రేపటి శాస్త్రవేత్తలు

Special Story About Future Scientists in Funday On 10/11/2019 - Sakshi

పిల్లలు చిచ్చర పిడుగులు. పిల్లలు ప్రశ్నల ఖజానాలు. పిల్లలు నిత్య జిజ్ఞాసులు. పిల్లలు రేపటి పౌరులు. కాస్త ప్రోత్సాహం ఉండాలే గాని, ఈ పిల్లలే రేపటి నాయకులు. ఈ పిల్లలే రేపటి శాస్త్రవేత్తలు కూడా...

ఇరవై ఒకటో శతాబ్దిలో ఉన్నాం మనం. ఈ శతాబ్దిలో ఇదివరకు ఎన్నడూ కనీ వినీ ఎరుగనంత శరవేగంగా శాస్త్ర సాంకేతిక రంగాలు పురోభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. అంతరిక్ష ప్రయోగాలు,  పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. వైద్య చికిత్సా రంగంలోనూ కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. మనుషుల పనులను మరింత తేలిక చేసే యంత్రాలు వస్తున్నాయి. మనుషులకు ప్రత్యామ్నాయం కాగల రోబోలు తయారవుతున్నాయి. సమాచార సాంకేతిక పరిజ్ఞానం ఫలితాలు మారుమూల ప్రాంతాలకూ చేరుతున్నాయి. స్మార్ట్‌ఫోన్లు అరచేతిలోనే ప్రపంచాన్ని చూపిస్తున్నాయి. ఈ సాంకేతిక శతాబ్దికి చెందిన పిల్లలు శాస్త్ర పరిజ్ఞానాన్ని అలవోకగా పుణికిపుచ్చుకుంటున్నారు. కొత్త కొత్త ప్రయోగాలతో, కొత్త కొత్త ఆవిష్కరణలతో తమ సత్తా చాటుకుంటున్నారు. నేడు వరల్డ్‌ సైన్స్‌ డే... ఇదేవారంలో నవంబరు 14 బాలల దినోత్సవం... ఈ సందర్భంగా అద్భుతాలు సాధిస్తున్న కొందరు బాల శాస్త్రవేత్తల విజయగాథలు మీ ముందు ఉంచుతున్నాం...

బాల శస్త్రకారుడు : ఆకృత్‌ జస్వాల్‌
ఆటలాడుకునే ఏడేళ్ల పసి వయసులోనే వైద్యుల సమక్షంలో విజయవంతంగా శస్త్రచికిత్స చేసి రికార్డులకెక్కిన చిచ్చరపిడుగు ఆకృత్‌ జస్వాల్‌. హిమాచల్‌ప్రదేశ్‌లోని నుర్‌పూర్‌లో పుట్టాడు. కాలిన గాయాలతో వేళ్లు అతుక్కుపోయిన ఒక ఎనిమిదేళ్ల బాలికకు అతడు ఎంతో నైపుణ్యంతో శస్త్రచికిత్స చేశాడు. పదినెలల వయసులోనే నడవడం, మాట్లాడటం నేర్చేసుకున్నాడు. అతడికి గల అసాధారణ జ్ఞాపకశక్తిని గమనించిన తండ్రి అతడిని ప్రోత్సహించాడు. ఆరేళ్ల వయసులో తండ్రితో ఆస్పత్రికి వెళ్లి కేన్సర్‌ రోగుల బాధలను కళ్లారా చూసిన ఆకృత్‌ చలించిపోయాడు.

అనాటమీ నుంచి అనెస్థీషియా వరకు వైద్య శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలను పసి వయసులోనే చదివేశాడు. పదిహేనేళ్ల వయసులోనే చండీగఢ్‌ వర్సిటీ నుంచి కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలలో మూడు డిగ్రీలను ఒకేసారి అందుకున్నాడు. పదిహేడేళ్ల వయసులో కాన్పూర్‌ ఐఐటీలో చేరి, కెమిస్ట్రీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. పదకొండేళ్ల వయసులో లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీ ఆహ్వానాన్ని అందుకుని, అక్కడి విద్యార్థులను ఉద్దేశించి శాస్త్ర విషయాలపై అద్భుతమైన ప్రసంగం చేసి, అక్కడి ప్రొఫెసర్ల ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం యువకుడైన ఆకృత్‌ జస్వాల్‌ ఏదో ఒకనాటికి కేన్సర్, ఎయిడ్స్‌ వ్యాధులను నయం చేయగల చికిత్స మార్గాలను కనుగొనడమే తన లక్ష్యమని చెబుతాడు.

బడి విడిచిన మేధావి : అంగద్‌ దార్యాని
ముంబైకి చెందిన అంగద్‌ దార్యానికి చిన్నప్పటి నుంచి ప్రయోగాలు చేయడం ఇష్టం. నిత్యం ప్రయోగాల్లోనే తలమునకలై ఉండేవాడు. ముంబైలోని మాతుంగా స్కూల్‌లో తొమ్మిదో తరగతిలో ఉండగా చదువు మానేశాడు. ఎనిమిదేళ్ల వయసులో సౌరశక్తితో పనిచేసే పడవను రూపొందించాడు. పదమూడేళ్ల వయసులో త్రీడీ ప్రింటర్‌ను తయారు చేశాడు. బడి మానేసి బయటకు వచ్చేశాక పదిహేనేళ్ల వయసులో అంధులకు ఉపయోగపడే ‘ఈ–రీడర్‌’ను రూపొందించాడు. స్వయంగా నేర్చుకున్న, స్వయంగా పరిశోధించి సాధించిన సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త కొత్త వస్తువులను రూపొందించే అంగద్‌ దార్యానీ ప్రస్తుతం నాలుగు కంపెనీలను సొంతంగా నిర్వహిస్తున్నాడు.

మధ్యలోనే బడి మానేసినంత మాత్రాన అతడికి చదువుల పట్ల అయిష్టమేమీ లేదు. తనకు గల విచిత్రమైన వ్యాపకాల వల్ల బడిలో కొనసాగలేకపోయానని చెబుతాడతను. అంగద్‌ సాంకేతిక ప్రతిభను గమనించిన అమెరికన్‌ విద్యాసంస్థలు అతడికి ప్రత్యేకంగా చోటు కల్పించాయి. అట్లాంటాలోని జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి బీఎస్సీ పూర్తి చేసిన అంగద్, ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్‌ మసాచుసెట్స్‌లో ఎలక్ట్రానిక్‌ ఇంజనీరింగ్, అప్లైడ్‌ మ్యాథమేటిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చదువుకుంటున్నాడు. దేశ విదేశాల్లో సత్తా చాటుకుంటున్న అంగద్‌ ప్రతిభా పాటవాలను భాతర ప్రభుత్వం కూడా గుర్తించింది. మానవ వనరుల మంత్రిత్వ శాఖ రెండేళ్ల కిందట అతడిని జాతీయ విద్యా విధాన సలహాదారుగా నియమించింది.

‘రోబో’ బుడతడు : సారంగ్‌ సుమేశ్‌
ఆటబొమ్మలను ముందేసుకుని ఆటలాడే ప్రాయంలో ఏకంగా రోబోను తయారు చేసి వార్తలకెక్కిన బుడతడు సారంగ్‌ సోమేశ్‌. కేరళలోని కొచ్చికి చెందిన సారంగ్‌ వయసు ఇప్పుడు పదేళ్లు. మూడేళ్ల వయసులో తండ్రి ఆడుకోవడానికి తెచ్చి ఇచ్చిన రోబోటిక్‌ కిట్‌తో సారంగ్‌ ఆటలు మాత్రమే కాదు, సొంతంగా ప్రయోగాలు మొదలు పెట్టాడు. ఏడాది తిరిగేలోగానే తొలి రోబో తయారు చేసి అతి పిన్న వయస్కుడైన రోబో రూపకర్తగా రికార్డు నెలకొల్పాడు. సారంగ్‌ ఇప్పటికే చాలా వస్తువులను రూపొందించాడు.

అంధులకు ఉపయోగపడే రోబో వాకింగ్‌ స్టిక్, ఇంటిని శుభ్రం చేసే క్లీనింగ్‌ రోబో, ప్రమాదాల్లో చేతులు పోగొట్టుకున్న వారి కోసం రోబోటిక్‌ హ్యాండ్, ప్రమాదాల నుంచి సురక్షితంగా కాపాడే స్మార్ట్‌ సీట్‌బెల్ట్‌ వంటి వస్తువులను తన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించాడు. కొచ్చిలో మూడేళ్ల కిందట జరిగిన ‘టెడ్‌ఎక్స్‌’ సదస్సులో సారంగ్‌ తాను రూపొందించిన వస్తువులు, వాటి పనితీరు, వాటి తయారీకి తాను ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం వివరిస్తూ చేసిన ప్రసంగానికి మేధావులు సైతం ఆశ్చర్యచకితులయ్యారు. తన తండ్రి ప్రోత్సాహంతోనే ప్రయోగాలు సాగించడం మొదలు పెట్టానని, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం అంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతాడు సారంగ్‌.

కాలుష్యంపై సాంకేతికాస్త్రం: సాహితి పింగళి
బెంగళూరుకు చెందిన తెలుగమ్మాయి సాహితి పింగళి కాలుష్యంపై సాంకేతికాస్త్రం సంధించి వార్తలకెక్కింది. ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు చదువుకుంటున్న సాహితి, బెంగళూరులో ఏడో తరగతి చదువుకుంటున్నప్పుడు స్కూలు నిర్వహించిన విహారయాత్రలో తోటి పిల్లలతో కలసి పాల్గొంది. నురుగుతో నిండి ఉన్న బెంగళూరు చెరువుల దుస్థితిని కళ్లారా గమనించింది. రసాయన వ్యర్థాల కారణంగా ఏర్పడిన నురుగు పొర కింద మండే స్వభావం గల మీథేన్‌ వాయువు ఆవరించి ఉందని, వీటిని ఇలాగే వదిలేస్తే మరో పాతికేళ్లకు బెంగళూరు నగరం నివాసయోగ్యం కాకుండాపోతుందని కలత చెందింది. పరిష్కారంగా ఏదైనా చేయాలనుకుని, తన వంతుగా ఒక యాప్‌ రూపొందించింది. ఈమె రూపొందించిన వాటర్‌ టెస్టింగ్‌ కిట్‌ ద్వారా ఇళ్లకు చేరువలోని చెరువుల్లో ఉన్న కాలుష్య పదార్థాల సమాచారం బ్లూటూత్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్లకు చేరుతుంది. సాహితి రూపొందించిన యాప్‌ దేశ విదేశాలకు పాకింది. పాలపుంతలో కనుగొన్న ఒక గ్రహానికి శాస్త్రవేత్తలు సాహితి పేరు పెట్టారంటే ఆమెకు ఏ స్థాయిలో గుర్తింపు లభించిందో అర్థం చేసుకోవచ్చు.

సత్య నాదెళ్లను మెప్పించిన నిపుణుడు: మేధాంశ్‌ మెహతా
ఆన్‌లైన్‌ గేమింగ్‌ నిపుణుడిగా పదకొండేళ్ల ముంబై బాలుడు మేధాంశ్‌ మెహతా అంతర్జాతీయ ఖ్యాతి సాధించాడు. మేధాంశ్‌ మేధా శక్తికి మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల అబ్బురపడ్డారంటే ఈ చిచ్చర పిడుగు ప్రతిభా పాటవాలెలాంటివో అంచనా వేయవచ్చు. మూడేళ్ల కిందట సత్య నాదెళ్ల ముంబై వచ్చినప్పుడు మేధాంశ్‌ ఆయనను కలుసుకున్నాడు. అప్పటికి అతడి వయసు ఎనిమిదేళ్లు మాత్రమే. సాధారణంగా ఆ వయసు పిల్లలు ప్రముఖులు కనిపిస్తే, వారితో చేయి కలిపి కరచాలనం చేస్తారు. వారితో కలసి ఫొటోలు దిగడానికి ఉత్సాహం చూపుతారు. మేధాంశ్‌ మాత్రం సత్య నాదెళ్లను కలుసుకున్నప్పుడు కరచాలనం చేసి, ఫొటోలు దిగడంతో సరిపెట్టుకోలేదు. తాను రూపొందించిన గేమ్‌ను, ‘లెట్‌ దేర్‌ బీ లైట్‌’ అనే యాప్‌ను నాదెళ్లకు ప్రదర్శించాడు. వాటి రూపకల్పన కోసం తాను ఉపయోగించిన కోడింగ్‌ పద్ధతులను విపులంగా వివరించాడు.

ప్రపంచ పరిణామాల గురించి తన పరిశీలనను కూడా అతడు సత్య నాదెళ్లతో పంచుకున్నాడు. పారిశ్రామిక వృద్ధికి, వ్యవసాయానికి మధ్య సమతుల్యత సాధించినప్పుడే కాలుష్యాన్ని అరికట్టడం సాధ్యమవుతుందని, అప్పుడే ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా ఎదగడానికి వీలవుతుందని చెప్పాడు. మేధాంశ్‌ మాటలకు సత్య నాదెళ్ల ముగ్ధుడయ్యారు. అయితే, మేధాంశ్‌ అంతటితోనే ఆగలేదు. ఏదో నాటికి మైక్రోసాఫ్ట్‌ సీఈవో కావాలన్నదే తన ఆశయమని, మైక్రోసాఫ్ట్‌ సీఈవో కావాలంటే ఏం చేయాలని సత్య నాదెళ్లనే నేరుగా ఎలాంటి తడబాటు లేకుండా అడిగాడు. ‘‘నీ ఆశయానికి మించి ఇప్పటికే సాధించావు. మైక్రోసాఫ్ట్‌ సీఈవో కావడం నీకు కష్టమేమీ కాదు’’ అంటూ సత్య నాదెళ్ల అతడికి కితాబునిచ్చారు.

అతివలకు సాంకేతిక అండ: సిద్ధార్థ్‌ మందాల
హైదరాబాద్‌కు చెందిన సిద్ధార్థ్‌ మందాల వయసు ప్రస్తుతం పంతొమ్మిదేళ్లు. అతడికి దాదాపు పన్నెండేళ్ల వయసున్నప్పుడు ‘నిర్భయ’ సంఘటన దేశాన్ని అట్టుడికించింది. అప్పట్లో జరిగిన నిరసన ప్రదర్శనల్లో తల్లితో కలసి పాల్గొన్న సిద్ధార్థ మహిళల రక్షణ కోసం ఏదైనా చేయాలని తలచాడు. నాలుగేళ్లు శ్రమించి ‘ఎలక్ట్రో షూ’ రూపొందించాడు. ఇది మామూలు పాదరక్ష మాత్రమే కాదు. పాదానికి ఇమిడిపోయే రక్షణ కవచం. ఈ పాదరక్షలు ధరించిన మహిళలపై దుండగులు ఎవరైనా అఘాయిత్యానికి తెగబడితే, ఈ పాదరక్ష తాకితే చాలు, విద్యుదాఘాతానికి గురవుతారు.

దుండగుడికి తక్షణమే విద్యుదాఘాతం కలిగించే ఏర్పాట్లు ఇందులో ఉంటాయి. అంతేకాదు, జీపీఎస్‌ పరిజ్ఞానం ద్వారా సమాచారం క్షణాల్లో పోలీసులకు, కుటుంబ సభ్యులకు స్మార్ట్‌ఫోన్ల ద్వారా చేరుతుంది. సిద్ధార్థ్‌ రూపొందించిన ‘ఎలక్ట్రో షూ’ ఆవిష్కరణకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ప్రశంసల జల్లు కురిపించారు. సిద్ధార్త్‌ ఒకవైపు చదువుకుంటూనే, శాస్త్ర పరిశోధనలూ సాగిస్తున్నాడు. అంతేకాదు, సామాజిక స్పృహతో ఒక స్వచ్ఛంద సేవా సంస్థను నెలకొల్పి, సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నాడు.

గుండెకు సాంకేతిక కవచం : ఆకాశ్‌ మనోజ్‌
ఎలాంటి ముందస్తు హెచ్చరికలూ లేకుండా చడీ చప్పుడు లేకుండా వచ్చిపడే గుండెపోట్లు ఎందరి ప్రాణాలనో కబళిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంభవించే గుండెపోటు మరణాల్లో 45 శాతం మరణాలు ఇలాంటి హెచ్చరికలు లేని గుండెపోట్ల కారణంగా సంభవిస్తున్నవేనని ‘మాయో క్లినిక్‌’ అధ్యయనంలో తేలింది. ఇలాంటి గుండెపోట్లను ముందుగానే గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎన్నో నిండు ప్రాణాలను గాల్లో కలిసిపోకుండా కాపాడవచ్చనుకున్నాడు హోసూరు బాలుడు ఆకాశ్‌ మనోజ్‌. ఇందుకు అతడి జీవితంలోనే ఒక నేపథ్యం ఉంది. ఆకాశ్‌కు పదమూడేళ్ల వయసులో అతడి తాతయ్య గుండెపోటుతో కన్నుమూశాడు. తాను ఎంతగానో ఇష్టపడే తాతయ్య గుండెపోటుతో చనిపోవడం ఆకాశ్‌ను తీవ్రంగా కలచివేసింది.

అయితే, దుఃఖంతో కుంగిపోకుండా పరిష్కారం కోసం ఆలోచించాడు. ముందస్తు హెచ్చరికలు లేకుండానే ముంచుకొచ్చే గుండెపోటు లక్షణాలను ముందుగానే గుర్తించగలిగే అద్భుత పరికరాన్ని రూపొందించాడు ఆకాశ్‌. ఇదేమంత భారీ పరికరం కాదు. చిన్న స్కిన్‌ ప్యాచ్‌. ముంజేతికి లేదా చెవి కింద అతికించుకుంటే చాలు. గుండెపోటుకు ముందుగా రక్తంలో పెరిగే ప్రమాదకరమైన ‘హెచ్‌–ఎఫ్‌ఏబీపీ’ పదార్థాన్ని గుర్తించి, తన స్పందనల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తుంది. వెంటనే ఆస్పత్రిలో చేరితే రోగిని కాపాడటానికి వీలవుతుంది. ఆకాశ్‌ రూపొందించిన పరికరానికి ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌), టోక్యో యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్, లండన్‌లోని రాయల్‌ సొసైటీ ఆఫ్‌ మెడిసిన్‌ వంటి అత్యున్నత సంస్థలు గుర్తింపునిచ్చాయి. ఈ ఆవిష్కరణకు గాను ఆకాశ్‌ మనోజ్‌ రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకున్నాడు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top