ్స్.

 కాస్సేపాగుదాం అని లేచి బయట వెయిటింగ్ హాల్లోకెళ్తుంటే వెనక నేనూ వెళ్లాను.

 కొన్ని పర్సనల్ విషయాలడిగితే చెప్పాను.

 ‘‘నిజమా?’’ అన్నాడాయన షాకయ్యి. ఒట్టేసి చెప్పాను.

 థియేటర్‌లోంచొచ్చిన మనిషి ‘‘గిటారిస్ట్ స్టీవెన్స్ వచ్చాడు’’ అన్నాడు.

 ‘‘సరే నిన్నట్లా మూడింటికి కూర్చుందాం’’ అనాయనంటే లేచి హోటలు కొచ్చి మీటర్లో కొన్ని పల్లవులు రాశాను.

 మూడయ్యేటప్పటికి ఆయన కంపోజింగ్ రూమ్ కొచ్చాను.

 శ్రీరామ్ అనే ఆయన్తో ఉన్న రాజా నన్ను చూడగానే లోపలికి రమ్మని పిల్చి ఎలా మొదలెడదాం? అన్నారు. అయిదు పల్లవులు రాసిస్తాను. అబద్ధ సాహిత్యం. ఈ కొలతలకి రేపు లిరిక్ రైటర్ రాస్తాడు.

 కాయితం తీసుకుని ఒకో పల్లవినీ తమిళంలో రాసుకుని ట్యూన్ చెయ్యడం మొదలెట్టారు. కొత్త సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సిటింగ్స్ పూర్తి చేసుకుని, హైదరాబాద్‌కి వచ్చేసాను.

ఇళయరాజా వెయ్యి సినిమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టీవీ చానల్స్ వాళ్లూ, పత్రికల వాళ్లు స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తూ నన్ను కలిసారు. ఏదైనా మాట్లాడమనీ, రాయమనీ అడిగారు. ట్యూన్స్‌లోనూ, రిథమ్‌లోనూ, రీ రికార్డింగ్‌లోనూ తనదైన ప్రత్యేకమైన ముద్రని సృష్టించుకున్న మహానుభావుడు, ఎన్నో భాషలు తెలిసిన పండితుడు. ప్రపంచంలోనే గొప్ప కంపోజర్స్‌లో ఒకరు. ఆయన గురించి మాట్లాడాలంటే మాటలు చాలవు. రాయాలంటే భాష చాలదు. మౌనంగా ఇళయరాజాగారి పాటల్ని వింటే చాలు! అంతే...  

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top