సంతోషం ఎంతో... నేను బీటెక్ చదువుతున్నప్పుడు కాలేజ్ హాస్టల్‌లో ఉండేదాన్ని. మా వార్డెన్ చాలా మంచావిడ. ఆమె ఎన్నో విషయాలు మాతో పంచుకునేవారు. మేడమ్ పెళ్లి జరిగింది పెద్దల సమక్షంలో అయినా, నిజానికి వాళ్లది ప్రేమ వివాహం.
సంతోషం ఎంతో... నేను బీటెక్ చదువుతున్నప్పుడు కాలేజ్ హాస్టల్‌లో ఉండేదాన్ని. మా వార్డెన్ చాలా మంచావిడ. ఆమె ఎన్నో విషయాలు మాతో పంచుకునేవారు. మేడమ్ పెళ్లి జరిగింది పెద్దల సమక్షంలో అయినా, నిజానికి వాళ్లది ప్రేమ వివాహం. ఒకసారి మాటల్లో ‘ఇంతవరకూ మేము మా కుటుంబం అందరం కలిసి ఫొటోలు తీసుకోలేదు,’ అన్నారు. మేడమ్‌వాళ్ల భర్త సౌదీకి ఉద్యోగరీత్యా వెళ్లారు. బహుశా అందుకే కుదరకపోయి ఉండొచ్చు.
అయితే, అనుకోకుండా మేము అక్కడ ఉన్నప్పుడే ఆయన తిరిగొచ్చారు. ఒకరోజు హాస్టల్‌కి ఫ్యామిలీతో సహా వచ్చారు. అప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ తన ఆలోచనను నా ముందుంచింది. ఇంకేం, చకచకా ఫొటోలు తీశాం. ఆల్బమ్ అయితే సిద్ధం చేశాంగానీ, ఇవ్వటానికి తగిన సందర్భం కనిపించలేదు. ఒకరోజు మేడమ్ పెళ్లిరోజు అని తెలిసింది. ఇంకేం ఆల్బమ్‌నే కానుకగా ఇచ్చాం. అప్పుడు ఆమె ముఖంలో చూసిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఆ కంటతడే చెప్పింది, ఆమె ఎంత సంతోషపడిందో!
ఇంకొక విషయం. ఒకరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా స్నేహితులందరం రెస్టారెంట్‌కు వెళ్లాం. ఒకతను మాకు సర్వ్ చేశాడు. తిన్న తర్వాత టిప్ ఇస్తాం కదా, నేను ఇరవై రూపాయలిచ్చాను. మేం బయలుదేరుతుండగా, ఆ సర్వర్, ‘‘నేను ఈ రోజే పనిలో చేరాను. ఉదయం నుండి నాకు టిప్ ఇచ్చిన తొలి వ్యక్తి మీరే’’ అన్నాడు. నాకు తెలీకుండానే ఒకరి ఆనందానికి కారణం కావడం దాన్ని మరింత పెంచింది.
నేను ఏదో చేశానని అనుకోవటం లేదు. వేలు, వందలు కూడా ఖర్చు చేయలేదు. మనం ఇచ్చినది ఏదైనా అది మరొకరికి జీవితంలో మర్చిపోలేనిదిగా మిగిలితే, అంతకన్నా ఆనందం ఉంటుందా?
- పి.బి.ఆర్.
ఇది మీ కోసం పెట్టిన పేజీ. మీ అనుభవాలు, అనుభూతులు, ఆలోచింపజేసిన సంఘటనలు, మీ ఊరు విశేషాలు, మీ పిల్లల ముద్దుమాటలు, వారి అల్లరి చేష్టలు... అవీ ఇవీ అని లేదు, ఏవైనా మాకు రాసి పంపండి.
మా చిరునామా: తపాలా, ఫన్‌డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1,
రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com